vasthu tips | ఇంటి మధ్య తప్పకుండా రూఫ్ ఓపెన్ చేసి కట్టాలని అంటున్నారు. అవసరమా? మా ప్లాను చూసి చెప్పండి.
– వి. గణేశ్, చేర్యాల
మనుషులు కొత్త కొత్త పోకడలు పోతున్నారు. ఎవరికి వారు ఉచిత సలహాదారులుగా మారుతున్నారు. పైపైన అందరికీ తెలిసిన విద్య ‘వాస్తు’. లోతు మాత్రం ఎవరికీ అంతుపట్టదు. నాలుగు గోడలు, పైన స్లాబు.. అనేది ఇల్లే. నాలుగు దిశలకు విస్తరించి, మధ్యలో గణిత సూత్ర ప్రధానంగా చతురస్రపు హాలు, నలు దిశలకు ప్రధాన ద్వారాలు, యజమాని హస్త కొలతలతో ఇల్లు దిశ ప్రధానంగా ద్వార నిర్ణయాలు, వీధులు, ఇంటి గర్భం ఎత్తు.. ఇలాంటి అనేక అంశాలతో కూడిన దానిని కూడా ఇల్లు అనే పిలుస్తారు. చెట్టు కింద రాయి పెట్టి, పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటాం. పట్టు వస్ర్తాలతో తిరుపతి వెంకన్న గర్భగుడిలో కూడా దండం పెట్టుకుంటాం. అక్కడా, ఇక్కడా దైవమే! కానీ స్థానం, నిర్మాణం, పవిత్రత ప్రాధాన్యాలు మారిపోయి ఉంటాయి! ఏ ఇల్లుకు ఆకాశం ఓపెన్ చేయాలి? ఏ ఛత్రశాల నిర్మాణాన్ని ఎలా నిర్మించాలి? అనే అంశాలు చాలా ఉంటాయి కదా! ఒక గదికి మధ్యలో లేదా ఒక రెండు పడక గదుల ఇంటికి మధ్యలో స్లాబ్ కట్‌చేసిన ఇంటి ప్లాన్ పంపారు. అది గృహం ఎలా అవుతుంది? కట్టేది సాధారణమైన స్లాబ్ ఇల్లు. దానికి బ్రహ్మ స్థానం ఓపెన్ చేయడం వాస్తు విరుద్ధం. ఇల్లును అలా ఆకాశ స్థానం ఓపెన్ చేసి కట్టాలి అంటే.. దాని నక్ష, నిర్మాణ విధానం వేరుగా ఉంటాయి. పాయసానికి, పరమాన్నానికి వండే విధానాలు వేరుగా ఉంటాయి కదా! మీరు ఎలా ఇల్లు కట్టాలనుకుంటున్నారో వివరించి, తెలిసిన వారిచేత నక్ష గీయించుకోండి. అప్పుడే దానికి శాస్త్ర ప్రాధాన్యం ఆపాదించబడుతాయి. సొంత నిర్ణయాలు మంచివి కావు. గొప్ప ఇల్లు.. వాస్తు ఇల్లు కట్టుకోండి.
మాకు వెట్ కిచెన్ ఆగ్నేయంలో, డ్రై కిచెన్ దానికి పడమరలో వచ్చాయి. మంచిదేనా?
– కె. రాజేశ్వరి, రామన్నపేట
మీరు వెట్ – డ్రై అని రెండు కిచెన్లు వేయాల్సిన అవసరం ఎందుకు? ఇది ఒక అనవసర విధానం. ఒక ఇంట్లో రెండు కిచెన్లు అనేది మంచిది కాదు. చిన్న డ్రై కిచెన్ – పెద్ద వెట్ కిచెన్ లేదా పెద్ద డ్రై కిచెన్ – చిన్న వెట్ కిచెన్.. ఇలా ఇంట్లోని దిశల విభజనను విచ్ఛిన్నం చేస్తున్నారు. మనిషి శరీరంలో జీర్ణ కోశాలు రెండు ఉంటాయా? రేపు ప్రధానమంత్రి కాబోతాడని రెండు గుండెలు పెడుతుందా ప్రకృతి? ఇంటికి ఒక కిచెన్.. అదీ ఆగ్నేయంలో ఉంటే చాలు. మీరు రెండో కిచెన్ అని దక్షిణంలో పెట్టారు. ఎప్పుడైతే దక్షిణం కిచెన్ వచ్చిందో.. ఇంటి విభజనలో అగ్ని స్థానం అధికపాలు ఆక్రమిస్తుంది. దానివల్ల స్త్రీలు మానసిక, శారీరక భారంతో కుంగిపోతారు. వెంటనే దక్షిణ భాగం కిచెన్ తొలగించండి. ఆగ్నేయం వరకు సర్దుకోండి. ఉత్తరం – దక్షిణం కలిసేలా గర్భంలో హాలుగా చేయండి. ఇల్లు మంచి ఫలితాలను ఇవ్వాలి. అంతేకానీ , ఆడంబరాలకు పోయి.. జీవితం ఆగం చేసుకోవద్దు.
డూప్లెక్స్ కడితే సీత్రూ (స్లాబ్ కటింగ్) ఎంత లెక్కలో ఉండాలి. ఎంతైనా పెట్టుకోవచ్చా?
– బి. రమాకాంత్, జూబ్లీహిల్స్
ఇంటికి సంబంధించిన స్థలంలో ఎంతభాగం నిర్మాణం చేస్తున్నామన్నది నిర్ణయించుకున్నాక.. ఇంట్లో మెట్లు దక్షిణం గానీ, పడమర గానీ తీసుకోవాలి. ఆ మెట్లు ఎంత వైశాల్యంలో నిర్మితమవుతున్నాయి అనే దానిని బట్టి ఆ సీత్రూ ఉంటుంది. సీత్రూను.. మరింత వెడల్పుగా తీసుకోవడం మంచిది కాదు. ఒకవైపు హాలు వస్తుంది కాబట్టి, దానిని బ్యాలెన్స్ చేయడానికి సీత్రూ అవసరం అవుతుంది. అలా అని ప్రతి డూప్లెక్స్ ఇంట్లో తప్పని సరిగా సీత్రూ ఉండాల్సిన అవసరం లేదు. కారణం.. కొన్ని ఇండ్లలో మెట్లు కేవలం పైకి వెళ్లడానికి మాత్రమే అన్నట్లుగా, ఎంత అవసరమో అంత మాత్రమే ఉంటాయి. ఉదాహరణకు ఒక్కో రేజర్ మూడు ఫీట్ల వెడల్పుతో, ఆరు ఫీట్ల వెడల్పుతో మెట్లు పెడుతారు. ఇవి అవసరార్థంగా ఉంటాయి. సమస్య అంతా ఆడంబరంతో కూడిన మెట్లు వేసినప్పుడే. మెట్ల నిర్మాణానికి మించి దక్షిణ – పశ్చిమంలో కటింగ్ అధికం అవుతున్నప్పుడు దానికి అభిముఖంగా ఉత్తరం – తూర్పులో స్ల్లాబ్ కటింగ్ (సీత్రూ) ఏర్పాటుచేయాలి. అది మరీ గర్భాన్ని దాటి వచ్చేలా పెంచవద్దు. మెట్లు కటింగ్, దాని మొత్తం వైశాల్యం కొలతలో ఉంటే చాలు. అతిగా కటింగ్ చేస్తే.. ఇంటి సమతుల్యత దెబ్బతీస్తుంది.
మాకు తూర్పు – ఈశాన్యం వీధి ఉంది. కానీ, ఉత్తరం గ్యాప్ లేకుండా ఇల్లు కట్టాం. దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి?
– కె. సాయికుమార్, ఉప్పల్
నిజానికి ఈశాన్యం వీధి మీకు ఆర్థిక వృద్ధిని ఇస్తుంది. పేరుప్రఖ్యాతలు కలిగిస్తుంది. కానీ, మీరు పంపిన ప్లాను చూశాను. మీ ఇంటికి ఉత్తరం సరిగ్గా లేదు. తద్వారా అది సంపూర్ణ దిశలు కలిగిన ఇల్లు కాలేదు. అలా అని అలాంటి దిశలకు అనుగుణమైన జాగ్రత్తలతో ఇల్లు నిర్మాణం చేయలేదు. మీరు అనుకుంటున్న ఉత్తరం భాగం.. అది ఈశాన్యం అవుతుంది. పైగా దానిని పక్క ఇంటికి ఆనించి మెట్లు, స్లాబ్ కలిపారు. తద్వారా ఈశాన్యం కొంతభాగం తెగి, మిగతా ఈశాన్యం మూతపడింది. అలాగే నైరుతిలో లెట్రిన్ గది వేశారు. ఇలాంటి ఇంట్లో ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. డబ్బులు ఉంటాయి. ఉద్యోగాలు ఉంటాయి. అయితే ఇంట్లో సభ్యులను దురలవాట్లు.. ముఖ్యంగా మగవాళ్లను అధోగతిపాలు చేస్తాయి. స్త్రీలు ఎక్కువ ఇబ్బంది పడుతారు. కారణం తూర్పు భాగంలో అధికం ఆగ్నేయంగా నడక సాగి.. టెన్షన్స్ ఉంటాయి. వీధి చూపు వల్ల సమృద్ధి. ఆ తూర్పు వీధి దిశల కారణంగా ఆగ్నేయం కావడం వల్ల స్త్రీకి కన్నీళ్లు ఉంటాయి. మగ సంతానం లేక ఇబ్బందులు పడతారు. వెంటనే ఇల్లు మారండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | పెద్ద ద్వారం ఇంటికి మధ్యలో ఉండాలా, చివర్లో ఉండాలా? ఏది మంచిది?
Vasthu Shastra | ఇంట్లో హోమాలు యజమాని చేయాలా? పూజారి చేయాలా?
Vasthu Shastra | ఇంట్లో మొదటిసారి పుట్టిన బాబుకు సూర్యదర్శనం, చంద్రదర్శనం చేయించాలని అంటారు. ఎందుకు?