Farm House | ఎకరం స్థలంలో.. మధ్యన ఫామ్‌హౌస్ కట్టుకోవచ్చా? సెల్లార్ తీయొచ్చా?
– శ్రీచంద్ర, మెదక్
స్థలం పెద్దగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఫామ్‌హౌస్ కడుతున్నప్పుడు స్థలం మధ్యలో కట్టడం తప్పుకాదు. కానీ, ఇంటి నాభిని కాస్త వెనక్కి తీసుకొని.. స్థలం నాభి (సెంటర్ పాయింట్) ఫామ్‌హౌస్‌లోకి వచ్చేలా చక్కని నక్ష చేసి కడితే, గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. అలాగని భూమిలో సెల్లార్ తీసి మాత్రం కట్టవద్దు. మంచి వాస్తుతో ఇంటి మధ్య ఖాళీ స్థలం (బ్రహ్మ స్థానం) పెట్టి, ఫామ్‌హౌస్ రూపొందించాలి. తద్వారా చాలా గొప్ప ఇల్లు (శక్తి గృహం) నిర్మితమవుతుంది. ఇల్లు నిర్మాణానికి, పడమర హద్దుకు ఉండే ఖాళీ కన్నా.. కనీసం మూడు అడుగులు హెచ్చుగా తూర్పు ఖాళీ ఉండేలా చూడాలి. దక్షిణం ఖాళీ తప్పకుండా తక్కువ ఉండి.. ఉత్తరం వైపు రెండు రెట్లు ఎక్కువగా ఖాళీ పెంచి ఇంటి రచన చేయాలి. ఇలా శాస్త్ర సూచనలతో ఎకరం స్థలంలో గొప్ప ప్రకృతి భవనం కట్టుకోవచ్చు. అది ఆనంద స్థానం అవుతుంది.
ఇంటి కింద సెల్లారులో పెద్ద నీటిట్యాంక్ పెట్టొచ్చా? మాది కార్ వాషింగ్ సెంటర్.
– బి. శ్రీమాధవి, కొడంగల్
ఇంటికి వ్యాపారపరంగా నీటిట్యాంక్ కట్టాలంటే చాలా స్థలం అవసరం. అందుకు తగిన స్థలం తూర్పు – ఉత్తరంలో దొరకనప్పుడు, ఇంటి కింద తూర్పు భాగం లేదా ఉత్తరం భాగంలో పెట్టుకోవాలి. తూర్పులో – ఉత్తరంలో ఎంతో కొంత స్థలం వదిలి ఉంటాం కాబట్టి, ఆ స్థలాన్ని కలుపుకొని కూడా ఉత్తరం మధ్యలో లేదా తూర్పు మధ్యలో ఉన్న స్థలం మేరకు నీటిసంపు నిర్మించుకోవచ్చు. అయితే, నిర్మాణం కింద పెద్ద సంపు తీసినప్పుడు పిల్లర్ల ఫుటింగ్స్కు తగలకుండా, వాటి కిందికి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుటింగ్ చుట్టూ సిమెంట్ దిమ్మె అదనంగా కట్టి, అసలు నిర్మాణానికి ఉత్తరోత్రా ఇబ్బంది రాకుండా నీటిసంపు నిర్మాణం చేయాలి. దానిని వ్యాపారపరంగా వాడుకోవచ్చు. దోషం లేదు.
వాస్తు ఉండి, నోటరీతో కట్టిన ఇంటిని కొనవచ్చా?
– వి. ఎన్. మురళి, ఖాజీపేట
ఇంటిని వాస్తుకు కట్టడంతోపాటు అది లీగల్‌గా ఉండటం.. మున్సిపల్ పర్మిషన్తో నిర్మితమవడం కూడా అవసరమే! మనిషికి మంచితనంతోపాటు చదువు కూడా ఎంత అవసరమో.. ఇదీ అంతే! చాలాచోట్ల అనుమతులు లేని ఇళ్లు అమ్ముతుంటారు. తరువాత పర్మిషన్ దొరుకుతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, రోజురోజుకూ పరిస్థితులు మారుతున్నాయి. చట్టాలు పకడ్బందీగా అమలు అవుతున్నాయి. ఇంటికి పర్మిషన్ లేకుంటే, స్థిరాస్తి విలువలు పెరుగవు. బ్యాంకులు లోన్లు ఇవ్వవు. ముఖ్యంగా ఇలాంటి ఇండ్లు వాస్తుకు ఉంటాయి అని చెబుతారు కానీ, సరైన విధంగా సెట్ బ్యాక్‌లు (ఇంటి చుట్టూ ఖాళీ స్థలం) ఉండవు. కార్ పార్కింగ్ కోసం ఈశాన్యం తెంపుచేసి, పిల్లర్‌ను పక్కకు జరిపేస్తుంటారు. ఏది ఏమైనా.. ప్రభుత్వ అనుమతితోపాటు వాస్తు అమరిక ఉన్న ఇండ్లనే కొనాలి.
ఇంటి ముందు పెండ్లి జరుపుకోవచ్చా? అలా జరుపుకొంటే..పెండ్లి మండపం ఎలా వేయాలి?
– డి. అజయ్, చిట్లాం
ఒకప్పుడు ఇండ్ల ముందే పెండ్లిళ్లు జరిగేవి. జరగాలి కూడా. కష్టం లేకపోతే చాలు.. మనిషి ఎంత ఖర్చయినా తట్టుకుంటాడు. దేన్నయినా భరిస్తాడు. సంప్రదాయాన్ని కూడా విస్మరిస్తాడు. శుభకార్యాలు మన గృహ ప్రాంగణంలో, అదీ మనింటి గుమ్మం ముందు జరుపడం ఓ వరం. ఇప్పటికీ పల్లెటూళ్లలో చాలావరకు అది రోడ్డయినా సరే.. చక్కని పందిరి వేసి, ఉన్నంతలో వివాహ కార్యాన్ని జరుపుకొంటారు. పెండ్లి మండపాన్ని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం ముఖంగా ఉండేలా, నాలుగు స్తంభాలతో కొబ్బరి ఆకులతో అందంగా నిర్మించాలి. సోమ – బుధ – గురువారాలలో అశ్వనీ – పునర్వసు – హస్త మొదలైన నక్షత్రాల శుభవేళల్లో పందిళ్లు వేయాలి. వధువు చేతి మూర లెక్కలతో ఎనిమిది X ఎనిమిది లేదా పన్నెండు X పన్నెండు కొలతలతో చతురస్రంగా మండపం నిర్మించాలి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | మాకు ఒక్కతే అమ్మాయి. మగ పిల్లలు లేరు. దీనికి కారణం మా ఇంటికి వాస్తు దోషం ఉండటమేనా?
Vasthu Tips | ఇంట్లో సీతారాముల ఫొటోలు పెట్టొద్దు అంటున్నారు. నిజమా?