Vasthu Shastra | ఇల్లు కూలిపోతే, కాలిపోతే వాస్తు లేదనే అనుకోవాలా? కారణాలు ఏమిటి?
– ఎన్. అరుంధతి, కొత్తూరు
ప్రమాదం ఏ విధంగా అయినా రావచ్చు. కొన్ని కారణాలు మనిషి బుద్ధికి అందవు. కానీ, ప్రమాదాలు జరిగిన ఇండ్లలో వాస్తు దోషాలు మాత్రం తప్పక ఉంటాయి. కర్మగతంగా వచ్చే ఇబ్బందులకు మనిషి వక్రబుద్ధి తోడైతే.. ఎవరు చెప్పినా వినకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. తప్పక ఆ ఫలితం అనుభవిస్తాడు. కొన్నిసార్లు అతను కావచ్చు. కొన్నిసార్లు అతని వారసులు కావచ్చు. సృష్టి తనకంటూ తయారుచేసి పెట్టిన జీవిత చక్రంలో మనిషి ఇరుక్కుని ఉంటాడు. ఇందుకు అతని నిర్ణయాలే కారణాలు అవుతాయి. పుట్టుక – చావు మనది కాదు. కానీ, జీవించే విధానం మనది. అంటే.. వ్యక్తి చేతిలో కర్మ స్వేచ్ఛ ఉంటుంది. కర్మ అంటే.. పని. ఎలాంటి పనిచేసినా మనిషి బతుకవచ్చు. కానీ, ప్రకృతి ఆమోదించే కార్యాచరణతోనే జీవనం సాగాలి. అంటే, శాస్త్రం ఆమోదించిన నిర్ణయాలతో సానుకూల జీవన విధానం అలవరుచుకోవాలి. శాస్ర్తాలు ఉన్నదీ అందుకే. మనకోసం కాకపోయినా, మన తరువాతి తరం (మన పిల్లలు) బాగు కోసమైనా పెద్దలు చెప్పిన మార్గంలో నిర్మాణాలు చేయాలి. తద్వారా వాళ్ల భవిష్యత్తు బాగుంటుంది. ఆగ్నేయ, నైరుతి లోపాలు, వీధిపోట్లు ఇంటిమీదికి పెద్ద ప్రమాదాలు తెస్తాయి. దీనివల్ల కుటుంబం సంక్షోభంలో పడుతుంది. శాంతి లోపిస్తుంది.
మా మామగారి వ్యవసాయ భూమిలో ఉన్న ఇంటిమీద పిడుగు పడింది. దానికి వాస్తు దోషం ఉంటుందా?
– ఎం. సురేశ్, కల్లూరు
సృష్టిలో కొన్ని కార్యాలు ప్రకృతి ధర్మంగా జరుగుతూ ఉంటాయి. వాటికి కారణాలు అటు భౌతికంగా ఉండవచ్చు. ఇటు పారమార్థికంగా (కర్మపరంగా) కూడా ఉండవచ్చు. ఏది ఏమైనా.. నష్టం నష్టమే! ఇంట్లో కానీ, ఆవరణంలో కానీ ఆగ్నేయం – వాయవ్యం లోపాలు ఉన్నట్లయితే.. ఇలాంటి అగ్నికార్యాలు నష్టం తెస్తాయి. ముఖ్యంగా విశాలమైన స్థలంలో ఇల్లు కట్టినప్పుడు దానికి చుట్టూ ప్రత్యేకంగా ప్రహరీ నిర్మించాలి. శాస్త్రప్రకారం గృహ నిర్మాణం జరగాలి. ఇంటికి ఆగ్నేయంలో పెద్ద బావి లేదా గోబర్ గ్యాస్ ప్లాంట్, సెప్టిక్ ట్యాంక్ లాంటివి లేకుండా చూడాలి. వ్యవసాయ భూముల్లో ఇండ్లు ఎత్తుగా కట్టినప్పుడు.. పిడుగులు పడకుండా, సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
మేము లాడ్జి, హోటల్ కట్టాలని అనుకుంటున్నాం. దాన్లోని రూములకు కూడా వాస్తు చూడాలా? అవి ఎవరికీ సొంతిళ్లు కాదు కదా?
– టి. నిత్యసంతోష్, బోయిన్పల్లి
తప్పక వాస్తు చూడాలి. నిర్మాణం ఏదైనా.. అది ఆనందాన్ని – ప్రశాంతతను కల్పించాలి. అంటే, అందులో ఉండబుద్ధి కావాలి. మంచిగాలి-వెలుతురు ఉండాలి. చుట్టూ చెట్లు-పచ్చదనం ఆవరించి ఉండాలి. అందుకు వాస్తు అమరిక ఎంతో దోహదపడుతుంది. చాలామంది స్టార్ హోటల్స్ కడుతారు. కానీ అందులో ఈశాన్యం, నైరుతిలో టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు. అస్సలు వెంటిలేషన్ ఉండదు. ఒక్కరోజు, రెండు రోజులు ఉండేవారికి వాస్తు ఎందుకు? అనుకుంటారు. రెండు టాయిలెట్లు ఒకచోట కట్టి, వాటిని రెండు గదులకు పంచుతారు. దానివల్ల ఒకేచోటు నుంచి ఒకే పైపులైను వేసుకోవచ్చు.. ఖర్చు తగ్గుతుంది అనుకుంటారు. అది ఒకరోజు అయినా, సగంరోజు అయినా మనుషుల నివాసమే కదా! మళ్లీ రావాలి అనిపించాలి కదా! ప్రతిగదికీ ఆగ్నేయంలో టాయిలెట్లు కట్టాలి. ఉత్తర ఈశాన్యంలో ద్వారాలు పెట్టాలి. అలాగే దక్షిణ ఆగ్నేయంలో ద్వారం ఉండాలి. ఉత్తర వాయవ్యంలో టాయిలెట్ కట్టాలి. దీనివల్ల మంచి వెంటిలేషన్, పరిశుభ్రమైన వాతావరణం ఉంటే మీ హోటల్‌కు మంచి పేరు వస్తుంది. ఒక్కపూటే కదా అని.. బయటి హోటల్లో రుచీపచీ లేని అన్నం తింటామా? మీ హోటల్ నిర్మాణంలో తప్పక వాస్తు పాటించాల్సిందే!
వ్యవసాయ భూమిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చా? ఎటువైపు పెట్టాలి?
– ఎస్. పవిత్ర, బీరంగూడ
ఈరోజుల్లో కరెంట్ అవసరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలతో మనిషి కలిసిపోయి బతుకున్నాడు. మీ వ్యవసాయ క్షేత్రంలో తప్పకుండా సోలార్ షీట్లను ఏర్పాటు చేసుకొని.. కరెంట్ వాడుకోవచ్చు. ఇది మంచి ఆలోచన. సాగుభూమిని వదిలి ఆగ్నేయ భాగంలో మీరు అనుకున్నంత విస్తీర్ణంలో నేలమీదే సోలార్ షీట్లు పెట్టుకోవచ్చు. అలాగే, వాయవ్యంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ సోలార్ షీట్లు దక్షిణం వంపుతో పెడుతారు. అవి నేలకు తక్కువ ఎత్తులో ఉంటాయి కాబట్టి దోషం అనుకోవద్దు. అంతేకాదు.. మనం వాడుకునే షెడ్లను కూడా.. వాటి పైప్పులను సోలార్ షీట్లతో కప్పుకోవచ్చు. అంటే షెడ్లమీద ముందు మామూలు రేకులు వేసుకొని, వాటిమీద రెండు వైపులా సోలార్ షీట్లు వేసుకొని.. విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. దాని వల్ల నేలమీద స్థలం కూడా కలిసివస్తుంది.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | ఇంటి శంకుస్థాపన కోడలితో చేయించాలా, కూతురితో చేయించాలా?
Vasthu Shastra | మాకు ఒక్కతే అమ్మాయి. మగ పిల్లలు లేరు. దీనికి కారణం మా ఇంటికి వాస్తు దోషం ఉండటమేనా?
Vasthu Tips | ఇంట్లో సీతారాముల ఫొటోలు పెట్టొద్దు అంటున్నారు. నిజమా?