Vasthu Shastra | పెద్దపెద్ద ప్రభుత్వ ఆఫీసులు నిర్మిస్తున్నారు కదా! వాటికి ప్రహరీ ఎందుకు కట్టడం లేదు? ఆ అవసరం వాటికి ఉండదా?
– డి. రామకృష్ణ, చిన్న పెండ్యాల
భూమి మీద నిర్మాణం అంటే.. అందరూ ‘మట్టేకదా! ఎలా కడితే ఏంటి?’ అనే నిర్లక్ష్య ధోరణి కనబరుస్తారు. ఆ మట్టే మహాత్ముల తలకాయలు కాసింది అనే విషయాన్ని మరువవద్దు. చెట్టు మీది నుంచి తెంపకుండా ఎవరూ కాయలను తినరు. బావి నుంచి చేదకుండా.. ఎవరూ నీళ్లు తాగరు. దానిని అంచెల విధానంగా, పని విభజనగా పేర్కొంటారు. భూమి నుంచి వేరు కాకుండా.. శక్తిని అందివ్వదు. ఎంత పెద్ద నిర్మాణమైనా, ఎవరు చేసినా.. అది ప్రభుత్వమైనా, సంస్థ అయినా ప్రహరీ ఉంటేనే శక్తి నిర్మాణం – జీవ నిర్మాణం అవుతుంది. లేకుంటే.. ఖండిత కట్టడం అవుతుంది. శాస్ర్తాన్ని (వాస్తును) కేవలం తంతులా భావించి కడితే.. అది తూతూ మంత్రం ఫలితాలు ఇస్తుంది. వ్యక్తి నిర్ణయాన్ని ప్రకృతి ప్రత్యక్షంగా వ్యతి
రేకించదు. మనిషి ఏమిచ్చినా.. దాన్ని పదింతలు చేసి తిరిగిస్తుంది. ఏది ఎలా కట్టాలో.. శాస్త్రమే చెబుతుంది.
మా రైస్ మిల్లు ఆఫీస్ తూర్పు దిక్కులో ఉంది. అలా వెనుక భాగంలో మిల్లు, ముందు భాగంలో ఆఫీస్ ఉండటం వాస్తు సూత్రాలకు విరుద్ధమా?
– సి. మధు, యాప్రాల్
ఏ నిర్మాణమైనా చేసేటప్పుడు దానికి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. వాటిని అనుసరించే శాస్త్ర సూచనలూ ఉంటాయి. ‘ఎక్కడైనా అందరూ నైరుతిలో కూర్చోవాలి కదా?’ అనుకుంటున్నారు మీరు. పెద్దపెద్ద నిర్మాణాలు వచ్చినప్పుడు ఆ భాగంలో నైరుతిలోనే ఆఫీస్ పెట్టడం వల్ల ప్రధాన నిర్మాణం సవ్యతకు దెబ్బ వస్తుంది. అన్ని రోగాలకు ఒకే మందు ఉండదు. కూర్చునేది ప్రధానమా? పెద్ద మిల్లు షెడ్డు ప్రధానమా? అనేది ఆలోచించాలి. మీది రైస్‌మిల్లు. కాబట్టి, దానికి తూర్పు భాగంలో-ఉత్తర భాగంలో ఆఫీస్ పెట్టడం దోషం కాదు. సింహభాగం ఉచ్ఛమైన స్థానంలో.. అంటే దక్షిణం-పడమరలో వచ్చినప్పుడు అది శాస్త్ర సమ్మతాన్ని పొందుతుంది. ఆ భవన వైభవానికి కొరత ఉండదు.
ఆఫీస్‌ను తూర్పులో కట్టినా.. చాలామంది సిమెంట్ అరుగులు వేసుకొని, పరుపులు వేసి వాడుతారు. కానీ అక్కడ అరుగులు వేయడం మంచిదికాదు. కుర్చీ, టేబుల్ వేసుకొని వ్యాపారం చేయాలి. మీ ఆఫీస్ తూర్పులో కట్టినా మిల్లు ముఖాన్ని బట్టి దక్షిణంలో మిల్లు ఉంటే.. ఉత్తరంలో ఆఫీస్ పెట్టినా.. అరుగులు నిషేధం. అలాగే, ఆ ఆఫీస్‌కు తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యం ద్వారం పెట్టి వాడుకోవాలి. ఆఫీస్‌లో టాయిలెట్లు తూర్పు ఆగ్నేయంలోనే పెట్టాలి. మీది ఉత్తరం ఆఫీస్ అయితే వాయవ్యం దిశలో టాయిలెట్లు కట్టుకొని వాడుకోవాలి. అందులో దక్షిణం లేదా పడమర భాగంలో యజమాని (డైరెక్టర్) చాంబర్ ఉండాలి.
బాల్కనీ తూర్పులో లిఫ్ట్ పెట్టొచ్చా?
– ఎస్. జయదేవ్, కోరుట్ల
కారణాలు ఏమైతేనేం, ఇంటికి లిఫ్ట్ ప్రధాన అవసరంగా మారింది. కానీ, చాలామంది చాలా దోషాలతో ఇష్టం వచ్చినచోట కడుతున్నారు. కష్టాలు పడుతున్నారు. లిఫ్ట్ వాయవ్యంలో, ఉత్తరం బాల్కనీలోకి చేరేలా లేదా తూర్పు ఆగ్నేయంలో తూర్పు భాగం బాల్కనీలోకి చేరేలా కట్టడం.. ప్రధాన అంశం. లిఫ్ట్ ఒకవైపు ఉంటే.. మరోవైపు మెట్లు పెట్టుకోవాలి. అంటే, ఇంటికి ఆగ్నేయం లేదా వాయవ్యం లిఫ్ట్ – మెట్లు కలిసి పెట్టుకోవచ్చు. లేదా వేరుచేసి కూడా పెట్టుకోవచ్చు. ఇంటి భాగంలో వచ్చేలా కామన్ లిఫ్ట్ పెట్టడం మంచిదికాదు. కేవలం ఇంటిమందమే అయితే లోపల ఎలాగైనా పెట్టవచ్చు. అదికూడా నైరుతి – ఈశాన్యంలో కాకుండా.
మేము పిండిగిర్ని నడుపుతున్నాం. కొత్త ఇల్లు కడుతున్నాం. గిర్ని ఎక్కడ పెట్టాలి?
– కె. ముత్యం, నిర్మల్
మీరు తూర్పు ముఖంగా ఇల్లు కడితే ముందుగా షాపును (గిర్నిని) ఇంటి నిర్మాణంలో చేర్చాలి. మీ ప్రకారంగా ఇల్లు – షాపు కలిసి ఉండాలి కాబట్టి.. మీకున్న తూర్పు భాగాన్ని, ఈశాన్యం వదిలి గేటు మందం చోటు పెట్టుకొని మిగతా భాగాన్ని రెండు లేదా మూడు షాపులు.. తూర్పు హద్దు నుంచి మెట్ల కోసం వదిలి కట్టండి. అందులో తూర్పు సెంటర్ షాపులో మీరు పిండిగిర్ని పెట్టుకోండి. మిగతావి అద్దెకు ఇవ్వండి. షాపులకు అంటకుండా ఇంటికి వాటికి మూడు లేదా ఆరు అడుగులు వదిలి ఇల్లు ప్లాన్ చేసుకొని కట్టండి. ఇల్లు – షాపులు నిర్మాణం వేరు చేసి కడితే.. అది గొప్పగా ఉంటుంది. ఇంట్లోనే ఒక గదిని షాపుగా వాడుకోవాలని అనుకుంటే.. ఆగ్నేయం లేదా వాయవ్యం గదిని వాడుకోండి. దానిలోకి బయటినుంచే వెళ్లండి. మీ నిర్ణయాన్ని బట్టి సరైనచోట వంటగదిని అమర్చండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏమిటి? కార్పెట్ ఏరియా అంటే ఏమిటి? అవన్నీ చూడాలా?