Sunkishala Project | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ‘మంచైతే మాది.. చెడు అయితే మీది’ అన్నట్టుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సుంకిశాల ఘటనను కూడా గత ప్రభుత్వం మీదికి నెట్టేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదే ప్రయత్నం చేశారు. అయితే, జలమండలి వివరణతో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. అది కూడా తమపైకి రాకుండా నెపాన్ని ఏజెన్సీపైకి నెట్టివేసే ప్రయత్నం చేసింది. ‘వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మిడిల్ టన్నెల్ పూర్తి చేయడానికి ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం వారు సంప్ వైపు టన్నెల్‌పై గేటును ఏర్పాటు చేశారు. రిజర్వాయర్ వైపు ఉన్న మట్టిని తొలగించారు. అదే సమయంలో సివిల్ వర్స్ టీమ్స్ సైడ్‌వాల్స్ మధ్య టై బీమ్ కనెక్టివిటీని కాస్టింగ్ చేసే పనిలో ఉన్నాయి. రిజర్వాయర్‌కు వరద ఆలస్యంగా వస్తుందని, ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి మధ్య టన్నెల్ స్థాయికి లెవల్ పెరుగుతుందని ఏజెన్సీ భావించింది. ఆగస్టు చివరి నాటికి అవసరమైన టై బీములను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో మిడిల్ టన్నెల్ కోసం గేట్ ఫిక్సింగ్ పనులు చేపట్టారు. జూలై 29, 30, 31 తేదీల్లో గేటు బిగింపు పనులు జరిగాయి. ఇదే సమయంలో నాగార్జున సాగర్‌కు ఒకసారిగా భారీ ప్రవాహం పెరిగింది. దాదాపు 3.50 లక్షల క్యూసెకుల ఇన్‌ఫ్లో రావడంతో రిజర్వాయర్ వద్ద అకస్మాత్తుగా బ్యాక్ క్లోజ్ వేవ్ యాక్షన్ పెరిగి నీళ్లు టన్నెల్లోకి వచ్చాయి. దీంతో టన్నెల్ గేటు ధ్వంసమై దానికి అనుసంధానంగా ఉన్న సైడ్‌వాల్ కూలిపోయింది. ఇదంతా ఐదు నిమిషాల స్వల్ప వ్యవధిలోనే జరిగింది. రిజర్వాయర్ సంపు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండిపోయింది’.. ఇదీ, సుంకిశాల కూలిన ఘటనపై గురువారం జలమండలి కార్యాలయం నుంచి వచ్చిన అధికారిక వివరణలోని సారాంశం. అన్నం ఉడికిందో, లేదో తెలుసుకునేందుకు ఒక మెతుకు పట్టుకుంటే చాలు.. అన్నట్టుగా సుంకిశాల ఘటనకు కారణం కూడా అంతే. కాళేళ్వరాలు.. పాపాలు.. అని ఊదరగొట్టడం అప్పటికప్పుడు కొంత పనికొస్తుందేమో కానీ, నికార్సయిన కారణాన్ని తేల్చాలంటే సాంకేతికంగా ఏం జరిగిందో చూడాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. అది ప్రభుత్వ కనీస బాధ్యత. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు ఆ బాధ్యతను మరిచారు. కానీ నిజం నిప్పులాంటిది. దాస్తే దాగదు కదా. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించి, నిరాధార ఆరోపణలు చేసిన కొద్ది గంటల్లోనే జలమండలి అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో జలమండలి నిజం.. భట్టి అబద్ధం.. అని తేలిపోయింది.
గత నెల 29-31 తేదీల్లో సొరంగ గేట్లు అమర్చామని జలమండలి అధికారులు తెలిపారు. ఆ తర్వాత సాగర్‌కు మూడున్నర లక్షల క్యూసెక్కుల వరద రావడంతో ప్రమాదం జరిగినట్టు వివరణలో పేర్కొన్నారు. కానీ వాస్తవంగా జూలై 27 నుంచే వరద 50 వేల క్యూసెక్కులకు మించి రావడం మొదలైంది. అదే సమయంలో శ్రీశైలం జలాశయానికి 4.12 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. అంటే దిగువకు వరద పెరుగుతున్నదని ఎవరైనా సులువుగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు గేట్ల బిగింపు చివరి రోజు 31వ తేదీన నాగార్జునసాగర్‌కు 2.18 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. గేట్ల బిగింపు తర్వాతనే సొరంగం ఓపెన్ చేస్తారు. అంటే సొరంగం ఓపెన్ చేసే సమయానికి రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద కండ్ల ముందే ఉంది. కానీ అనూహ్యంగా మూడున్నర లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని జలమండలి వివరణలో పేర్కొనడం అవాస్తవం. తాము ఊహించని విధంగా వరద ఒక్కసారిగా వచ్చి పడినందునే ఘటన జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వరద 50వేలు… లక్ష.. రెండు లక్షలు.. ఆపై మూడు లక్షల క్యూసెక్కులకు పెరిగింది.
ఘటన జరిగిన తర్వాత జలమండలి అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. పంపుహౌజ్‌లోకి సీపేజ్ వాటర్ వచ్చినందున నిండిపోయిందని, అందుకే పనులు నిలిపివేసినట్టు అందరికీ చెప్తూ వచ్చారు. వాస్తవానికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి కూడా పూర్తి వివరాలు తెలియవని విశ్వసనీయంగా తెలిసింది. అంటే అసలు సుంకిశాల పథకం పనులను ఉన్నతస్థాయిలో ఏఒక్కరూ పర్యవేక్షించడంలేదని దీని ద్వారా అర్థమవుతుంది. మరోవైపు రిటెయినింగ్ వాల్ కూలిపోతున్న వీడియో దృశ్యాలు ఏజెన్సీ, అధికారులు ఎవరి దగ్గరా లేవు. అసలు వీడియో తీసినట్టుగా కూడా వారికి తెలియదు. అందుకే గోప్యత ఫలించిందని నిశ్చింతగా ఉన్నారు. కానీ ‘నమస్తే తెలంగాణ’ వీడియోను బయటి ప్రపంచానికి చూపిన తర్వాతనే అటు ఏజెన్సీ, ఇటు అధికారులకు అసలు తత్వం బోధపడింది. అందుకే గురువారం ఉదయం సుంకిశాల వద్ద లోతైన విచారణ కొనసాగింది. ఘటన జరిగిపుడు విధుల్లో ఎవరు ఉన్నారు? వీడియో ఎవరు తీశారు? ‘నమస్తే తెలంగాణ’ నుంచి ఎవరు వచ్చారు? ఎవరితో మాట్లాడారు? ఇలా అన్ని కోణాల్లోనూ విచారణ జరిగింది.
ప్రతికూల సమయంలో గేట్లు అమర్చి, సొరంగం ఓపెన్ చేయమన్నది ఎవరు? అనేది తేలితేనే బాధ్యులు ఎవరనేది నిర్ధారించవచ్చు. కానీ జలమండలి వివరణలో ఏజెన్సీ ఒక అంచనాలో ఉంది. కానీ, ఆ అంచనా తప్పడంతో ఈ ఘటన జరిగిందంటూ నెపాన్ని ఏజెన్సీపై వేసి ఎపిసోడ్‌ను ముగించాలనే ప్రయత్నం చేసింది. నిజంగా చూస్తే, సుంకిశాల పథకం పనులు ఓపెన్ టెండర్ల విధానంలో అప్పగించినవే.
కానీ ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో అప్పగించినవి కావు. అలాంటప్పుడు ఏజెన్సీనే ఒక అంచనాకు వచ్చి గేట్లు బిగించి, తనకు తానుగా సొరంగాన్ని ఓపెన్ చేస్తుంటే జలమండలి ఇంజినీర్లు ఏం చేస్తున్నారు? నిత్యం పనులను పర్యవేక్షించాల్సింది ఇంజినీర్లే కదా. పైగా గేట్ల బిగింపు, సొరంగం ఓపెన్ చేయడమనేవి అత్యంత కీలకమైన ఘట్టాలు. ఆ సమయంలో జలమండలి ఇంజినీర్లు ఎక్కడ ఉన్నారు? వారి విచక్షణ ఎక్కడికి పోయింది? నిజానికి ఇవి కదా విచారణలో తేలాల్సినవి.
సుంకిశాల ఘటనను వెలుగులోకి తీసుకువచ్చిన ‘నమస్తే తెలంగాణ’.. ప్రతికూల సమయంలో సొరంగాన్ని తెరవడమే ప్రమాదానికి కారణమన్న నిపుణుల అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. ముఖ్యంగా పంపుహౌజ్ స్లాబ్ నుంచి గేటుకు టై బీమ్స్ బిగించిన తర్వాతనే సొరంగాన్ని ఓపెన్ చేయాలనే సాంకేతిక మర్మాన్ని కూడా పేర్కొన్నది. అది చేయకపోవడంతో పాటు నాగార్జునసాగర్‌కు భారీ వరద వస్తున్న సమయంలో సొరంగాన్ని ఓపెన్ చేయడం వల్లనే ప్రమాదం జరిగిందని రాసింది. అదే అక్షరాలా నిజమని జలమండలి ప్రకటన తేటతెల్లం చేసింది. కృష్ణా వరదపై ఇంజినీర్లు అంచనా తప్పడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పింది. జలమండలి వివరణలోనూ ఆగస్టులో వరదలు వస్తాయనుకుంటే ముందుగా వచ్చాయని, అందుకే ఇలా జరిగిందని పేర్కొన్నది. కాకపోతే జలమండలి ఇంజినీర్లపై ఎలాంటి నెపం లేకుండా ఏజెన్సీపై నెపాన్ని నెట్టారు. కానీ ‘నమస్తే తెలంగాణ’ విచారణలో మాత్రం ఏజెన్సీ ఇంజినీర్లు వారించినా జలమండలి ఇంజినీర్లు సొరంగాన్ని ఓపెన్ చేయించారనే తేలింది. కారణం ఎవరైనా వారి అంచనాలు తప్పయినందునే దుర్ఘఘటన జరిగిందనేది సుస్పష్టం. నాసిరకం నిర్మాణమో, డిజైన్ లోపమో కారణం కాదన్నది విస్పష్టం. మరోవైపు ఈ ఘటన వల్ల మార్చి నెలలో పూర్తి చేయాలనుకున్న పథకం రెండు నెలలు ఆలస్యం అవుతుందని వివరణలో పేర్కొన్నారు. కానీ నిపుణుల అంచనా మేరకు కనీసంగా ఏడాది కాలయాపన జరిగే అవకాశమున్నది.