Vaasthu Shastra | ఒక్క కొడుకు ఉంటే.. అతనికి తూర్పు రోడ్డు ఇల్లు మాత్రమే కట్టి ఇవ్వాలా? ఇతర రోడ్లకు ఇల్లు ఉంటే దోషమా?
– ఏ. వీరేశం, మోత్కూర్
ఒక్క కొడుకు ఉన్నా, ఒక్క కూతురు ఉన్నా.. అంతకంటే ఎక్కువ సంతానం ఉన్నా.. మంచి దిశలున్న చోట, అన్ని వీధులకూ ఇండ్లు కట్టుకోవచ్చు. చాలామం దిని ప్రచార ఆర్భాటం ఆకర్షిస్తుంది. లోతుపాతులు ఎవరికీ అర్థం కావు. చాలా వెంచర్లలో ఈస్ట్ – వెస్ట్ రోడ్లు వేసి ఇండ్లు (విల్లాలు) కడుతుంటారు. కోట్ల రూపాయలు ఖరీదు పెడుతుంటారు. కానీ, వాటికి దిక్కూ దివాణం ఉండదు. వాస్తుకు ఎందుకూ పనికిరావు. కానీ వాళ్లు చేసే హడావుడి, హంగులు చూసి కొందరు ఎగబడుతుంటారు. అసలు ఆ నిర్మాణాల్లో ఏదీ శాస్త్రీయంగా ఉండదు. కాబట్టి ఏదో విని, దేనినో చూసి.. ఇంటిని కొనుగోలు చేయవద్దు. అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రోడ్లు అన్నీ గొప్పవే! లే అవుట్ సరిగ్గా ఉంటే.. అన్ని దిశల ఇండ్లూ యోగిస్తాయి.
హైడ్రాలిక్ లిఫ్ట్ కారు పార్కింగ్ విధానం మంచిదేనా? ఇంటి స్థలంలో దాన్ని ఎక్కడ పెట్టాలి?
– వి. సముద్ర, హైదరాబాద్
ఇంటి చుట్టూ స్థలం ఎక్కువగా లేకపోవడం వల్ల ఉన్న కొద్ది జాగాలోనే.. గొయ్యితో లిఫ్ట్ పార్కింగ్ ఏర్పాటు చేసే విధానం వచ్చింది. అంటే, ఒక కారును నేలమీద పెడితే.. మరో కారు పెట్టలేం. కానీ, అదే కారును పార్క్ చేసే చోట గొయ్యి తీసి, లిఫ్ట్ (హైడ్రాలిక్) ఏర్పాటుచేసి.. దానిలో కారు పెట్టి కిందికి దింపి, మీద మరో కారు పెట్టుకోవచ్చు అన్నమాట. పెద్దపెద్ద నగరాల్లో స్థలాలు ఖాళీగా దొరకడం కష్టం కాబట్టి, ఈ పద్ధతిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ, ఈ టెక్నిక్‌ను అన్ని ఇండ్లకూ అమలుచేయడం కష్టం. తూర్పు-ఉత్తరం ఇంటి ముందర ఖాళీ స్థలం వదిలినప్పుడు.. ఆ ఆవరణలో దీనిని అనుసరించవచ్చు. కానీ, దక్షిణం-పడమర ముఖద్వార గృహాలకు స్థలం తక్కువగా వదిలి, ఇల్లు కడతాం. కాబట్టి, లిఫ్ట్ కారు పార్కింగ్ విధానం ఇబ్బందికరం. అయితే, కింద స్టిల్ట్ పద్ధతిలో ఇల్లు కట్టి, దక్షిణం – పడమర వీధుల స్థలంలో, తూర్పు – ఉత్తరం దిశల్లో గొయ్యి పద్ధతి పార్కింగ్ అమలు పరచవచ్చు. అంటే, స్టిల్ట్ నిర్మాణం వల్ల ఇంటి కిందినుంచి తూర్పు – ఉత్తర దిశలకు కారు తీసుకెళ్లడం – తీయడం చేసుకోవచ్చు. కాబట్టి, సహజంగా ఇంటిని నేలమీద కట్టినప్పుడు ఆ ఇంటికి దక్షిణం – పడమర రోడ్డు ఉంటే, గొయ్యి తీసి దక్షిణం – పడమరల్లో ఈ కారు పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అప్పుడు ఆ ఇంటికి దక్షిణం, అలాగే నైరుతి దిశల్లో గోతులు వచ్చి, తీవ్రమైన వాస్తు దోషాలకు అవి పురిగొల్పుతాయి. కాబట్టి స్థలం ఉంటే.. నేలమీదనే కార్ పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఏది ఏమైనా.. ఆధునిక విధానాలను అమలుచేసే ముందు శాస్త్ర పద్ధతిలో ఏది ఒప్పో, ఏది కాదో చూసుకోవాలి.
ఒకరు ఒక ఇంట్లో, మరొకరు మరో ఇంట్లో ఉంటే.. చేసే ఉద్యోగంలో మార్పులు ఉంటాయా?
– బి. దయానంద్, బుద్వేల్
ఒకవ్యక్తి ఓ ప్రొఫెషన్ ఎంచుకున్నాడు అంటే.. ఆ పని అతను చేయగలిగిందే అయి ఉంటుంది. చేయలేనిది ఎంచుకొని, మరో ఇల్లు మారినంత మాత్రాన.. అది నిలువదు. విజయవంతం కాదు. వృత్తి మారిపోవచ్చు కూడా. బహుశా అదే అతను గొప్పగా రాణించగలిగేది కూడా కావచ్చు. స్థలం-గృహం మనిషిలో వృత్తులను మార్చదు. తనకు సరైన వృత్తిని (ఉద్యోగాన్ని) ఎంచుకునే అవగాహన కల్పిస్తుంది. మనిషి తన స్వభావాన్ని బట్టి నడుస్తూ ఉంటాడు. అతని స్వభావంలో మార్పులు వచ్చే-ఇచ్చే చోటుకు చేరడం అనేది ముఖ్యం. అలా జీవితంలో వృత్తులు- ప్రవృత్తులు మారుతాయి. అందుకే, చాలామంది మహా వ్యక్తులు తాము పుట్టిన చోటు, పెరిగిన ఊర్లు మారి.. మహోన్నతులు కాగలిగారు. విత్తనం సారవంతమైన నేలమీద పడటం కూడా ప్రధానం కదా!
అందరికీ అన్ని దిశలూ ఉపయోగపడతాయా? కుటుంబ గోత్రనామాలను బట్టి మారుతాయా?
– సౌదామిని, ఉప్పల్
‘సృష్టిలో వ్యత్యాసాలు లేవు’ అన్నది మనిషి దృష్టిలోనే. కూరగాయలన్నీ తినగలిగేవే! అయితే, ఏ కూరగాయను ఎలా వండాలో అలా వండి తింటేనే రుచి, ఆరోగ్యం. దిశలన్నీ ప్రకృతిలో భాగాలు. అవి లేని చోటంటూ లేదు. అయితే, దక్షిణం గృహాన్ని, ఈశాన్యం గృహాన్ని.. వాటివాటి విధానాలను బట్టి నిర్మాణంజరిపితే, దక్షిణం కూడా ఈశాన్యం బ్లాకు కన్నా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. కుటుంబం అనేది ప్రధానం. మనం ఎంచుకున్న స్థలం ప్రధానం. దాని విలువ ఎంత? దానిలో సానుకూలత ఎంత? ప్రతికూలత ఎంత? అనేది నిర్ధారించుకోకుండానే చాలామంది ఇండ్లు కడుతారు. కొంటారు. తద్వారా భిన్నభిన్న ఫలితాలు పొందుతారు. మంచి ఇల్లు అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి, జాగ్రత్తగా ఎంచుకొని కట్టుకోండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | ఆగ్నేయం ఇంటికి సెల్లార్ ఉండవచ్చా?
Vasthu Shastra | ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా?
Vasthu Shastra | మా కాలేజీకి ఈశాన్యంలో సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది.. దీనివల్ల ఏమైనా కీడు జరుగుతుందా?
Vasthu Shastra | ఇంటి మధ్యలో దేవుళ్ల విగ్రహం పెట్టొచ్చా? వాస్తు ఒప్పుకొంటుందా?
Vaastu | కవల పిల్లలకు స్థలం కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఇద్దరికీ ఒకే రోడ్డు ఉండాలా?