Vasthu Shastra | నా ఇల్లు.. నా బిడ్డకు పనికిరాదని అంటారు. ఇది నిజమా?
– ఇ. లోకేష్, చిట్యాల
మానవ నివాసాలు.. ఎవరికైనా పనికొస్తాయి. శాస్త్రబద్ధంకాని ఇండ్లు ఎవరికైనా పనికిరావు. ఈ విషయంలో తిరుగులేదు. ఇంటిని మనుష్యాలయం అని శాస్త్రం ఉద్ఘాటిస్తుంది. అందులో కొడుకు – కోడలు, మిత్రులు – శత్రువులు.. సకల జనులూ వస్తారు. ఇల్లు మీ తదనంతరం మీ వారసులకే చెందుతుంది. పూర్వకాలంలో గృహ నిర్మాణ విధి విధానాలు వేరువేరుగా ఉండేవి. వాటి ప్రతిష్ఠాపన పద్ధతులు-కొలతలు (హస్తాలు), యజమాని – అంశ, ఆహార్యం ప్రధానంగా తీసుకుని ఇల్లు కట్టేవారు. ప్రస్తుతం రెడీమేడ్ దుస్తుల్లా రెడీమేడ్ విల్లాలు.. ఎవరో కట్టినవి, ఇంకెవరో అమ్మితే గుడ్డిగా కొనేస్తున్నాం. మీ ఇల్లు మీ అబ్బాయికి పనికిరాదనే విషయాన్ని పక్కనపెట్టండి. మీ ఇంట్లో దోషాలు ఉంటేమాత్రం.. మీకు, మీ అబ్బాయికి కూడా పనికిరాదు అని గుర్తుంచుకోండి.
ఇంటి ముందు రోడ్డు సింహద్వారం వరకు వస్తే సరిపోతుందా?
– కె. రాజబోసు, కొండాపూర్
మీ ఇంటి ప్లాన్ చూశాను. రోడ్డు మీ ఇంటి వరకు పూర్తిగా రాలేదు. పైగా మీది తూర్పు డెడ్ ఎండ్ రోడ్డు. ఆ రోడ్డు కూడా మీ ఇంటికి ఉత్తరం మధ్య వరకే వచ్చి ఆగింది. మీ ఇంటికి ఉత్తర – ఈశాన్యం వరకూ రోడ్డు రాలేదు. కారణం.. అది ఇతరుల స్థలం. అలాంటి వీధికి మీరు ఇల్లు కట్టాలనుకోవడం మంచిదికాదు. కారణం.. మీ నడక మీ ఇంటిని దాటిపోదు. పైగా అది ఇంటి మొత్తానికీ లేదు. తద్వారా మీ గృహం ఎదుగుదల ఆగిపోతుంది. పిల్లల చదువులలో ఇబ్బంది రావచ్చు. వారి భవిష్యత్ జీవితం కుంటుపడుతుంది. మన గృహానికి ఉండే రోడ్డు అది దక్షిణం అయినా, తూర్పు అయినా మన వీధిని దాటుతూ, ఏదో ఒక ప్రధాన వీధికి అనుసంధానమై ఉండాలి. వీధులు-వాటి నడకలు-హెచ్చు తగ్గులు ఆ ఇంటికి తప్పక వర్తిస్తాయి. మీరు ఆ స్థలాన్ని గృహానికి వాడకుండా ఉంటేనే మంచిది.
మాకు ఉత్తరం రోడ్డు ఉంది. కానీ, అది పది డిగ్రీలు తిరిగి ఉంది అంటున్నారు. అలా ఉంటే ఇల్లు కట్టొచ్చా?
– సి. పరిమళ, మోత్కూర్
ఇంటి నిర్మాణంలో దిశ అత్యంత ముఖ్యం. అయితే, కొన్ని లే అవుట్లు పూర్తిగా విదిక్కులకు తిరిగి ఉంటాయి. కొన్ని స్వల్పంగా ఐదు, పది డిగ్రీలు తిరిగి ఉంటాయి. స్వల్పంగా తిరిగిన వీధి ఉన్న స్థలాల్లో ఇల్లు కట్టుకోవచ్చు. ఆ స్థలాలు పూర్తిగా నిషేధితం కావు. అయితే దిశను సరిగ్గా అంచనాకట్టి నిర్ణయించాలి. మీ స్థలానికి ఎటువైపు పది డిగ్రీలు తిరిగిందో స్పష్టంగా రాయలేదు. ఉత్తర – వాయవ్యం పెంచుకుంటూ గనుక మీ రోడ్డు పోయినట్లయితే.. ఆ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవచ్చు. దానిని ఉత్తరంగానే గుర్తించాలి. ఉత్తర – ఈశాన్యంలో పెద్ద గేటు పెట్టుకొని, ఉత్తరంలో టాయిలెట్లు రాకుండా, మీరు ఇంటిని కట్టుకోవచ్చు. పడక గది ద్వారం కూడా తూర్పు – ఈశాన్యం కాకుండా, ఉత్తర – ఈశాన్యంలోనే పెట్టండి.
ఈశాన్యం తెంపు కలిగిన ఇల్లు కొనొచ్చా?
– కె. శ్రీహరి, చాడ
మంచి ఇల్లు దొరక్కపోయినా, మంచి స్థలం చాలా ముఖ్యం. ఇంట్లోని దోషాలు మనం సరిచేసుకునే అవకాశం ఉంటుంది. స్థలం బాగాలేకపోతే.. ఎవరమూ ఏమీ చేయలేం. ఈశాన్యం లోపం ఉంది అంటున్నారు. దానికి నైరుతి లోపం కూడా ఉంటుంది. కొనే ఇల్లు దోషాలతో ఉంటే, ఆ దోషాలు సరిచేసుకునే విధంగా ఉన్నాయా.. లేదా? అనే విషయాన్ని బేరీజు వేసి నిర్ణయం తీసుకోవాలి. తగిన మార్పులు చేసుకున్నాకే ఆ ఇంట్లోకి ప్రవేశించాలి. వీధిపోట్లు, వంకర దిశలు, చెరువు పక్క నిర్మాణాలు.. మొదలైన ఇబ్బందులు ఉన్న ఇండ్లు ఎంత అందంగా, గొప్పగా ఉన్నా.. తీసుకోవడం మంచిది కాదు. మీరు ఆ ఇల్లు కొని, బాగు చేసుకొని, అందులో ఉండవచ్చు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | ఇంటి మధ్యలో దేవుళ్ల విగ్రహం పెట్టొచ్చా? వాస్తు ఒప్పుకొంటుందా?
Vaastu | కవల పిల్లలకు స్థలం కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఇద్దరికీ ఒకే రోడ్డు ఉండాలా?