Jr NTR | దేవర సినిమాలోని సూపర్‌హిట్ పాట ‘చుట్టమల్లే’కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ మార్ఫింగ్ వీడియోపై టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాటలో జాన్వీ కపూర్ కనిపించిన దృశ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి అత్యంత అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడం పట్ల ఆయన తీవ్ర విచారం, అగ్రహం వెలిగించారు.
మహిళలను తల్లులుగా, దేవతలుగా పూజించే మన సంస్కృతిలో, ‘మాతృదేవోభవ’ అనే పదాన్ని గౌరవించే నేలపై కొందరు వ్యక్తులు ఏఐని ఉపయోగించి ఒక మహిళను కించపరిచే స్థాయికి దిగజారడం అత్యంత సిగ్గుచేటని ఎన్టీఆర్ మండిపడ్డారు. ఈ మార్ఫింగ్ వీడియోను సృష్టించిన వారికి, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఈ తరహా డీప్‌ఫేక్ వీడియోలను ఎవరూ చూడొద్దని, షేర్ చేయొద్దని లేదా ప్రోత్సహించొద్దని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. నేడు మరొకరితో మొదలైన ఈ దుశ్చర్య రేపు మీ ఇంట్లోని తల్లులు, చెల్లెళ్లు, భార్యలు లేదా కూతుళ్లకు కూడా జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సాంకేతికత దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలను తీసుకురావాలని ఆయన గట్టిగా కోరారు. మరోవైపు, నటి జాన్వీ కపూర్ కూడా స్పందిస్తూ.. ఏఐతో సృష్టించిన నకిలీ వీడియోలు సర్క్యులేట్ కావడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఇది ఏఐ దుర్వినియోగానికి స్పష్టమైన నిదర్శనమని, దీని వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.