Vasthu Shastra | బెడ్రూమ్ ఆనుకొని స్విమ్మింగ్ పూల్ పెట్టొచ్చా? పెడితే.. ఎటువైపు పెట్టాలి?
– బి. రాజేందర్, కొమురవెల్లి
ఇంటికి పడక గదులు దక్షిణం-పడమర స్థానాల్లో వస్తాయి. వాటికి ఆనుకొని అంటే.. స్విమ్మింగ్ పూల్ పడమర-నైరుతి స్థానాల వైపునే వస్తుంది కదా! బెడ్ వద్ద స్విమ్మింగ్ పూల్ ఉండాలనే ఆలోచనే తప్పు! నీటి స్థానం (స్విమ్మింగ్ పూల్) వేరు, పడక గదుల స్థానం వేరు. ఇంటికి దగ్గర-దూరం అని కాదు. ఈశాన్యంలో కానీ, తూర్పులో కానీ, ఉత్తరంలో కానీ స్విమ్మిగ్ పూల్ పెట్టాలి. ప్రైవసీ ఉండాలి అనుకుంటే.. స్టిల్ట్‌లో ఇంటి కింద తూర్పు భాగంలో లేదా ఉత్తర భాగంలో పెట్టుకోండి. పడక గదులను ఆనుకొని స్విమ్మింగ్ పూల్ పెట్టడం దోషం అవుతుంది. మన ఇష్టానుసారం శాస్త్రం ఉండదు. దాన్నే మనం అనుసరించాలి.
టీవీ, యూట్యూబ్, వాట్సాప్‌లలో.. ఒక్కొక్కరు ఒక్కోలా వాస్తు చెబుతున్నారు. వింటుంటే.. చాలా భయంగా ఉంది. ఏం చేయాలి?
– కె. వసుంధర, కేపీహెచ్‌బీ కాలనీ
ఇవ్వాళ ఎన్నో సాధనాలు వచ్చాయి. ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు పబ్లిక్‌లోకి వదులుతున్నారు. వాటన్నిటినీ చూసి మీరు భయపడుతున్నారు. శాస్త్రం ఎప్పుడూ భయపెట్టదు. ఈ విషయాన్ని మీరు ముందుగా అర్థం చేసుకోవాలి. రోగం.. భయపెడుతుంది కానీ, వైద్యం భయపెట్టదు కదా! మీరు నిపుణులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఎంపికను బట్టి మీకు ఫలం ఉంటుంది. మీరు అన్నీ తెలుసుకొన్నాకే, మీ ఇంటికి మార్పులు చేయాలని అనుకోకండి. తెలిసిన వారికి గృహం చూపించుకొని, ప్లాన్ వేయించుకొని ప్రాక్టికల్‌గా ముందుకు వెళ్లండి. వాట్సాప్‌లు, యూట్యూబ్‌లు.. శాస్త్ర సమగ్రతను అందించలేవు. స్థలం చూసి, మీ ఆలోచనలు, అవసరాలు తెలుసుకొని కట్టేదే.. ఇల్లు. అందుకు తగిన సూచనలు చేసేవాళ్లు ఉంటారు. ముందు వాళ్లను సంప్రదించండి. యూట్యూబ్‌లను కాదు.
కిచెన్‌కు మంచి వెంటిలేషన్ ఉండాలి అంటారు. దక్షిణం వైపు కూడా కాంతి ఉంటుంది కదా! అక్కడ కిచెన్ ఎందుకు పెట్టొద్దు?
– డి. చంద్రశేఖర్, పెద్దపల్లి
నైరుతి గదిలో మంచి కాంతి వస్తుంది. ఈశాన్యం గదిలో కూడా పుష్కలంగా వెలుతురు ఉంటుంది. అలా అని అన్ని దిశలకూ కిచెన్ కూర్చోదు. అందరూ ఆడపిల్లలే! అబ్బాయిలే! కానీ, వరుస అయిన వారికే ఇచ్చి పెళ్లి చేస్తాం కదా! కాంతి కాదు.. ప్రధానం. స్థానం ప్రధానం. వెలుతురుతోపాటు గాలి కూడా ఉంటుంది. అందుకే, గాలి – వెలుతురు అంటారు. దక్షిణంలో వెలుతురు ఉంటుంది. కానీ, గాలి ఇంట్లోకి వీస్తుంది. ఆగ్నేయంలో కిచెన్ ఉంటే.. దాని వాసనలు ఇంట్లోకి రాకుండా దక్షిణం వైపు మళ్లుతాయి. కోణం వేరు. దిశలు వేరు. వాటివాటి స్థానాలు వాటివాటి ప్రాధాన్యతలను బట్టి, శాస్త్రం కొన్ని గదులకు కొన్ని దిశలు ఇచ్చింది. వాటిని పాటించడం ఆరోగ్యదాయకం.
డ్రాయింగ్ రూమ్‌లో లిఫ్ట్ పెట్టుకోవచ్చా? మాది డూప్లెక్స్ ఇల్లు. ముందే కట్టాం.
– కె. వెంకట్, కొల్లూరు
మీరు మీ సొంత ఇంట్లో లిఫ్ట్ ప్లాన్ చేయాలి అనుకుంటే.. అది కేవలం మీకు మాత్రమే అనుకుంటే, ఇంటి లోపల పెట్టుకోవచ్చు. బయట లిఫ్ట్ రావాలి, అదీ అందరికీ ఉపయోగపడాలి అనుకుంటే.. డ్రాయింగ్ రూమ్‌లో పెట్టకూడదు. పెద్ద దోషం అవుతుంది. పైన ఎత్తుగా రాకుండా హైడ్రాలిక్ లిఫ్ట్‌ను ఇంట్లో మీ వరకే అనుకుంటే.. డ్రాయింగ్ గదిలో, ఆగ్నేయ భాగంలో.. లోపలవాడేలా పెట్టుకోండి. ఇప్పటికే ఇల్లు కట్టి ఉంది కాబట్టి, ఇంట్లో నడిచే లిఫ్ట్ ఎక్కడ వీలున్నా పెట్టవచ్చు. ప్రధానంగా ఇంటి ఈశాన్యం మూతపడే విధంగా కాకుండా.. తగిన జాగ్రత్త తీసుకుంటూ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. టెక్నికల్‌గా బీములు, కొలతలు చూసుకొని ఏర్పాటు చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. సౌకర్యం ముఖ్యమే, దాంతోపాటు వాస్తూ ప్రధానం.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vaasthu Shastra | ఒక్క కొడుకు ఉంటే.. అతనికి తూర్పు రోడ్డు ఇల్లు మాత్రమే కట్టి ఇవ్వాలా?
Vasthu Shastra | ఆగ్నేయం ఇంటికి సెల్లార్ ఉండవచ్చా?
Vasthu Shastra | ఇంట్లో కుందేళ్లను పెంచుకోవచ్చా?
Vasthu Shastra | మా కాలేజీకి ఈశాన్యంలో సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది.. దీనివల్ల ఏమైనా కీడు జరుగుతుందా?
Vasthu Shastra | ఇంటి మధ్యలో దేవుళ్ల విగ్రహం పెట్టొచ్చా? వాస్తు ఒప్పుకొంటుందా?
Vaastu | కవల పిల్లలకు స్థలం కొనేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఇద్దరికీ ఒకే రోడ్డు ఉండాలా?