Vastu | వీధిపోట్లు – వీధిచూపులు అనేకచోట్ల వస్తుంటాయి. వాటిలో వీధిచూపులు గొప్ప శుభఫలితాలు కలుగజేస్తాయి. ఇక వీధిపోట్లు వచ్చినప్పుడు మాత్రం ఆ స్థలంలో ఇల్లు కట్టడం అనేది ఎన్నో సమస్యలకు తెరలేపినట్లు అవుతుంది. అలాంటి స్థలంలో మంచి ప్రత్యామ్నాయం (రెమెడీ) ఏమిటంటే దానికి ఎంత మేర రోడ్డు పడుతుందో అంత వరకు స్థలాన్ని పూర్తిగా కట్ చేయడం లేదా స్థలం పెద్దగా ఉంటే ఆ రోడ్డును లోపలికి తీసుకోవడం మంచిది. తద్వారా ఆ పెద్ద స్థలం తూర్పు – పడమర వీధులు కలిగిన రెండు స్థలాలుగా విడిపోతుంది.
ఈ విధానం చాలా సుఖ, శుభదాయకం. వీధిపోటు వచ్చినప్పుడు ఎదురుగా గణపతి బొమ్మ పెట్టడం వ్యావహారికంగా ఫలితం ఉండదు. అంటే వీధిపోటును ఏదో ఒకటి నిర్దిష్టంగా అడ్డుకోవాలి కాబట్టి దానికి ఒక గుడికట్టి అందులో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేసి నిత్యపూజాధికాలు చేయిస్తే అప్పుడు ఆ వీధిపోటు ప్రభావం ఇంటికి పడదు. టైల్స్ అంటించడం పరిష్కారం కాదు.
ఇంట్లో మెట్లకు కిటికీ ఎదురుగా ఉండొచ్చా? -మల్లారెడ్డి, మునుగోడు
ఇంట్లోకి వెలుతురు, గాలి అధికమొత్తంలో వచ్చేది కిటికీల వల్లనే. తలుపులు రాకపోకలకు అవకాశం ఇచ్చినా, తలుపులు ఎప్పుడూ మూసుకునే ఉండవచ్చు. తక్కువసార్లు తెరుచుకోవచ్చు. కానీ, కిటికీలు అలాకాదు. అన్ని వేళలా అవి తెరుచుకొని ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి, కిటికీలు ఎన్నయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మెట్లకు ఎదురుగా కిటికీ ఉండకూడదు అనే నియమం అవసరం లేదు. ఎదురుగా మెట్లు వచ్చినా కిటికీ పెట్టుకోండి.
మెట్లు ఇంట్లో వచ్చినప్పుడు మెట్లకు ఎదురుగా లైట్ రావడానికి లాండింగ్ పైన రెండువైపులా కిటికీలు పెట్టొచ్చు. (రెండు రేజర్స్కి ఎదురుగా) డేలైట్ కోసం అది అవసరం కూడా. ఇల్లు ఆహ్లాదంగా ఉండటం, ఇంటి గదల విభజన చక్కగా జరుగడం అలాగే ఇంట్లో మంచి వాతావరణం ఏర్పరచుకోవడానికి కిటికీలకు వెంటిలేటర్లు బిగించడం విషయంలో సంకోచం అవసరమే లేదు.