Vasthu Shastra | నేను ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాను. మా శ్రీమతిని తరచూ అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. వాస్తు దోషాలే దీనికి కారణమా?
– పి. యాదగిరి, రామన్నపేట
వృత్తిరీత్యా చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. రాజకీయ నాయకులకు ఇంటి జీవితం చాలా తక్కువగా ఉంటుంది. అలా అని దాన్ని వారి ఇండ్ల దోషంగా భావించకూడదు. ఆడవారి అనారోగ్యానికి గృహ దోషాలు తప్పక కారణం అవుతాయి. స్త్రీలు ఎక్కువ సమయం ఇంటినే ఆశ్రయించి ఉంటారు. పైగా వాళ్ల శరీరాలు సున్నితంగా ఉంటాయి. కాబట్టి ఇంట్లో దోషాలు లేకుండా చూసుకోవాలి. చాలా ఇండ్లల్లో సెప్టిక్ ట్యాంకులు ఆగ్నేయంలో, లేదంటే ఉత్తర – ఈశాన్యంలో పెడతారు. ఇలాంటి గోతులు తీవ్ర అనారోగ్యాలకు కారణం అవుతాయి. అవి ప్రధానంగా స్త్రీల మీదనే ప్రభావం చూపుతాయి. అలాగే దక్షిణం ద్వారం పెట్టి, ఉత్తర ద్వారం పెట్టరు. ఆగ్నేయం అధికంగా తెంపు చేసి, కారు పార్కింగ్ పెడతారు. దక్షిణంలో కిచెన్ ఏర్పాటు చేసుకుంటారు. ఇలాంటి దోషాలు ఉంటే మాత్రం వెంటనే వాటిని సవరించుకోండి.
మేం ఫార్మ్‌హౌజ్ కట్టాలని అనుకుంటున్నాం. ఇంటి మధ్య కోర్టుయార్డ్ పెట్టి కట్టాలి. అలా కట్టొచ్చా? అయితే, అది ఎంత వైశాల్యంలో ఉండాలి?
– కె. సిద్ధార్థ, మెట్పల్లి
మంచి ఆలోచన. కట్టుకోవచ్చు. అది మన సంప్రదాయంలో ఉన్న నిర్మాణమే! దాన్నే మనవాళ్లు ‘గచ్చు ఇల్లు’, ‘ఛత్రశాల భవనం’ అనేవారు. ప్రతిదానికి ఇంటి నిర్మాణ వైశాల్యాన్ని బట్టి కొలతలు ఉంటాయి. మీరు నేలమీద కోర్టుయార్డు ఇల్లు కట్టాలి అనుకుంటే.. అందులో బెడ్ రూములు, వాటి కొలతలు లెక్కలోకి తీసుకోవాలి. అయితే, నైరుతి గది కొలతను మించి, బ్రహ్మస్థానం ఓపెన్ చేయకండి. డూప్లెక్స్ వేరు. ఓపెన్ టు స్కై ఇల్లు వేరు. పైన ఆకాశం కనిపిస్తూ.. గాలి – ఎండ – వర్షం అన్నీ ఇంట్లోకి వస్తుంటాయి. కాబట్టి, అన్ని రకాలుగా, శాస్త్రబద్ధంగా పరిశీలించుకొని, గచ్చు ఇల్లు కట్టుకోండి.
మాది వ్యాపారం. కమర్షియల్ బిల్డింగ్‌పైన ఇల్లు కట్టుకొని ఉండవచ్చా?
– డి. శివ, కోమటిచెరువు
పెద్దపెద్ద పట్టణాల్లో కమర్షియల్ భవనాలు రెండురకాలుగా ఉంటాయి. పూర్తిగా వ్యాపారం కోసమే కట్టినవి కొన్ని భవనాలు, వ్యాపారంతోపాటు నివాసం కోసం కట్టినవి కొన్ని భవనాలు. కొందరికి వ్యాపారం-ఇల్లు
ఒకేచోట పెట్టుకోకుంటే నడవదు. అలా ఉండటం దోషమూ కాదు. కిందనే ఇల్లు – షాపు పెద్దగా ఏర్పాటు చేసుకొని కూడా ఉండవచ్చు. అయితే కింద భాగంలో పూర్తిగా వ్యాపారం, పై భాగంలో పూర్తిగా నివాసం ఉండటం మంచి నిర్ణయం. తద్వారా దేనికదే గొప్పగా ఉంటాయి. మీరు మీ భవనాన్ని అవసరాన్ని బట్టి కింద పెద్దహాలుతో స్టోరు, గల్లా పెట్టె (అంటే, కూర్చునే చోటు) సరైన స్థానంలో అమర్చుకోండి. పైభాగంలో పడక గదులు, కిచెన్, పూజగది.. బయటినుంచి మెట్లు పెట్టుకోండి. శాస్త్రపరంగా, మంచి అమరికతో భవనం కట్టుకోండి. మంచి అభివృద్ధి, వైభవం చూడగలరు. ఏదైనా ముందే ఓ స్పష్టతతో కట్టుకోవాలి.
ఇంటికి తూర్పులో కారు పార్కింగ్ కావాలి. ఎలా ఏర్పాటు చేసుకోవాలి?
– డి. శ్రీరాములు, మెహిదీపట్నం
ఇంటిని కట్‌చేసి పార్కింగ్ పెట్టడం మంచిదికాదు. మీరు పంపిన ప్లాన్‌లో ఐదు కార్లకు పార్కింగ్ సూచించారు. తద్వారా ఇంటికి తూర్పుభాగమే లేకుండా పోతుంది. కార్లు పెట్టడం తప్పనిసరి అయినప్పుడు.. అదికూడా బిల్డింగ్ కిందే రావాలి అనుకుంటే, కింది భాగంలో ఇల్లు కట్టే ఆలోచనే మానుకోవాలి. లేదంటే.. స్థలం ఉంది కాబట్టి దానికి ప్రత్యేకంగా.. మరోపక్క స్థలం కేటాయించాలి. మీరు అనుకున్నట్టుగా ఇల్లు రావాలి అంటే.. కింద స్టిల్ట్ చేసుకొని, గ్రౌండ్ నుంచి వదిలి, డూప్లెక్స్ ఇల్లు కట్టండి. లిఫ్ట్ – మెట్లు పెట్టుకొని.. పైన, ఆపైన ఇల్లు కట్టినట్లయితే, ఎలాంటి దోషాలూ వచ్చే అవకాశం ఉండదు. శాస్త్రం కుదురుతుంది.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vaasthu Shastra | ఒక్క కొడుకు ఉంటే.. అతనికి తూర్పు రోడ్డు ఇల్లు మాత్రమే కట్టి ఇవ్వాలా?
Vasthu Shastra | ఆగ్నేయం ఇంటికి సెల్లార్ ఉండవచ్చా?
Vasthu Shastra | ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా?
Vasthu Shastra | మా కాలేజీకి ఈశాన్యంలో సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది.. దీనివల్ల ఏమైనా కీడు జరుగుతుందా?
Vasthu Shastra | ఇంటి మధ్యలో దేవుళ్ల విగ్రహం పెట్టొచ్చా? వాస్తు ఒప్పుకొంటుందా?
Vaastu | కవల పిల్లలకు స్థలం కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఇద్దరికీ ఒకే రోడ్డు ఉండాలా?