Vasthu Shastra | గుడిలేని ఊరిలో ఇల్లు ఉండకూడదా? లే అవుట్లు చేసేవారు గుడి కట్టకపోతే ఎలా?
– ఎం. మాధవి, జిల్లెలగూడ
గుడిలేని ఊరిలో ఇల్లు ఉండకూడదని కాదు కానీ.. ప్రతి ఊరిలో ఓ గుడి ఉండాలి. కొత్త లే అవుట్లలో తప్పకుండా గుడి స్థలం వదలాలి. గ్రీనరీకి వదిలినట్టు గుడి, చర్చి, మసీదు.. అన్నీ ఉండొచ్చు. గుడి ఎప్పుడైతే వస్తుందో.. అప్పుడే ఒక సాంకేతిక శక్తి నిర్ధారితం అవుతుంది. తద్వారా ఆ కాలనీలో గొప్ప దిశాత్మక వీధులు, గృహ స్థలాలు మార్కింగ్ అవుతాయి. అది మహాశుభం. గుడి పురాతన, అవ్యక్త సాంకేతిక శక్తికి మూలకేంద్రం అవుతుంది. తెలియకుండానే ప్రకృతి చట్టాలు అక్కడ ఆమోదయోగ్యతను పొందుతాయి. ముఖ్యంగా అందరి మానసిక శక్తులు బలపడుతాయి. ఆ కాలనీ శాంతిధామంగా విలసిల్లుతుంది. దాదాపు మన రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రాముడు, శివుడు, హనుమాన్ ఆలయాలు కడుతూ ఉంటారు. లేదంటే.. మీరే పూనుకొని ఒక గుడి నిర్మించుకోండి. సంఘ జీవులుగా అది మన బాధ్యత కూడా.
మేము ఊళ్లో ఇల్లు కట్టాలి. పక్కవాళ్ల ఇల్లు పారు పట్టాలా? కాంపౌండు పారు పట్టి కట్టాలా? మాది దక్షిణం రోడ్డు.
– వి. సుజాత, ఎల్బీనగర్
ఎక్కడ కట్టినా, మన స్థలంలోని కాంపౌండు లోపల.. మనం అనుకున్న ప్రకారం గృహ నిర్మాణం చేపట్టాలి. వీధిని అనుసరించి కడుతూనే, పక్కవాళ్ల కాంపౌండును కూడా తప్పకుండా చూసుకోవాలి. అది స్థిరమైనదా? ఉత్తరోత్తర తీసి మళ్లీ కడతారా? అన్నది చూసి, దానిని అనుసరించే కట్టాలి. దక్షిణం-పడమర వీధులు వచ్చినప్పుడు ఇంటి కాంపౌండు పారు పక్కవారిది దాటకుండా మార్కింగ్ చేసుకోవాలి. ఏమాత్రం దాటినా.. మన నివాసానికి వీధిపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరి అవసరార్థం వాళ్లు స్థలాన్ని అనుసరించి, ఆర్థిక స్థితిని బట్టి చిన్నదిగా, పెద్దదిగా కడుతుంటారు. దాని కొలతలు, ఎత్తులు మనకు అవసరం లేదు. పక్కవాళ్ల ఇల్లు కాకుండా.. కాంపౌండును బట్టే కట్టాలి. పక్కవాళ్లు ప్రహరీలు కట్టలేదు అంటే.. వాళ్ల ఇల్లు పారుకు కట్టాలి.
స్థల ఆకృతి ఎలా ఉన్నా.. దానిని సరిచేసి ఇల్లు కట్టొచ్చా? ఎప్పటికీ మంచి ఫలితాలు ఉంటాయా?
– పి. శ్రీధర్, ఉప్పల్
ఎప్పటికీ ఉండవు. అవును స్థలాన్ని సరిచేసుకుంటాం. కానీ, సరిచేసుకోగా మిగిలిన స్థలం పక్కవారు కలుపుకొన్నపుడు ఎంతో మంచి ఫలితాలు వస్తాయి. అందుకు మనం ఇష్టపడాలి. దానంగానైనా ఇవ్వగలగాలి. నైరుతి భాగం పెరిగింది అని దానిని తొంభై డిగ్రీలకు కట్చేసినప్పుడు మనం ఉండబోయే స్థలం మూలమట్టానికి బాగుంటుంది. బాగా కనిపిస్తుంది. కానీ, మన పక్కనే ఉన్న ఆ పొరుగు ఇల్లు వాళ్లు దానిని ఈశాన్యంగా గుర్తించి కలుపుకోవాలి. అలాకాకుండా, ఇతరులకు ఇవ్వక తమకోసమే లోపలి నుంచి చిన్న గేటు పెట్టుకొని వర్కర్స్ గదులు కట్టి వాడితే.. దుష్ఫలితాలు తప్పవు. కొందరు దానిలో మట్టి నింపి బెడ్రూముకు కనిపించేలా చెట్లు పెంచుతారు. ఇలాంటి చర్యలు వందశాతం ఫలితాలు ఇవ్వవు. భూమి కాబట్టి అందరికీ అన్నంపెట్టే తల్లి కాబట్టి.. దానిని వేరుచేసినందుకు యాభైశాతం వరకు రక్షిస్తుంది. ఇల్లు వయసు పెరిగేకొద్దీ ఆ ఫలితం కూడా తగ్గుతూ ఉంటుంది.
మూడు కోణాలతో ఇల్లు కట్టకూడదు అంటారు. కానీ, పార్లమెంట్ భవనం కడుతున్నారు కదా!
– జి. వెంకటేశ్, ఆలేరు
ఇల్లు – భవనం – పార్లమెంట్.. ఏదైనా ఒక శాస్త్ర పద్ధతిలో కట్టడం వల్ల శుభ పలితాలు ఉంటాయి అన్నది మన వేద విజ్ఞానం చెబుతున్న సత్యం. చెప్పేవరకే కానీ, చేయిపట్టి కట్టించలేం కదా! ఎవరి నిర్ణయాలు వారివి. మూడు కోణాలతో అంటే.. మూడు మూలలు. అలాంటి నిర్మాణంతో ఇల్లు కట్టడం వల్ల వీధిని అనుసరించి ఆ నిర్మాణం ఉండదు. అలాగే అన్ని దిశలూ.. అంటే అష్టదిశల స్థానాలు ఉండవు. ఆ దిశలు అన్నీ రానప్పుడు ఆయా దిశల్లో ఉండే ప్రాధాన్యతలు కూడా.. ఆగ్నేయం వంటగది రాదు. అందులో వంటగది ఉండొచ్చు. కానీ, ఆ దిశలో ఉండదు. పెంటగది (లెట్రిన్) పెడతారు. కానీ, అది ఉండాల్సిన చోట ఉండదు. ఇలాంటి నిర్మాణాల ద్వారా గృహజీవితం నానా విధాలుగా భ్రష్టుపట్టి పోతుంది. నిర్మాణం ఏదైనా దాని పరిధిని అది వినాశనం చేసి తీరుతుంది.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Tips | ఇంట్లో సీతారాముల ఫొటోలు పెట్టొద్దు అంటున్నారు. నిజమా?
Vasthu Shastra | టెర్రస్ మీద కిచెన్ కట్టుకోవచ్చా? కడితే.. ఎటువైపు కట్టాలి?
Vasthu Shastra | పెద్ద ద్వారం ఇంటికి మధ్యలో ఉండాలా, చివర్లో ఉండాలా? ఏది మంచిది?
Vasthu Shastra | ఇంట్లో హోమాలు యజమాని చేయాలా? పూజారి చేయాలా?