Vasthu Shastra | ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా? వాటికి గదులు ఎక్కడ కట్టాలి?
– చిన్నికృష్ణ, ములుగు
మనుష్యాలయం.. అనేది ఇంటికి శాస్త్రం పెట్టిన పేరు. కోళ్ల ఫారమ్ అని కోళ్ల పెంపకం కోసం మనమే పెట్టిన పేరు. మన ఇంటితోపాటు ఇతర జీవులు ఉండాలా? లేదా అనేది మనం ఆలోచించాలి. ఒక గృహం కట్టినప్పుడు ఇంటి ప్రాంగణంలో చెట్లు, లాన్ ఏర్పాటు చేసుకున్నాక.. ఇతరత్రా జీవులు వాటంతట అవే రావడం, నివసించడం వేరు. మనకు మనంగా పక్షుల గూళ్లు కట్టడం, కుందేళ్లు పెంచడం, అక్వేరియం పెట్టడం.. ఇవన్నీ తప్పక చేయాల్సిన కార్యాలు కావు. జంతువులను పెంచి, అమ్మే వ్యాపారం వేరు. గృహంలో మనతో కూడా వాటిని పెంచడం వేరు. ఇతర జీవులను బంధించి ఆడంబరం కోసం పెంచడం మంచిది కాదు. వేటి స్వేచ్ఛనూ మనం హరించ కూడదు. ఒకవైపు పెద్దవాళ్లను ఇంటికి దూరంగా వృద్ధాశ్రమాల్లో వేస్తూ.. జంతువులను మాత్రం ఇంట్లో పెంచుతారు కొందరు. ఇది గృహజీవన విధానం కాదు. వేటి జీవన విధానం వాటిదే! మనం గృహధర్మం
అనుసరిస్తే.. చాలు.
సెల్లార్ లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ పర్మిషన్ రావడంలేదు. ఇలాంటప్పుడు వాస్తుదోషం ఎలా సవరించాలి? మాది తూర్పు – దక్షిణం రోడ్డు స్థలం.
– వి. ప్రసూన, వరంగల్
అవును.. వీధుల్లో కార్లు పెట్టి వ్యాపారాలు నడపలేరు కదా! కమర్షియల్ భవనాలకు పార్కింగ్ తప్పనిసరిగా అవసరమే! నిజానికి వాస్తుదోషం అన్నిటికీ వర్తిస్తుంది. కానీ, ఏది మంచో ఆలోచించాలి. మీది తూర్పు స్థలం కాబట్టి, సెల్లార్ తీయడం మంచిదికాదు. అయితే, ఒక మార్గం ఉంది. మీ స్థలానికి పడమర వైపుకూడా ఒక రోడ్డును మనమే ఏర్పాటుచేసి, పడమర నుంచి కానీ.. దక్షిణం రోడ్డు ఉంది కాబట్టి, దక్షిణం నుంచి కూడా సెల్లార్లోకి వెళ్లేలా ర్యాంపు తీసుకొని, నేల లోపల కార్ పార్కింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీది మూడు రోడ్ల కూడలి అవుతుంది. ఫలితాలు కూడా ఉన్నతంగా అందుతాయి. మరో రోడ్డు ఏర్పాటు వల్ల స్థలం సరిపోదు అని భావిస్తే.. దక్షిణం నుంచి సెల్లార్లోకి వెళ్లేలా ఏర్పాటుచేయండి. ఇంటికన్నా.. వాణిజ్య స్థలానికి సెల్లార్ ప్రభావం తక్కువగా ఉంటుంది. కారణం.. అది ప్రజాక్షేత్రంగా రూపొందుతుంది. వ్యాపారం అంటేనే.. ధర్మాధర్మాలు ఉంటాయి.
ఆఫీస్ బిల్డింగ్కు ఒక మూల కట్ చేసి ఉంటే.. కొనవచ్చా?
– దానం కృష్ణ, బీరంగూడ
ఆఫీస్కే కాదు.. ఇంటికైనా అన్ని మూలలూ తెంపు లేకుండా ఉంటేనే మంచిది. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల కొన్ని కోణాలు తెంపు చేసుకొని, కడుతూ ఉంటారు. అలాంటప్పుడు అవి ఏ మూల అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మీరు ఏ మూల తెగిందో రాయలేదు. నైరుతి – ఈశాన్యం మూలలు తెంపు కలిగి ఉంటే.. ఆ బిల్డింగ్ ఎట్టి పరిస్థితిలో పనికిరాదు. ఇంటి ఈశాన్యం తెగిపోతే.. ఆ బిల్డింగ్ కొనవద్దు. ఒకవేళ ఆగ్నేయం అయినా, వాయవ్యం అయినా తెగినట్టు అయితే, ఆ తెంపు కూడా కొలతలకు సరైన విధంగా ఉంటే.. అంటే, ఉత్తరంలో మూడోభాగం, వాయవ్యం కానీ, తూర్పులో మూడోభాగమైన తూర్పు-ఆగ్నేయం కానీ తెగి ఉంటే.. ఆఫీస్ వాడకానికి దోషం లేదు. అన్నీ చూసుకొని నిర్ణయం తీసుకోండి.
సగం కట్టి ఆగిపోయిన ఇంటిని కొనుక్కోవచ్చా?
– కె. పద్మ, నిర్మల్
ఇండ్లు అందరూ కట్టలేరు. అందరూ తాము కట్టిన ఇంట్లో ఉండలేరు. దానినే గృహయోగం అంటారు. డబ్బులు ఉంటే, జాగా ఉంటే, కోరిక ఉంటే కాదు. ప్రకృతి (దైవం) సానుకూలత కూడా ఉండాలి. మీరు ఆగిన ఇల్లు కొనాలనుకుంటే.. తప్పక కొనవచ్చు. అయితే, ఆ నిర్మాణం ఎందుకు ఆగిపోయిందో కూడా చూడాలి. అందులో వాస్తు వంకరలు (దోషాలు) ఉన్నాయేమో చూడాలి. మార్పులకు అవకాశం ఉందా అన్నది కూడా గమనించాలి. గృహం లోపల విభజనలో తప్పులు ఉంటే.. సరిచేసుకోవచ్చు. అలా కాకుండా.. వీధిపోట్లు ఉంటే, మార్పు అసాధ్యం కదా! ఆ విధంగా కొనే ఇల్లు చట్టబద్ధంగా, శాస్త్రబద్ధంగా అనుకూలం అనుకుంటే తప్పక కొనవచ్చు. అన్ని దోషాలు సరిచేసి, ఆనందంగా నివాసం చేయవచ్చు. కట్టే వ్యక్తికి తాను ఉంటున్న ఇంటి దోషాల వల్ల, ఆర్థిక, అనారోగ్య కారణాల వల్ల నిర్మాణం ఆగిపోయి ఉండొచ్చు. అవి అతనికే పరిమితం. కొనే స్థలం, నిర్మాణం అనుకూలమైతే నిరభ్యంతరంగా కొనుక్కోండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | ఇంటి మధ్యలో దేవుళ్ల విగ్రహం పెట్టొచ్చా? వాస్తు ఒప్పుకొంటుందా?
Vaastu | కవల పిల్లలకు స్థలం కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఇద్దరికీ ఒకే రోడ్డు ఉండాలా?