Vasthu Shastra | ఇతరుల పేరుమీద ఇల్లుకొని మనం ఉండొచ్చా? లేదంటే, మన ఇల్లు మన పేరుతోనే ఉండాలా? అన్నట్టు, మేము అన్నా చెల్లెళ్లం.
– కె. గాయత్రి, వరంగల్
ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటేనే మంచిది. అంటే ఇల్లు మనం కొని దాని మంచి చెడ్డలు మనమే భరిస్తూ, ఇంటి మీద ఇతరుల పేరు ఉండటం మంచిదికాదు. అద్దె ఇల్లు వేరు.. సొంత ఇల్లు వేరు. అన్న ఇల్లు కొని, అన్న పేరుమీదే ఇల్లు ఉన్నప్పుడు.. మీరు ఆ ఇంట్లో ఉంటే, అద్దెకు దిగినట్లే అవుతుంది. అంతేకానీ, అది మీ సొంత ఇల్లు కాదు కదా! మీరు అన్నాచెల్లెళ్లు అంటున్నారు. అలాంటప్పుడు ఆ ఇల్లు మీ పేరుమీదనే ఉండనివ్వండి. మీరు నిజమైన యజమాని అయినప్పుడు అదే కరెక్టు కదా! లేదంటే, రేపు మీరు హక్కుదారు కాకపోవచ్చు. గృహం – గృహ యజమాని వేరుకాదు. యజమాని – అతని పేరు వేరు కాదు. కాబట్టి, మన గృహం మన పేరుమీదే ఉండటం మంచిది. ఇంటి డాక్యుమెంటు ‘ఈసీ’తోపాటు ఇల్లు శాస్త్రబద్ధంగా ఉండాలి. అప్పుడే అందరికీ మనశ్శాంతి.
మేము మాంసపు జాతి కోళ్లను పెంచుతాం. షెడ్డు వేయడానికి తగిన స్థలం ఉంది. కానీ ఎక్కడ, ఎలా వేయాలో చెప్పండి.
– డి. జగన్మోహన్, మోర్తాడ్
అంటే, మీరు బ్రాయిలర్ కోళ్లను పెంచుతున్నారు. వ్యాపారంలో శ్రమ అధికంగా ఉన్నా, జాగ్రత్తలు పాటిస్తే.. అత్యంత లాభదాయకమైన వ్యాపారం ఇది. అయితే, తప్పకుండా శాస్త్రరీత్యా వీటికి షెడ్లు, పోషణ అవసరం అవుతుంది. బ్రాయిలర్ షెడ్లను స్వచ్ఛమైన గాలి, వెలుతురు ప్రసరించేలా నిర్మించాలి. ప్రతి కోడికీ ఒక చదరపు అడుగు(సుమారుగా) తప్పక అవసరం అవుతుంది. బ్రాయిలర్ పెంపకంలో మంచి ఆధిక్యత ఉండాలి అంటే.. మేతకు, నీటికి ఆ షెడ్డులో స్థలాన్ని కేటాయించాలి. ప్రధానంగా కోళ్ల షెడ్డును దిశాత్మకంగా.. అంటే, ట్రూ నార్త్‌ను నేలమీద మార్కింగ్ చేసి, దాదాపు ముప్పై అడుగుల వెడల్పుతో వంద నుంచి మూడు వందల అడుగుల వరకూ పొడవుగా షెడ్లు వేసుకోవాల్సి ఉంటుంది. షెడ్లకు-షెడ్లకు మధ్య కనీసం అరవై అడుగుల దూరం ఉండాలి. షెడ్ల పడమర పారు చేస్తూ, దక్షిణం నుంచి ఉత్తరం వరకు సరైన దూరం పాటిస్తూ ఎన్ని షెడ్లను అయినా వేసుకోవచ్చు. అలాగే, పడమర నుంచి తూర్పు స్థలంలోకి విస్తరిస్తూ షెడ్డు వేయవచ్చు. తూర్పు-పడమర పొడవుతో షెడ్లు వేయడం మంచిది. కోళ్ల ఫారంలో ఎన్ని జట్ల కోళ్లు ఉంటాయో అన్నీ వేస్తూ, మరొకటి అదనంగా కూడా వేస్తుంటారు. ఎన్ని వేసినా.. దిశను-మధ్య దూరాన్ని గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా వేయాల్సి ఉంటుంది. క్షేత్రం చుట్టూ ప్రహరీ ఉండాలి. దాణా గదులు పడమరలో పెట్టుకోవాలి. భూమి నుంచి నాలుగు అడుగుల ఎత్తుతో కింద పిల్లర్లను లేపి షెడ్లను వేస్తారు. షెడ్డు చుట్టూ తిరగడానికి బాల్కనీ అన్ని వైపులా సమానంగా వేసుకోవచ్చు. లేదా దక్షిణం – పడమర ఐదు అడుగులు, తూర్పు – ఉత్తరం ఆరు అడుగులు వేసుకోవాలి. ద్వారాలు ఉత్తరం – ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవాలి.
మాకు క్రషర్ ప్లాంట్ ఉంది. ఆఫీస్, కాంటా యంత్రం ఎక్కడెక్కడ పెట్టాలి?
– ఎ. గోపాల్, కొల్లాపూర్
క్రషర్ మెషీన్ ఎత్తుగా ఉంటుంది. దాని వద్దకు రాళ్ల బండ్లు వచ్చి, అందులో రాళ్లు కుమ్మరిస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఎత్తుగా చేసి, రోడ్డు వేస్తారు. ఇదంతా దక్షిణం – పడమరలో ఏర్పాటు చేయాలి. పడమర – నైరుతిలో లేదా దక్షిణ – నైరుతి భాగంలో ఆఫీసు ఏర్పాటు చేయండి. మీ వీధులను బట్టి ఆ ప్లాంట్ ప్రధాన గేటు ఈశాన్యంలో లేదా తూర్పులో, ఉత్తరంలో పడమర రోడ్డు ఉంటే.. పశ్చిమ – వాయవ్యంలో గేటు పెట్టి వాడాలి. దక్షిణం అయితే.. దక్షిణ – ఆగ్నేయం గేటు రావాలి. తప్పకుండా మీ క్షేత్రానికి రేకులతో ఒక హద్దును ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే వాస్తు పటిష్ఠత ఏర్పడుతుంది. దిశ నిర్ధారించాలి అంటే.. హద్దు కుదుర్చుకుంటేనే అవుతుంది. గొయ్యితో కూడిన కాంటా పట్టాలి అంటే.. ఉత్తరం రోడ్డులో పెట్టండి. లేదా తూర్పులో పెట్టండి.
ఉత్తరం నుంచి కల్యాణ మండపం సెల్లార్‌కు వెళ్లవచ్చా? లేదంటే పడమర నుంచి వెళ్లాలా? మాది పడమర వీధి స్థలం.
– బి. రాజు, దుద్దెడ
కల్యాణ మండపానికి సహజంగా పెద్దపెద్ద హాల్స్ అవసరం అవుతాయి. కాబట్టి, స్థలం ఎటు ఉన్నా.. పూర్తిగా లోతుగా కాకుండా, సెమీ సెల్లార్ వేయవచ్చు. అప్పుడే గాలి, వెలుతురు వస్తాయి. పడమర వీధి కలిగిన మీ మండపంలోకి పశ్చిమ – వాయవ్యం నుంచి ర్యాంపు వేసుకొని, లోపలికి వెళ్లవచ్చు. అయితే, పశ్చిమ – నైరుతి నుంచి ర్యాంపు వేసుకొని వెళ్లడం చాలా ప్రమాదకరం. వద్దు. రాకపోకలకు అవసరం అని రెండు వైపులా ర్యాంపులు వేయడం మంచిదికాదు. వేరువేరుగా వేయాలనుకుంటే పడమర మధ్యలో ఒకటి, పడమర వాయవ్యంలో ఒకటి.. అలా రెండూ వేసుకోవచ్చు. లేదంటే.. పెద్దగా ఒకదానినే పశ్చిమ – వాయవ్యంలో వేసుకొని, రాకపోకలు చేసుకుంటే మంచిది.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678