Vaastu | మాకు పడమర రోడ్డు పది అడుగుల కిందికి ఉన్నది. తూర్పు రోడ్డు పది అడుగుల ఎత్తులో ఉన్నది. ఆ స్థలంలో ఇల్లు ఎలా కట్టాలి? అసలు కట్టొచ్చా?లేదా మట్టి నింపి కట్టుకోవాలా?
– కె. శంకర్, వారాసిగూడ
తూర్పు ప్రధానంగా ఇల్లు కట్టుకోవచ్చు. అంటే మీ ముఖద్వారం తూర్పు పెట్టుకొని ఇల్లు కట్టండి. ఇక్కడ రెండు అంశాలు చూడాలి. పడమర వీధికి సమానంగా స్థలం ఉంది కాబట్టి, తూర్పు వీధికి అనుకూలమైన ఎత్తులో స్లాబ్ వేసుకొని పడమర వీధి నిర్మాణం లేదా సెల్లార్‌ను అద్దెకు ఇవ్వండి. అది జీవితకాలం.. అద్దెకు మంచిది. తూర్పు వీధిని అనుసరించి దానికి ముఖద్వారంగా చేసుకొని ఇల్లు నిర్మించండి. తద్వారా స్థలం వినియోగంలోకి వస్తుంది. మట్టి నింపి కట్టినా.. పడమర వీధి మీకు కిందికే ఉంటుంది. ఇలాంటి చోట ఆ దిశకు వినియోగవంతమైన జీవన విధానం ఉండటం మంచిది. తద్వారా ఆ లోతు ప్రభావం యజమానిపై ఉండదు. ఇద్దరికీ మంచి ఫలాలు అందుతాయి. కిందిభాగం అంటే, పడమర నిర్మాణానికి కూడా చుట్టూ ప్రదక్షిణం ఉండేలా చూసుకోవాలి.
మాకు కవల పిల్లలు. వాళ్ల కోసం స్థలం కొనాలని అనుకుంటున్నాం. ఇద్దరికీ ఒకే రోడ్డు ఉండాలా? వేర్వేరు రోడ్లు ఉండొచ్చా?
– బి. శ్రీలత, దిల్సుఖ్నగర్
కవలలే అయినా.. ఎవరి ఇష్టానుసారం వారివారి స్థలాలు ఎంచుకోవచ్చు. ట్విన్స్ అయినంత మాత్రాన ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉండాలని లేదు. ఎవరి స్వభావాలతో వారు పుడతారు. రూపాలు ఒక్కటైనంత మాత్రాన ఒకే స్వభావం కలిగి ఉండటం జరగదు. మీరు తూర్పు రోడ్డు, ఉత్తరం రోడ్డు.. ఏ రోడ్డులో అయినా ఒకేచోట ఇండ్ల స్థలాలు తీసుకోవచ్చు. లేదా ఒకరికి తూర్పు వీధి, మరొకరికి ఉత్తరం వీధి.. ఇలా దొరికిన దానిని బట్టి పడమర – దక్షిణం వీధుల స్థలాలు కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఏవి కొన్నా, ఏ దిశకు కొన్నా.. వాస్తుపరంగా బాగున్నవి, దిశలు ఉన్నవి కొనండి చాలు!
మాకు దక్షిణం – పడమర రోడ్లు ఉన్నాయి. షాపులు, ఇల్లు కలిపి కట్టాలి. ఎలా కట్టాలి?
– కె. ధనలక్ష్మి, భువనగిరి
మీది నైరుతి బ్లాకు స్థలం. అక్కడ పడమర వీధి ప్రధానంగా చేసుకొని గృహం నిర్మించండి. ఆ స్థలంలో దక్షిణం రోడ్డుకు షాపులు వేసి కమర్షియల్‌గా వాడండి. మిగతా భాగం అంటే.. ఉత్తరం భాగం సెల్లార్ చేసి.. అంటే స్టిల్ట్గా చేసి.. దానిని పార్కింగ్ చేయండి. ఆ స్థలంలో తూర్పు – ఆగ్నేయంలో మెట్లు, లిఫ్ట్ పెట్టుకొని.. పైన తూర్పు ముఖంగా ఇల్లు శాస్త్ర సమ్మతంగా కట్టుకోండి. నైరుతి భాగం చెడ్డది కాదుకానీ, దానిని చాలా జాగ్రత్తగా నిర్మించాలి. తూర్పు – ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ వదిలి ఇల్లు కట్టాలి. దక్షిణం – పడమర వీధులు చాలా కిందికి ఉన్నా, తూర్పు – ఉత్తరం స్థలం ఎత్తులో ఉన్నా, దిశ లేకున్నా.. ఆ స్థలంలో ఇల్లు కట్టడం మానేయాలి. నైరుతి బ్లాకులో నిర్మాణం అనేది శాస్త్రం తెలుసుకొని చేయాల్సి ఉంటుంది.
మాస్టర్ బెడ్రూమ్ పక్కన సీత్రూ చేసి.. లాన్, చెట్లు పెంచుకోవచ్చా?
– అంజన్ యాదవ్, కోదాడ
ఎక్కడ పడితే అక్కడ స్లాబ్‌లు కట్ చేసి, గోతులు చేసి లాన్ కోసమో.. చెట్ల కోసమో ఇంటిని వక్రంగా మార్చవద్దు. అలా చేస్తే.. అది ఇల్లు కానేకాదు. ఇల్లు పాల పొదుగులాంటిది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు పంపిన ప్లాన్ పరిశీలించాను. మాస్టర్ బెడ్రూమ్కు వాయవ్యంలో స్లాబ్ కట్‌చేసి, అక్కడ
లాన్చేసి ఒక చెట్టు పెంచి.. దానిలోకి వెళ్లడానికి మాస్టర్ బెడ్రూమ్కు వాయవ్యంలో గ్లాస్‌డోర్ పెడుతున్నారు. ఇదంతా లక్షణంగా ఉన్న ఇంటిని చెడగొట్టు కోవడమే అవుతుంది. ఇంటిని ఇంటిలా కట్టండి. ఇంటిలో కోర్టు యార్డు, లాన్.. వగైరా అందంగా కట్టాలి అంటే.. ఛత్రశాల నిర్మాణం చేసుకొని గర్భ
స్థానంలో ఓపెన్ టు స్కై ఏర్పాటు చేసుకోండి. గొప్ప నిర్మాణం ఎప్పుడూ శాస్త్రపరంగానే చేయాలి. దేనికైనా ఒక విధానం ఉంటుంది. దాన్ని తప్పక అనుసరించాలి. లేకపోతే ఫలితం అనుభవించాల్సి ఉంటుంది.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక, ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678