Mayan Kingdom | మెక్సికో పర్యటనలో భాగంగా.. ‘సెనోటే’ను సందర్శించి, ప్రకృతి ఒడిలో పరవశించిపోయాం. అందమైన భారీ దిగుడు బావిని చూసి అచ్చెరువొందాం. ఆ తర్వాత.. మాయన్ల సామ్రాజ్యంలో విహరించడానికి బయల్దేరాం.
షాపింగ్ తర్వాత బస్ ఎక్కబోతున్న మమ్మల్ని ఓ ఇంటి ఆర్చ్ బాగా ఆకర్షించింది. ప్రయాణానికి పది నిమిషాల సమయం ఉండటంతో ఆ ద్వారం గుండా లోపలికి వెళ్లాం. మట్టిగోడలు, తాటాకులూ రెల్లుగడ్డి పైకప్పుతో రూపొందించిన ఆ గుడిసె.. మాయన్లది. ఖగోళం, గణితశాస్త్రంపై పట్టు సాధించి, అత్యంత ప్రతిభావంతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు మాయన్లు. తమ అసాధారణ జ్ఞానంతో అత్యంత అధునాతనమైన క్యాలెండర్‌ను రూపొందించి, చరిత్రలో నిలిచిపోయారు. ఆ చిన్న ఇంట్లో ఉన్న అనేక వస్తువులు మనకు దాదాపు తెలిసినవే. రాతి రోలు, సాంబ్రాణి గిన్నె, పైకప్పునకు తగిలించిన లాంతరు బుడ్డి, పిల్లలు ఆడుకునే బొంగరం, పెరుగు, పాలు దాచిపెట్టే వెదురు ఉట్టి, రాళ్లతో చేసిన కట్టెల పొయ్యి, ఆరుబయట కర్రలతో చేసిన బెడ్.. పురాతన కాలంలోని ఆధునికతకు అద్దం పట్టాయి. పెరట్లో పలు రకాల పూలు, పండ్ల చెట్లతో ముచ్చటగా ఉన్న ఆ ఇంటినుంచి బయటికి వచ్చేశాం.. బస్సు హారన్ వినపడటంతో!
అక్కడినుంచి యుకాటన్ రాష్ట్రంలో ఉన్న ‘చిచున్ ఇట్జా’ను చూడటానికి బయల్దేరాం. చిచున్ ఇట్జా.. దేవాలయాలు, పిరమిడ్లతో కూడిన అతిపెద్ద మాయన్ పవిత్ర నగరం. అప్పట్లో ఇది మాయన్ల మత, సైనిక, వాణిజ్య, రాజకీయ కేంద్రం. 1988లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. పిరమిడ్ల ప్రవేశ ద్వారం దగ్గర బస్సు దిగిపోయాం. అక్కడినుంచి నడుస్తూనే.. దారికి ఇరువైపులా ఉన్న మాయన్ నాగరికత ఆనవాళ్లుగా నిలిచిన అనేక ముద్రలు, మాస్కులు, శిల్పాలు, ఆటవస్తువులు చూస్తూ ముందుకు సాగాం. విశాలమయిన ఆ ప్రదేశం ఎంత అందంగా ఉందంటే, కనుచూపు మేరా పచ్చని పచ్చదనం. అక్కడక్కడా రాతి కట్టడాలు, భారీ పిరమిడ్లు. వాటిని చూస్తూ ఉంటే కాసేపు ఎవరయినా కాలాన్ని ఆపితే బాగుండు అనిపించింది. ప్రతీ నిర్మాణం గురించి ఎంతో ఓపికగా, వివరంగా చెప్పాడు మా గైడ్. అయితే.. భారీ వర్షం కురవడంతో అయిష్టంగానే అక్కడినుంచి వెనుదిరిగాం. మా పిల్లల కోరిక మేరకు మాయన్ క్యాలెండర్ చిహ్నంతో ఉన్న చెస్ బోర్డ్, చిచున్ ఇట్జా చిహ్నంతో ఉన్న చెస్ బోర్డ్ కొనుక్కుని పరుగులాంటి నడకతో బస్ దగ్గరికి చేరుకున్నాం.
మా మెక్సికో ట్రిప్‌లో చివరిరోజు. మా కోసం కేటాయించిన మినీ బస్‌లో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని చెక్ఇన్ అయిపోయాం. ఇంకా విమానం బయల్దేరడానికి సమయం ఉండటంతో షాపింగ్‌కు వెళ్లాం. ‘టెకీలా’ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కాస్త తియ్యగా, పండ్ల వాసనతో, మట్టి పరిమళం కలిగి ఉండే టెకీలా జన్మస్థానం.. మెక్సికో. నీలి అగేవ్మొక్క నుంచి ఈ పానీయాన్ని తయారుచేస్తారు. బహుళ ప్రాచుర్యం పొందిన టెకీలా.. ప్రపంచం నలుమూలలకూ ఎగుమతి అవుతుంది. అంత ప్రాముఖ్యం సంతరించుకోవడానికి కారణం.. మెక్సికన్ల వ్యాపార మెలకువలే! ఏ కొత్త స్థలానికి వెళ్లినా అక్కడ లభ్యమయ్యే స్థానిక వస్తువులు సేకరించడం అలవాటయిన నేను.. ఒక టెకీలా బాటిల్ కొనుగోలు చేశా. అలా మూడు రోజుల మెక్సికో ప్రయాణం.. ఎన్నో తీపిగుర్తులను నాలో నిక్షిప్తం చేసింది.
…✍ స్వర్ణ కిలారి
“మెక్సికోలో ఎక్కువగా కనిపించే సెనోటే ప్రత్యేకత ఏంటో తెలుసా!!”