YouTuber Ravan : యూట్యూబర్ (YouTuber) ప్రశ్న రావణ్ (Prashna Ravan) పై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు గడువును మరో 30 రోజులపాటు పొడిగిస్తూ కృష్ణా జిల్లా (Krishna District) కోర్టు ఈరోజు కీలక ఉత్తర్వులు జారీచేసింది. వివరాల్లోకి వెళ్తే ప్రశ్న రావణ్‌పై నమోదైన ఉపా కేసులో చట్ట ప్రకారం నిర్దేశించిన 90 రోజుల దర్యాప్తు గడువు రేపటితో ముగియనుంది.
ఈ నేపథ్యంలో కేసులో మరింత లోతైన విచారణ జరిపి కీలక ఆధారాలు సేకరించేందుకు అదనపు సమయం అవసరమని దర్యాప్తు అధికారులు భావించారు. ఈ మేరకు గడువును పొడిగించాలని కోరుతూ కృష్ణా జిల్లా కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం దర్యాప్తు అధికారుల విజ్ఞప్తిని అంగీకరించింది. విచారణ పూర్తి చేయడానికి మరో 30 రోజుల గడువు ఇస్తూ ఆదేశాలు జారీచేసింది.
రావణ్ మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేస్తున్నాడని, సాయుధ విప్లవానికి మద్దతు ఇస్తున్నాడని జనసేన నేత ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు జూలై నెలలో పోలీసులు రావణ్‌ను అరెస్టు చేసి ఉపా కేసు నమోదు చేశారు. తాజా ఉత్తర్వులతో దర్యాప్తు అధికారులు విచారణను కొనసాగించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.