Budapest | స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిక్ నుంచి బుడాపెస్ట్ వరకు రైలు మార్గంలో సాగిన మా ప్రయాణం.. దారిపొడవునా మంచుదుప్పటి కప్పుకొన్న యూరప్ పట్టణాలను, పల్లెలనూ దాటుకుంటూ హంగరీ రాజధానికి చేరుకుంది. ఆ వారసత్వ నగరంలో.. అడుగడుగునా అద్భుతాలే!
యూరప్ మొత్తంలో అత్యంత సాంస్కృతిక వైవిధ్యం, గొప్ప చరిత్ర కలిగిన నగరం హంగరీ రాజధాని బుడాపెస్ట్. యూరప్ ఖండం నడిమధ్యన ఉన్న బుడాపెస్ట్ నిజానికి 1873లో మూడు నగరాలు (బుడా, ఓబుడా, పెస్ట్) కలిస్తే ఏర్పడింది. బుడా ఓ కొండమీద ఉంటుంది. డాన్యూబ్ నదికి ఆవల ఉన్న పెస్ట్, ఓబుడా కొంతమేర మైదాన ప్రాంతాలు. గడచిన శతాబ్దకాలంలో రెండు ప్రపంచ యుద్ధాలలో తీవ్రంగా నష్టపోయిన హంగరీ అటు నాజీయిజం నుంచి ఇటు కమ్యూనిజం మీదుగా క్యాపిటలిజం వరకూ అన్ని ఇజాలనూ చవిచూసింది. భిన్నధ్రువాల మధ్య నలిగిపోతూ కష్టనష్టాలకు లోనైంది. మేము బుడా కొండ మీదున్న హిల్టన్ హోటల్లో దిగాం. దాని చుట్టూ అనేక పురాతన వారసత్వ కట్టడాలు ఉన్నాయి. తొలిరోజు ఉదయాన్నే లోకల్ టూర్ కోసం క్యాబ్ బుక్ చేసుకున్నాం. లోకల్ గైడ్‌గా కూడా ఉపయోగపడే డ్రైవర్ కావాలని ముందే చెప్పాం. మేం వెళ్లే సరికి.. నలుపురంగు టొయోటా కారుతో ఆండ్రూ సిద్ధంగా ఉన్నాడు. ముందుగా, పక్కనే ఉన్న కొన్ని ప్రదేశాలు చూశాం.
మా హోటల్‌కు అనుకుని మత్థేయస్ చర్చి ఉన్నది. కీ.శ 1015లో హంగరీ రాజు సెయింట్ స్టీఫెన్ దీన్ని నిర్మించాడట. అనేక యుద్ధాలు, దాడులలో ధ్వంసమైపోవడంతో, 19వ శతాబ్దం చివరన పునర్నిర్మించారు. పక్కనే ఉన్న మరో చారిత్రక కట్టడం.. ఫిషర్మెన్స్ బాస్టియన్. 1700లలో నిర్మించిన ఒక కోటలోని భాగమే ఈ నిర్మాణం. బుడాపెస్ట్‌కు వెళ్లే ప్రతి టూరిస్ట్ ఈ కట్టడాన్ని తప్పక దర్శించాలి. డాన్యూబ్ నదికి సమాంతరంగా 140 మీటర్ల ప్రాకారం ఉంది. దానికి ఉన్న కిటికీల గుండా నగరం మొత్తం దర్శనమిస్తుంది. అక్కడే చాలాసేపు గడిపి, తదుపరి మజిలీకి బయలుదేరాం.
హంగరీకి సముద్ర తీరం లేకపోవచ్చు. కానీ ఈ దేశానికి విలువైన నీటి సంపద ఉన్నది. దేశమంతా విస్తరించి ఉన్న 1300 వేడి నీటి బుగ్గల్లో (హాట్ స్ప్రింగ్స్) 120 వరకూ ఒక్క బుడాపెస్ట్‌లోనే ఉన్నాయి. ఈ హాట్ స్ప్రింగ్స్‌లో ఔషధ గుణాలున్న ఖనిజాలు కరిగి ఉంటాయి. అందుకే, వందల ఏళ్ల క్రితమే ఇక్కడ అనేక స్నానశాలలు వెలిశాయి. బుడాపెస్ట్‌కు వచ్చే టూరిస్టులు ఆ వెచ్చని నీటిలో సేదతీరుతారు. మా క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని 1918లో నిర్మించిన గిల్లెర్ట్ థర్మల్ బాత్కు తీసుకువెళ్లాడు. మేం స్నానం చేయలేదు కానీ.. ఆ పరిసరాలు చూసి, ఫొటోలు తీసుకుని వచ్చేశాం.
డాన్యూబ్ నది మీద 1840లలో కట్టిన మొదటి వంతెన చెయిన్ బ్రిడ్జ్. బుడా, పెస్ట్ నగరాలను తొలిసారిగా కలిపిన వారధి ఇదే. ఈ నగరంలో ఎత్తయిన భవంతులేవీ కనపడవు. నగరంలో అత్యంత ఎత్తయిన కట్టడాలు రెండే రెండు. ఒకటి సెయింట్ స్టీఫెన్స్ బాసిలికా, మరొకటి హంగరీ పార్లమెంటు భవనం. రెండూ కూడా 96 మీటర్ల ఎత్తే ఉంటాయి. హంగరీ దేశం క్రీ.శ. 896లో ఉనికిలోకి వచ్చింది. కాబట్టే ఆ రెండు భవంతులూ 96 మీటర్లు ఉంటాయని అంటారు. మేం బుడాపెస్ట్ వెళ్లింది జనవరి నెలలో. కానీ ఈ నగరాన్ని చూడటానికి మంచి సమయం.. మే నెల నుంచి అక్టోబర్ వరకు. మిగతా నెలల్లో వాతావరణం మరీ చల్లగా ఉంటుంది. బుడాపెస్ట్ ప్రజా రవాణా వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1866లో మొదలైన ట్రామ్ సర్వీసు నేటికీ విజయవంతంగా నడుస్తున్నది. 1896లో బుడాపెస్ట్‌లో మొదలైన మెట్రో రైలు యూరప్ ఖండంలోనే అత్యంత పురాతనమైనది. ఈ మెట్రోను యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. సిటీ బస్సులకైతే కొదవే లేదు. చార్జీలూ చవకే. బుడాపెస్ట్‌లో మరో ఆకర్షణ రూయిన్ బార్లు. రెండో ప్రపంచ యుద్ధం, తర్వాతి పరిణామాల్లో బుడాపెస్ట్‌లో కొన్ని భవంతులు శిథిలం అయ్యాయి. ఆ పాడుబడ్డ భవనాలనే ప్రత్యేక థీమ్ బార్లుగా మార్చారు. ఇవి ప్రతి రాత్రీ సందర్శకులతో కిక్కిరిసిపోతాయి.
ద షూస్ ఆన్ ద డాన్యూల్ బ్యాంక్ వద్ద వ్యాస రచయిత కొణతం దిలీప్
మర్నాడు ఉదయం క్యాబ్‌లో కూర్చునేసరికి సన్నగా ముసురు మొదలైంది. మూడు అంచెల దుస్తులు ధరించినా చలి వణికిస్తూనే ఉంది. మా డ్రైవర్ చెయిన్ బ్రిడ్జి దాటి డాన్యూబ్ నది అంచున ఉన్న రోడ్డు పక్కన ఆపాడు. రెండు గొడుగులు ఇచ్చి ఇక నడవమన్నాడు. మాకేమో చలికి వేళ్లు వంకర్లు పోతున్నాయి. కొద్ది దూరం నడిచాక.. జనం గుమికూడి ఉన్నచోట ఆగమన్నాడు. అక్కడ నేల మీద చెల్లాచెదురుగా కొన్ని బూట్లు పడున్నాయి. దగ్గరికి పోయిచూస్తే కానీ నిజం బూట్లు కావని తెలియలేదు. అవి ఇనుముతో చేసిన బూట్ల బొమ్మలు. రెండో ప్రపంచ యుద్ధంలో డాన్యూబ్ నది ఒడ్డున ఊచకోతకు గురైన యూదుల స్మారకార్థం.. హంగరీకి చెందిన కాన్ తోగే అనే సినిమా దర్శకుడు గ్యులా పార్ అనే శిల్పి కలిసి సృష్టించిన ‘ద షూస్ ఆన్ ద డాన్యూబ్ బ్యాంక్’ అది. వందలాది యూదులను ఆ నది ఒడ్డున నిలబెట్టి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపే ముందు.. ఆ పాదరక్షల్ని ఎవరికైనా అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ వాటిని విడిపించిందట హంతక ముఠా. ఆ చీకటి రాత్రి నాజీల తూటాలకు నేలకొరిగిన యూదులను తలచుకుంటూ, ఆ బూట్లలో పుష్పాలుంచి భారమైన హృదయంతో
అక్కడి నుంచి కదిలాం.
అక్కడికి కూతవేటు దూరంలోనే.. హంగేరియన్ పార్లమెంటు భవనం ఠీవిగా దర్శనమిచ్చింది. 1902లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవంతి యూరప్ ఖండంలోనే అతి పెద్ద పార్లమెంటు భవనం కూడా. భవంతి ఆవరణలో 88 మంది హంగేరియన్ పాలకులు, రాజులు, మిలిటరీ కమాండర్ల విగ్రహాలు పెట్టారు. అందులో కొన్నిటి పేర్లు చదువుతూ ముందుకు సాగాం. అక్కడినుంచి నగరంలోని ప్రధాన షాపింగ్ ప్రాంతం వాసీ స్ట్రీట్‌కు తీసుకెళ్లాడు మా క్యాబ్ డ్రైవర్. అక్కడే కొంత షాపింగ్ చేసి, మధ్యాహ్న భోజనం కూడా చేశాం.
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ పక్షాన నిలిచిన హంగేరియన్ పాలకులు సుమారు ఆరు లక్షల యూదులను ఊచకోత కోశారని చెప్పుకొచ్చాడు మా డ్రైవర్. యుద్ధం ముగిశాక రష్యా అధీనంలోకి వెళ్లింది హంగరీ. అప్పుడు, ఇంకోరకం హత్యాకాండ మొదలైంది. స్టాలిన్ నాయకత్వంలోని రష్యా కనుసన్నల్లో నడిచే ప్రభుత్వాలు మరోరెండు లక్షల మంది హంగేరియన్ల ఉసురు తీశాయి. సుమారు నాలుగు దశాబ్దాల కమ్యూనిస్ట్ పాలన తరువాత.. 1980లో జరిగిన తిరుగుబాటు కారణంగా క్యాపిటలిస్ట్ ప్రభుత్వం వచ్చిందని వివరించాడు. ఆరోజు కూడా ఆకాశం మేఘావృతమైంది. అప్పుడప్పుడూ చినుకులు రాలుతున్నాయి. మాటల్లోనే బుడాపెస్ట్ నడిబొడ్డున ఉన్న హీరోస్ స్క్వేర్ చేరుకున్నాం. 1896లో హంగరీ సహస్రాబ్ది సందర్భంగా ఇక్కడే ఓ స్మారక చిహ్నం నిర్మించారు. 1932లో దీనికి హీరోస్ స్క్వేర్‌గా నామకరణం చేశారు. నలుదిక్కులా అందమైన భవంతులతో, స్క్వేర్ మధ్యలో ఒక భారీ స్తూపంతో ఆకట్టుకునేలా ఉందీ ప్రదేశం. బుడాపెస్ట్‌లో చివరి రోజు సాయంత్రం మిత్రులమంతా డాన్యూబ్ నది ఒడ్డున కూర్చున్నాం. ప్రపంచంలోనే అత్యధికంగా.. పది దేశాల గుండా ప్రవహించే మహానదిలో నిర్మలంగా పారుతున్న ఆ నీటికేసి చూస్తే.. ఇజాల మత్తులో పడి మూర్ఖపుమానవులు ఈ నదిలో ఎంత నెత్తురు పారించారో కదా అనిపించింది. మనసు చివుక్కుమంది.
…? కొణతం దిలీప్
Budapest6
Budapest7
“Hyderabad | హైదరాబాద్ నుంచి ఒక్కరోజులో తిరిగొచ్చే ఈ టూరిస్ట్ స్పాట్స్ తెలుసా !”
“On Her Way | అమ్మాయిలూ.. ఒంటరిగా టూర్ వెళ్లాలని అనుకుంటున్నారా? ఇది మీకోసమే”