Vasthu Shastra | గుడిలో దేవతా విగ్రహాలను శిలతోనే ఎందుకు తయారు చేయాలి?
– బి. శ్రీదేవి, కరీంనగర్
మానవ నాగరికతలో మెదట మనిషికి దొరికింది మట్టి ఒక్కటే. గృహ నిర్మాణానికి కుండల తయారీకి, గణపతి నవరాత్రుల వంటి వేడుకలకూ మట్టినే వాడటం మనకు తెలుసు. శిలకు – మట్టికి తేడా ఉంది. పైగా గుళ్లలో ప్రతిష్ఠించే విగ్రహం శాశ్వతంగా, ప్రాణప్రదంగా ఉండాలి. అందుకే.. శిల ప్రకృతి ప్రసాదించిన వరమైంది. శిలలు విగ్రహాలుగా ఆకృతి దాల్చాలంటే ఎన్నో పరీక్షలకు లోనవుతాయి. బరువు, గట్టిదనం, రంగు, పెళుసుదనం, ఆయుష్షు.. మొదలైనవి పరిశీలించాల్సి ఉంటుంది. శాండ్‌స్టోన్, లైమ్‌స్టోన్, గ్రానైట్, జెమ్‌స్టోన్, మార్బుల్ (పాలరాయి) మొదలైనవి ఎన్నో రకాలు. వీటిలో గ్రానైట్ (నల్లరాయి) చాలా గట్టిగా ఉంటుంది. శిలలన్నీ పర్వతాలనుంచి వచ్చేవే. అంటే.. భూమిలోంచి లభ్యం అయ్యేవే. పర్వత శిఖరాలు దేవతా స్థానాలు. అలా కూడా శిలలకు సంప్రదాయ గౌరవం ఉంది. కాబట్టి, శిలలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ముఖ్యంగా రాతికి ‘గుణం’ ఒకటి ఉంటుంది. దీనిపైన చక్కని రూపాలు, చాలా సూక్ష్మమైన కనురెప్పలు, కనుబొమలు, ముఖ కవళికలు సజీవంగా ప్రస్ఫుటం చేసే లక్షణం కృష్ణశిలకు ఉంది. అందుకే, పాలంపేట రామప్ప గుడిలోని నంది విగ్రహం అంత ప్రాచుర్యం పొందింది. పోతే.. శిల ఏదైనా వాతావరణాన్ని తట్టుకుని నిలబడాలి. కృష్ణశిలకు ఆ శక్తి ఉంది. ప్రధానంగా యంత్రబద్ధంగా, మంత్రబద్ధంగా ఆ శిల ఆవాహన పొంది.. మహాశక్తి రూపంగా నిలబడగలిగే సున్నితత్వం, సూక్ష్మత్వం దాని లక్షణమై.. శాశ్వతమై ఉండాలి. అందుకు శిల అవసరం అయ్యింది. దక్షిణ భారతమంతా ఎక్కువగా నల్లరాతి శిల్పాలే వాడారు. కారణం.. మనవద్ద వాటి లభ్యత ఎక్కువ. ఉత్తర భారతంలో పాలరాయి ఎక్కువగా వాడుతారు. శిల్పాలన్నీ విగ్రహాలకు పనికిరావు. వాటి శబ్దాన్ని బట్టి, గుణాన్ని బట్టి.. స్త్రీలింగ, పుల్లింగ, నపుంసక లింగ శిలలుగా గుర్తింపు పొందుతాయి. శాస్ర్తానుసారమే శిలలు విగ్రహాలుగా నిలబడుతాయి.
ఈశాన్యం గదిని బయటి నుంచి వరండాలా వాడుకోవచ్చా? మేము గాజుల దుకాణం నడుపుతున్నాం.
– బి. శ్రీరామ్, ఆదిలాబాద్
ఇంటి మూలలు ఇంటిలోకే కలిసి ఉండాలి. ఏ మూల అయినా ఇంటికి ప్రధానమే! ఎప్పుడైనా.. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. మీరు ఈశాన్యం గదిని వరండాలాగా బయటికి ఓపెన్ చేసి, దానిలో వచ్చిన వారిని కూర్చోబెట్టి గాజులు అమ్మడానికి ప్లాన్ చేశారు. దానివల్ల ఇంటి ఆయువుపట్టు తెగిపోతుంది. ఎంతగొప్ప భవనమైనా ఈశాన్యగది లేకుంటే.. ఇంటి తల ఎగిరిపోయినట్టే ఉంటుంది. మీ ఇంటి ముందు.. ఇంటి వెడల్పుతో సమానంగా మంచి ఓపెన్ వరండా వేసుకోండి. దాన్ని వ్యాపారానికి వాడుకోండి. ఇంటిని ఎనిమిది దిశలతో చక్కగా నిర్మించుకొని దాని విధులకు దాన్ని అంకితం చేయాలి. ఇల్లు అనేది కనపడని ఒక శక్తి మందిరం. దాని భౌతిక అవయవాలను కట్ చేసి వాడుకోవద్దు. తద్వారా మన శరీరంలో అపసవ్యత చోటు చేసుకుంటుంది. ఈశాన్యం గదిని దుకాణంలా వాడినా, నడకలు ఇంట్లోంచే ఉండాలి.
భూకంపాలు, వరద నష్టాలకు కూడా వాస్తు ప్రభావం ఉంటుందా?
– జి. సత్యవతి, ధర్మపురి
వాస్తు అంటే ఇల్లే అనుకుంటే ఎలా? ఒక స్థలం, ప్రాంతం, భూమి – ఆకాశం.. అన్నీ దాని పరిధిలోకే వస్తాయి. కొన్ని దేశాలతో, కొన్ని రాష్ర్టాలతో ఉన్న భౌతిక వాస్తు విధానం అక్కడి భూస్వరూపం, దాని స్వభావాలు వేరువేరుగా ఉంటాయి. అందుకే, కొన్నిచోట్ల అధిక భూప్రకంపనలు, అధిక వర్షపాతం.. వరదలు, మునగడాలు ఉంటాయి. సముద్రతీర ప్రాంతానికి, తెలంగాణ భూభాగానికి తేడాలు ఉంటాయి కదా! హిమాలయ ప్రాంతం, రాజస్థాన్ ప్రాంతం విభిన్నమే కదా! అలా ఆయా ‘భూవాస్తు విధానం’ (ప్రకృతి నిర్మాణం) ప్రకారం.. అలాంటి ఉత్పాతాలు వస్తాయి. కాబట్టి, ఆ చోటుకు వాస్తు ఉందా? అని అడుగుతారు. అంటే అది నివాస యోగ్యమైనదేనా? అని భావం. కేవలం గదులు, ద్వారాలు మాత్రమే వాస్తు కానే కాదు.
అద్దె ఇంట్లోకి వెళ్లినా కూడా గృహ ప్రవేశ పూజ చేసుకోవాలా? పాలు పొంగిస్తే చాలా?
– జి. సుజాత, గద్వాల
గృహం అనేది మానవ జీవితానికి శక్తివంతమైన నివాస కేంద్రం. కేవలం ఒక నీడనిచ్చే డబ్బా అనుకుంటే ఎలా? మీరు అద్దె ఇంటికి ఎందుకెళ్తున్నారు? నివసించడానికే కదా! అందులో ఉండేది మనమే అయినప్పుడు, దాని మంచిచెడ్డలు మన బాగు కోసమే కదా! అద్దె ఇల్లు అయినా.. సొంత నివాసమైనా వెళ్లే ముహూర్తం మంచిదైతేనే మన పనులు బాగుండేది. ఎవరు ఇచ్చిన కారు ఎక్కినా.. దాని మంచి- చెడు కారెక్కిన వారిమీదనే ఉంటాయి. కారు తయారుచేసిన వారిమీద కాదు. మీరు ఎప్పుడు కిరాయి ఇంటికి వెళ్లినా.. మంచి ముహూర్తం చూసుకొని గృహ ప్రవేశ పూజ చేసుకోండి. అప్పటికే ఇంటి యజమానులు అవన్నీ చేసి ఉన్నా సరే.. శుభఘడియల్లో వెళ్లి, పాలు పొంగించి, పూజ చేసుకున్నాకే.. అందులో నివాసం ఉండండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | మాకు ఒక్కతే అమ్మాయి. మగ పిల్లలు లేరు. దీనికి కారణం మా ఇంటికి వాస్తు దోషం ఉండటమేనా?
Vasthu Tips | ఇంట్లో సీతారాముల ఫొటోలు పెట్టొద్దు అంటున్నారు. నిజమా?