Vasthu Shastra | వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే సుఖ సంతోషాలు ఉంటాయా?
– ఎ. నారాయణమూర్తి, ఖమ్మం
వాటికోసమే కదా శాస్ర్తాలు ఉన్నాయి. జీవితంలో సుఖసంతోషాలు కాదు కావాల్సింది. ఒక సుస్థిరమైన శాంతి. సుఖం, దుఃఖం అనేవి అనివార్యం. వస్తూ పోతూ ఉంటాయి. నిజానికి అవి రెండూ మనకు అవసరం లేదు. కారణం.. వాటి ప్రమేయంగానే మనం ఈ నేలమీదికి వచ్చాం. ఇట్టే వచ్చి అట్టే పోయేవి ఎందుకు? ఎప్పుడూ ఉండే, తరగని శాంతి మనకు అవసరం. అందుకే, మనిషి పరుగులు తీస్తుంటాడు. ఇల్లు అంతిమ లక్ష్యం కూడా అదే! మనిషిని చిన్నచిన్న సంతోషాలతో మభ్యపెట్టి మాయచేయడం వల్ల శాశ్వత ఆనందం దూరంగా ఉండిపోతుంది. యజమాని తాత్కాలికమైన తళుకు బెళుకులకు మించిన ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఆలంబనగా నిలుస్తుంది గృహం. చాలామంది వాస్తు .. సుఖాలు, సంతోషాలు, పెండిళ్లు, డబ్బు.. వగైరాలు మాత్రమే ఇస్తుంది అనుకుంటారు. కానీ, అనల్ప ఫలం కూడా గృహం నుంచే సిద్ధిస్తుందని గుర్తుంచుకోవాలి.
మాకు కార్ల వాషింగ్ వ్యాపారం ఉంది. మరొక నీళ్ల సంపు అవసరం అవుతుంది. షాపులోనే తవ్వుకోవచ్చా? మాది దక్షిణం రోడ్డు.
– వి. కిరణ్ రెడ్డి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, హైదరాబాద్
ఇంటి ఆవరణలో తూర్పు లేదా ఉత్తరం వైపు, లేదంటే ఈశాన్యం వైపు.. నీళ్ల సంపులకు అనుకూల స్థలం. మీకు నీళ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. పైగా మీది దక్షిణ ముఖం వ్యాపారం. మీ ఇల్లు ఉత్తరంలో ఉంది. మీరు దక్షిణం వైపు షాపులను వ్యాపార స్థలంగా మార్చుకున్నారు. అలా అని ఆ షాపులలో గొయ్యి తవ్వి.. నీళ్ల సంపు కట్టుకోవడం మంచిది కాదు. మీ ఇంట్లోని ఉత్తరం -ఈశాన్యం గదిలో ద్వారంవైపు రాకుండా, ఆ గదిలోపల ఇంటి పిల్లర్లకు తాకకుండా మధ్యలో.. అవసరమైన కొలతలతో నీళ్ల సంపు నిర్మించుకోండి. అందులోంచి ఒక నాలుగు అంగుళాల పైపును బయటికి తీసుకొని, దానినుంచి నీళ్లు నింపుకోండి. ఆ సంపును మీ వ్యాపారానికి వాడుకోండి. వ్యాపారం దక్షిణం కదా.. అని దక్షిణం షెట్టర్లలో (షాపుల్లో) నీళ్ల గుంతలు కట్టవద్దు. దోషం అవుతుంది.
మా ఇంటి పక్కనుంచి కొత్తగా ఫ్లై ఓవర్ (వంతెన రోడ్డు) పడింది. దానివల్ల మాకు మంచా, చెడా?
– ఎ. లక్ష్మి, ఇజ్జత్గూడ
మహానగరాల్లో ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు జరుగుతుంటాయి. అవి ఆగేవి కావు. ఆపలేం కూడా. అయితే మన గృహాలమీద ఆ పరిసరాల ప్రభావం ఎంతోకొంత ఉంటుంది. ముఖ్యంగా ఇంటిని శాస్త్రబద్ధమైన ప్రాంగణంలో.. అంటే ప్రహరీతో కట్టిన ఇండ్లకు ఈ ప్రభావం అంతగా కనిపించదు. కానీ, సాధారణ ఇండ్లను ఆ నిర్మాణాలు తప్పక ప్రభావితం చేస్తాయి. అందుకే ఇంటి నిర్మాణం ‘ఎక్కడ?’ అనే కోణంలో ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఫ్లై ఓవర్లు, వంతెనలు, రైల్వే ట్రాక్‌లు, ఫుట్ ఓవర్లు.. మన నివాసానికి దగ్గరలో వస్తే, గృహాల్లో శబ్ద కాలుష్యం పెరుగుతుంది. ఆ మేరకు తగిన జాగ్రత్తలు తప్పవు. ఆ దిశలో కిటికీలు మూయడం, దుమ్ము రాకుండా చూడటం వగైరా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిర్మాణాలు ఒక్కోసారి దిశను బట్టి శుభపరిణామాలను కూడా కలిగిస్తాయి. ఏవి మంచివి? ఏవి ఇబ్బంది కలిగించేవి? అనేది ఆయా దిశల ఇండ్లను బట్టి ఉంటుంది. ఒకసారి వాస్తు నిపుణులను సంప్రదించండి.
మాకు ఇల్లు సరిపోదని దక్షిణం స్థలాన్ని కొన్నాం. అందులో సగం వరకు ఇల్లు పెంచుకోవచ్చా? వాస్తు పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
– జి. చంద్రశేఖర్, సుచిత్ర
నిజమే! కొంతకాలానికి కుటుంబసభ్యులు పెరిగి ఇంట్లో గదుల అవసరం ఎక్కువ అవుతుంది. అలాఅని ఇంటిని ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలొద్దు. మీరు దక్షిణం స్థలం కొనడం మంచిదికాదు. కొన్నా.. దానిలో పూర్తి ఇల్లు కట్టి అందులోనే నివాసం ఉండాల్సి వస్తుంది. ఉన్న ఇంటిని వదిలివేయాల్సి వస్తుంది. ఉన్న ఇంటిని దక్షిణంలోకి ఎంతోకొంత జరిపి కట్టాలనుకునే ఆలోచన వద్దు. పైగా మీరు ఆ దక్షిణం స్థలంలోకి ఇంటిని సగం వరకు జరిపి కట్టాలని అనుకోవడం పూర్తిగా శాస్త్ర విరుద్ధం. పెద్ద దోషం కూడా. పాత ఇంటినే మరో అంతస్తు లేపండి. లేదంటే డూప్లెక్స్, ట్రిప్లెక్స్గా మార్చుకోండి. ఇప్పుడున్న దక్షిణం పడక గదులను పెంచుకోవచ్చు కూడా. మీ ఇంటి స్థలాన్ని బట్టి ఒక్కో అంతస్తుకు మూడు గదులు వేసుకోవచ్చు. అంతేకానీ, ఇంటిని దక్షిణం-పశ్చిమం జరిపి పెంచవద్దు. దీనివల్ల లాభం కన్నా.. నష్టం ఎక్కువ.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vaasthu Shastra | ఊళ్లో ఉన్న మా పాత ఇంట్లో పుట్ట పెరిగింది. దానిని తొలగించి, ఇంటిని వాడుకోవచ్చా?
Vasthu Shastra | ఇల్లు కూలిపోతే, కాలిపోతే వాస్తు లేదనే అనుకోవాలా? కారణాలు ఏమిటి?