Vasthu Shastra | అపార్ట్మెంటులో కింద – మీద ఎన్నో కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి కదా! ఆ నిర్మాణంలోని దోషాలు ఎవరికి వర్తిస్తాయి.. కొందరికా, ఒక్కరికా?
– సత్యనారాయణ, ఒంగోలు
ఇరవై ఏళ్ల క్రితం స్థలాలను చదును చేసి, సరైన కొలతలతో మూలమట్టం చేసి, చాలా జాగ్రత్తలు తీసుకొని ఇల్లు కట్టేవారు. అందరూ బాగుండాలని తపించేవారు. ఇవ్వాళ ఇల్లు అనేది ఖరీదైన వ్యాపార, విలాస వస్తువుగా మారింది. ఇల్లుంటే చాలు.. గొప్పగా అందరూ ‘అబ్బా!’ అనేలా ఉంటే చాలు.. అనుకొంటూ స్టేటస్ కోసం, ఇండ్లను ముండ్ల ఉయ్యాలగా చేసుకుంటున్నారు. స్థలంలో, నిర్మాణంలో ఎన్ని దోషాలు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఆధునికత- హంగులు ఉంటే చాలని మురిసిపోతున్నారు. మనిషికి ఆరోగ్యం-ఆనందం రెండూ అవసరం. కానీ, ఆ ఆరాటం అర్థరహితంగా మారుతున్నది. కారణం మనిషి ఆలోచనల్లో వస్తున్న పెడధోరణి. అందుకే, ఇండ్ల స్థలాల పక్కన నాలాలు ఉన్నా, చెరువులు ఉన్నా, వీధిపోట్లు ఉన్నా.. లెక్కచేయకుండా కడుతున్నారు. కొనేవారూ ఎగబడి కొంటున్నారు. మీరు అన్నట్టు.. కింద ఒక కుటుంబం, మీద ఒక కుటుంబం ఉన్న స్థలం.. దోషాలు,
పరిసర వాతావరణ దోషాలు అపార్టుమెంట్‌లోని అందరి మీదా ఉంటాయి. అదనంగా.. ఎవరి ఫ్లాట్‌లో ఎలాంటి దోషాలు ఉన్నా.. అవి ఆ కుటుంబం మీద కూడా ప్రభావం చూపుతాయి.
ఇంటి మెట్ల కింద స్టోర్ పెట్టుకోవచ్చా? దానిని ఎలా వాడుకోవాలి?
– బి. శ్రీనివాస్, లాల్‌బజార్
ఇంటి మెట్ల కింద స్థలం తప్పనిసరిగా వాడాలి అనే నియమం ఏముంది? దానిని అలా వదలడం తప్పుకాదు కదా! మూలలు మూయడం – మూలలు తెంపడం – మూలలు పెంచడం దోష విషయాలు. ఇంటికి ఉన్న నాలుగు ఉప దిశలు.. అంటే, ఈశాన్యం – ఆగ్నేయం – నైరుతి – వాయవ్యాలు. అవి చాలా కీలకమైన శక్తి మూలాలు. వాటిని సాధ్యమైనంత వరకు ఓపెన్‌గా పెట్టేలా ఇంటి నిర్మాణం చేయాలి. మీరు ఇంటి బయట మెట్ల (ఆగ్నేయం) కింద గది కట్టండి. నైరుతిలో మెట్లు ఉన్నా సరే.. మెట్లకింద గది సరైనది కాదు. ఆ దిశల మూలలు మూయడం వల్ల ఇంట్లోని సభ్యులకు కీళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇంటి మూలలకు – ఒంటి కీళ్లకు ఏంటి సంబంధం అనుకోవద్దు. ఇల్లు – ఒళ్లు కలిసిన జీవితంగా మనం మారిపోతాం. కారులో ప్రయాణించే మనిషిమీద కారువేగం ప్రభావం చూపుతుంది. దాని వేగం, శరీర వేగం సమానం. అలా ఇంటి నిర్మాణం – ఒంటి నిర్మాణం మీద ప్రభావం తప్పకుండా ఉంటుంది. మెట్ల కింద ఖాళీ వదిలి, దానిని వాష్ ఏరియాగా కానీ, పవర్ ప్యానెల్ బోర్డు కోసం కానీ ఓపెన్‌గానే వాడండి. మూయడం మంచిది కాదు.
ఈశాన్యం వైపు ఎక్కువ స్థలం వదిలితే వంశాభివృద్ధి అంటారు. అందరికీ వదిలేంత స్థలం ఉండదు కదా!? వారి వంశం వృద్ధి చెందదా?
– కె. రాజమౌళి, గోల్కొండ
ఈశాన్యం లేకుండా ఇల్లు కట్టడం మంచిదికాదు అని దాని భావన. సహజంగా చుట్టూ ఖాళీ వదిలిన ఇంటికి, ఖాళీ వదలని ఇంటికి ఆరోగ్య విషయంలో ఎంతో తేడా ఉంటుంది. ఇక్కడ ఇల్లు ఎంత కట్టాం? ఎంత ఖాళీ వదిలాం? అనేది ప్రధాన విషయంగా భావించాలి. నాలుగో వంతు ఇల్లు ఉండాలి, మూడు వంతులు ఖాళీ స్థలం వదిలేయాలి. దాన్ని దైవస్థలం అని పిలుస్తారు. మీరు భూమిని చూసినా.. విశ్వంలో పదార్థాన్ని చూసినా అంతే మొత్తం ఖాళీ ఉంటుంది. వాడుకునే భూమి ఎంత? సముద్రాలు ఆవరించిన ప్రదేశం ఎంత? మీరే ఆలోచించండి. కానీ, ఎక్కువ స్థలం వదిలే అవకాశం అందరికీ ఉండదు. కనీసం ఇంటి చుట్టూ ఖాళీ ఉంటే.. ఈశాన్యంలో స్థలం వదలడం మంచిది. ఎందుకంటే.. ఈశాన్యం సూర్యోదయ కేంద్రం. ‘విటమిన్-డి’తో కూడిన ఉదయపు లేత ఎండ ఇంటిని ఆరోగ్యసిరులతో నింపుతుంది. శాస్త్రం పూర్ణత్వాన్ని ప్రవచిస్తుంది.. కలిమిలేములను కాదు.
ఇంటి ద్వారానికి సిమెంట్, స్టీలుతో చేసిన ద్వారాలు పెట్టుకోవచ్చా? సేఫ్టీ ఉంటుంది కదా!
– సీహెచ్ రాములు, మేడిపల్లి
చాలా ఇబ్బందికరమైన అంశం ఇది. ఇల్లంటే కేవలం ఒక రేకు డబ్బాగానో.. సిమెంట్ పెట్టెగానో భావించడం వల్ల కలుగుతున్న సందేహాలు ఇవి. అంతేకాదు, చాలామంది అలాగే కడుతున్నారు కూడా! ఒకవైపు గ్రీన్ కాన్సెప్ట్ నిర్మాణాలకు ప్రధానపీఠం వేస్తూ ఉంటే, మీరు మీ ఇంటికి సిమెంట్ డోర్లు పెడతాం. స్టీలు, ఇనుప ద్వారాలు బిగిస్తాం అంటే ఎలా? మీ ప్లాన్ చూశాను. చాలా విశాలమైన ఇల్లు కడుతున్నారు కదా? రక్షణ కోసం డైరెక్టుగా సిమెంటు ఫ్రేములు, స్టీలు డోర్లు పెట్టడం చాలా తప్పు. జీవ సింహద్వారం కావాలి. అందుకే, టేకు ద్వారాలు ప్రాముఖ్యం పొందాయి. అవి చాలా ఏళ్లు జీవంతో ఉంటాయి. సహజసిద్ధంగా దొరికే ఇతర కర్ర ద్వారాలు అయినా వాడండి. సిమెంట్ గడపల ద్వారాలు, స్టీలు తలుపులు ప్రధాన ద్వారాలుగా ఉండకూడదు. ఇంటికి సింహద్వారం పెట్టుకొని, రక్షణ కోసం అదనంగా గ్రిల్ డోర్లు పెట్టుకోండి. ఎంతవరకు ప్రకృతిసిద్ధంగా లభించే వస్తువులతో కడుతున్నాం అనే దానిపైనే ఇంటి వైభవం ఆధారపడుతుంది. వైభవం అంటే.. డబ్బు కాదు. శాంతియుత జీవితం.