Vasthu Shastra |టెర్రస్ మీద కిచెన్ కట్టుకోవచ్చా? కడితే.. ఎటువైపు కట్టాలి? అలాగే, స్టాఫ్కోసం గది ఎటు వేయాలి? టాయిలెట్ కూడా కావాలి.
– డి. రమేశ్, వరంగల్
ఇంటి పైభాగాన్ని కూడా.. సంసారానికి అంటే, ఇతరత్రా పార్టీ వంటలకు కేంద్రం చేయడం అంత బాగుండదు. మేడ భాగాన్ని ఆహ్లాదంగా గడపడానికి వాడుకోవడం చాలా ఊరటనిస్తుంది. దానిమీద గదులు కట్టి, వంటలు పెట్టి, టాయిలెట్లు కట్టి.. హడావుడి చేయడం అవసరమా? మరోసారి ఆలోచించండి. మీరు కోరినట్టుగా వాడుకోవాలీ అంటే.. కిచెన్ మెట్ల వద్ద ఆగ్నేయంలో పెట్టుకోవాలి. దానికి దక్షిణంలో టాయిలెట్ వేసుకోవచ్చు. ఇక స్టాఫ్కోసంగది కట్టాలనుకుంటే.. నైరుతి భాగంలో కాకుండావాయ వ్యంలో కట్టండి. తప్పకుండా నైరుతిలో ఒక గది వేసుకొని దానిని మీరు (యజమాని) వాడుకోండి. స్టడీ లేదా గెస్ట్ బెడ్రూమ్గా.. లేదా స్టోర్‌గా కూడా వాడుకోవచ్చు. ఇల్లు దాని వాతావరణం మనకు ఆనందాన్నిఇవ్వాలి. జాగ్రత్తగా ఆలోచించి ఏర్పాటు చేసుకోండి.
ఇంటిని చూసి భూత-భవిష్యత్-వర్తమానాలు చెప్పవచ్చా?
– వి. జ్ఞానేశ్వర్, వైరా
ఇదేదో ఇంద్రజాల, మహేంద్రజాల విద్యకాదు. ఆ రంగంలో ఉండేవారికి అతి సులభమైన విషయం. ఒక డాక్టర్.. రోగి ముఖాన్ని చూసి, నాడిని గమనించి, కడుపులో తిప్పినట్టు అవుతుందా? వాంతులు అయ్యేలా ఉన్నాయా? పులుపు బేవులు వస్తున్నాయా? అని ఎలాగైతే చెబుతాడో.. ఇదీ అంతే! గృహం – దాని లక్షణం అంటే.. గృహస్థుల లక్షణమూ అవుతుంది. గుడిసెలో ఉండే బల్లి నల్లగా ఉంటుంది. అదే బల్లి తెల్లసున్నం వేసిన ఇంట్లో తెల్ల – గోధుమ వర్ణంలోకి మారుతుంది. పరిసరాలు, వాతావరణం మనుషుల (గృహస్థుల) హృదయాలను అమితంగా ప్రభావితం చేస్తాయి. విశ్వ నిర్మాణం అనంతుని జ్ఞానాత్మకమైన స్పందనల సమాహారం. సముద్రం అలలు.. సముద్రం లేకుండా ఉండవు. కానీ, అలలు ఆగినా.. సముద్రం ఉంటుంది. భౌతికంగా కనిపించే వాతావరణం, కనిపించని సృష్టికర్త వెలుగు శబ్దాల స్వరూపం. ఇది చాలా సూక్ష్మరూపంగా ఉంటూ.. మనచుట్టూ ఉండే భౌతిక వాతావరణానికి మూల ఇంధనం అవుతుంది. ఈ విశ్వనిర్మాణంలోకి మనిషి వచ్చి.. ఇష్టారీతిగా నిర్మాణాలు చేసి, కాలువలు, గోతులు, గట్లు తవ్వేసి.. ఇతరత్రా వక్రతలు సృష్టించి పోతాడు. తద్వారా భౌతిక వాతావరణంలో కొన్ని వికృతాలు చోటు చేసుకుంటాయి. అవి మన అంతర్గత మనో కేంద్రాన్ని ప్రభావితం చేస్తాయి. మనసులో కొంతభాగం ఆహారం, ఆహార్యం (రూపం)లో కొంతభాగం చేరుతాయి. ఆ వికృత వ్యవహారంలో.. ఆరో భాగం మనిషి వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది. ఇదంతా ఒక డీప్ స్టడీ.. ఇది తెలిసిన వారు ఇల్లు చూసి.. జరిగిన దానిని, జరగబోయే దానినీ చెప్పగలుగుతారు. అది అంతే! అతిశయోక్తి కాదు. సైన్స్ కోణంలో చూడాల్సిన అగత్యమూ లేదు.
పడమర-వాయవ్యం పెరిగితే దోషం లేదా? అక్కడ కూడా ఒక గది కట్టుకోవచ్చా?
– డి. సుకుమార్, సిద్దిపేట
చాలామంది ఏ దిశా పెరగకుండా ఉండాలి అనుకుంటారు. కానీ, శాస్త్రం మాత్రం కొన్ని దిశలు కొన్ని నియమాలతో పెరిగి ఉండవచ్చని సూచించింది. మీరు అన్నట్టు పడమర దిశవైపు పడమర – వాయవ్యం పెరిగి ఉంటే.. దానిని ఒక కొలత వద్ద మూలమట్టానికి చేసుకొని, ఇంటి భాగంలో కలుపుకోవచ్చు. అయితే, తూర్పు-ఈశాన్యంలో కూడా ఇంత స్థలం తప్పకుండా ఉండాలి. అలాగే.. పశ్చిమ- వాయవ్యం పెరిగి ఉన్నప్పుడు పడమరలో రోడ్డు ఉండకూడదు. పడమర రోడ్డులేని తూర్పు లేదా ఉత్తరం వీధి స్థలంలో పడమర-వాయవ్యం పెరిగినా.. దోషం లేదు. అయితే, ఆ పెరిగిన స్థలంలో గదులు (ఉప గదులు) కట్టకూడదు. దానిని లాన్ లేదా మొక్కల పెంపకానికి వాడుకోవచ్చు. ఆ స్థలం తోటలకు శ్రేయస్కరం. దీనివల్ల వాస్తును గౌరవించినట్టు ఉంటుంది, ఆహ్లాదమూ తోడవుతుంది.
పిల్లలకు ఏ దిశలోని గదులు ఇవ్వాలి? వారి వృద్ధికి ఎలాంటి గదులు కట్టాలి?
– కె. సత్యవతి, నాంపల్లి
నిజానికి ఇంటికి పిల్లల అభివృద్ధికి కేంద్రంగానే రూపొందించాలి. ఇంట్లో చిన్నపిల్లలు, స్త్రీలే ఎక్కువగా కాలం గడుపుతారు. వారి ఆరోగ్యం-ఆలోచనలు గొప్పగా రూపొందాలంటే.. ఇల్లు చాలా శాస్త్రీయంగా నిర్మించాలి. తూర్పు-ఉత్తరం ఎక్కువ మొత్తంలో ఖాళీ స్థలం ఉండాలి. దక్షిణ-పడమరల్లో కూడా డ్రై ఏరియా.. మొక్కలు, పచ్చదనం ఉండాలి. ఇల్లు దక్షిణం- ఉత్తరం వెడల్పుతో నిర్మితం కావాలి. స్థలం దిక్సూచికి మహత్తరంగా కుదిరి.. మూలమట్టానికి నిర్మితమవ్వాలి. ఇంటి మధ్యలో హాలు చతురస్రంగా లేదా దీర్ఘచతురస్రంగా ఏదేని రెండు దిశలు కలుపుకొని, విస్తారమైన గాలి-వెలుతురు వచ్చేలా ప్లాన్ చేయాలి. పిల్లలకు తూర్పు-ఉత్తరం లెట్రిన్ లేని గదులు కేటాయించాలి. దీనివల్ల అంతా మంచే జరుగుతుంది.