Vasthu Shastra | ఆగ్నేయం ఇంటికి సెల్లార్ ఉండవచ్చా?
– బి. చంద్రశేఖర్, సికింద్రాబాద్
దక్షిణం రోడ్డు, తూర్పు రోడ్డు ఉంటే.. అది ఆగ్నేయం బ్లాకు అవుతుంది. దక్షిణం రోడ్డు ఉంది కాబట్టి.. దక్షిణం ప్రధానంగా సెల్లార్ ఉండటం మంచిదే. ఆ బ్లాక్‌కు దక్షిణం – ఆగ్నేయం గేటు తప్పక ఉండాలి. దానిని నిత్యం వాడుకలో ఉంచాలి. తూర్పు వీధికి కూడా ప్రధాన గేటు పెట్టుకొని వాడాలి. సెల్లార్లోకి దక్షిణం నుంచి ఎంట్రీ ఉండటం మంచిది. ఆ గృహానికి ఉత్తరం వైపు ద్వారాలు.. వారుగా దక్షిణ – ఆగ్నేయానికి ఎదురుగా కొనసాగాలి. అది ఎంతో శుభప్రదం. ఆ బ్లాకులో సెమీ సెల్లార్ చేసుకొని వాడటం చాలా అవసరం. అప్పుడు అది గాలి – వెలుతురు ధారాళంగా ప్రవహిస్తాయి. ఆరోగ్యకరంగానూ ఉంటుంది. అన్ని విధాలా శాస్త్రపద్ధతులతో, చూసుకొని కట్టుకోండి. దోషం లేదు.
ఫామ్‌హౌజ్‌లో ఒక గదిని నేల లోపల కట్టాలి. ఎక్కడ అయితే బాగుంటుంది?
– డి. మోహన్‌రాజు, దమ్మాయిగూడ
ఈ నిర్మాణాన్ని ‘నేల మాళిగ’, ‘భూ గృహం’ అనీ అంటారు. అయితే ఇవి ఒకనాడు కోటల్లో నిర్మించేవారు. నాటి రాజులకు అదో అవసరం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టాలనుకుంటే.. ముందుగా స్థలం నిర్ణయించి, దానికి కాంపౌండు కట్టండి. అందులోని ఈశాన్య భాగంలో నేల లోపల ఒక గదిని ఏర్పాటు చేసుకోండి. అయితే ప్రధాన గృహాన్ని వాస్తు పద్ధతిలో భూమి మీద కట్టుకున్నాక.. వేరుగా పెద్ద ఇంటికి ఈశాన్య భాగంలో ‘అండర్ గ్రౌండ్ గది’ కట్టాలి. అయితే, దానికి గాలి – వెలుతురు ధారాళంగా వచ్చేలా, భూమికన్నా ఎత్తులేపి కట్టాలి. వానజల్లు పడకుండా ఏర్పాటు చేసుకొని, దక్షిణం నుంచి లోపలికి దిగేలా ఓపెన్ మెట్లు వేసుకొని వాడుకోవాలి. హోమ్ థియేటర్‌గా వాడుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. నేలలో గది అంటే.. గొయ్యిలో పాతినట్టుగా కాకుండా, జాగ్రత్తగా ప్లాన్ చేసి కట్టాలి.
వాయవ్యం సెల్లార్లో కిచెన్ పెట్టొచ్చా? మాది హోటల్ వ్యాపారం. ఉత్తరం రోడ్డు. వాస్తు అనుకూలిస్తుందా?
– ఎ. నర్సమ్మ, ఆలేరు
వ్యాపార స్థలంలో వాయవ్యం కిచెన్ బాగానే యోగిస్తుంది. కానీ, ఆ సెల్లార్ పూర్తిగా గాలి – వెలుతురుతో నిండి ఉండాలి. విద్యుత్ దీపం అవసరం లేకుండా, దినమంతా ఉండగలిగే నిర్మాణం అయినప్పుడే.. సెల్లార్లో పొయ్యి నిలబడుతుంది. ఉత్తరం రోడ్డు ఉండి, ఆ రోడ్డుతో సమాన ఎత్తులో సెల్లార్.. అంటే, స్టిల్ట్ అయి ఉంటే, నిరభ్యంతరంగా వాయవ్యం కిచెన్ గొప్పది అవుతుంది. దక్షిణం రోడ్డు ఉండి, సెల్లార్ ఉంటే.. సెల్లార్ మంచిదే కానీ, వాయవ్యం పొయ్యితో వ్యాపారం చేయలేరు. ఆ చోటు ఆగ్నేయంలోనే ఉండాలి. పొయ్యికి అది ఆరోగ్యకరం. మీది ఉత్తరం రోడ్డు అంటున్నారు. దానికి సెల్లార్ లోతులో ఉంటే మాత్రం ఇబ్బందే. ఉత్తరం వీధి ఎత్తుగా ఉండి, గొయ్యిలో ఉంటే వ్యాపారం చేయలేరు. కాబట్టి అన్నీ చూసుకొని, నిర్ణయం తీసుకోండి. వాస్తు సూత్రాలను గౌరవించండి.
మా స్థలానికి దక్షిణం, పడమర, ఉత్తరం రోడ్లు ఉన్నాయి. కానీ, ఉత్తరం రోడ్డు పది ఫీట్ల ఎత్తులో ఉంది. ఇల్లు కట్టొచ్చా?
– బి. సంధ్య, కొత్తూరు
ఒకటి కంటే రెండు రోడ్లు ఉండటం ఎప్పుడైనా స్థలానికి మంచిదే! అయితే మీరు మూడు రోడ్లు అంటున్నారు.. గొప్పదే! కానీ, అవి హెచ్చుతగ్గులతో ఉన్నప్పుడు మాత్రం రెండోసారి ఆలోచించాల్సిందే. ముఖ్యంగా మూడు రోడ్ల స్థలానికి అందులో దక్షిణం రోడ్డు, పడమర రోడ్డు దిగువలో ఉండి, ఉత్తరం వీధి ఎత్తులో ఉంటే.. ఉత్తరం కన్నా నైరుతి గొయ్యి ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే, తెలియకుండా నైరుతి బ్లాకుగా మారి, ఉత్తరం ఎత్తు ప్రభావాలు తోడవుతాయి. కేవలం నైరుతి బ్లాకు అయినా దోషం లేదు కానీ, ఉత్తరం ఎత్తుతో కూడుకొని ఉండటం మంచిది కాదు. అలాంటి స్థలం ఉత్తరం, దక్షిణం వెడల్పు ఎక్కువగా ఉంటే.. దానిని రెండు భాగాలు చేసి వాడుకుంటే మంచిది. యథావిధిగా పనికిరాదు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా?
Vasthu Shastra | మా కాలేజీకి ఈశాన్యంలో సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది.. దీనివల్ల ఏమైనా కీడు జరుగుతుందా?
Vasthu Shastra | ఇంటి మధ్యలో దేవుళ్ల విగ్రహం పెట్టొచ్చా? వాస్తు ఒప్పుకొంటుందా?
Vaastu | కవల పిల్లలకు స్థలం కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఇద్దరికీ ఒకే రోడ్డు ఉండాలా?