హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): దక్షిణ డిస్కంలో అవినీతి జోరుగా జరుగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి పలు ఘటనలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని ప్రధాన కార్యాలయంలో ఓ అవినీతి ‘సూరీడు చక్రం’ తిప్పుతున్నట్టు తెలుస్తున్నది. ఏ ఫైల్ కదలాలి, ఏ ఫైల్ మీద సంబంధిత అధికారులు సంతకం చేయాలో నిర్ణయిస్తూ.. తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్న ఓ మధ్యవర్తి గురించి జోరుగా చర్చ జరుగుతున్నది. అతడు కాంట్రాక్టర్స్ యూనియన్ జేఏసీలోని ఓ నాయకుడు అని, అతడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఆయన మాటతోనే కొందరు అధికారులు పనిచేస్తారని, కాంట్రాక్టర్ల ఫైల్ క్లియర్ చేయించాలంటే ఆయనకు చిటికెలో పని అని మింట్ కాంపౌండ్‌లో ఉద్యోగులు, అధికారులు, కాంట్రాక్టర్లలో జోరుగా చర్చ జరుగుతున్నది.
ఎస్పీడీసీఎల్లో అధికారులు ఇటీవల తీసుకున్న పలు నిర్ణయాల వెనుక కూడా సదరు జేఏసీ నాయకుడు ఉన్నట్టు తెలిసింది. సదరు అవినీతి సూరీడు సంగతి ఆ నోటా, ఈ నోటా అందరికీ తెలియడంతో… అంతా ఫైల్స్ పట్టుకుని ఆయన చుట్టూ తిరుగుతున్నారట. బిల్లులు మంజూరు చేయించాలంటూ తన దగ్గరకు వచ్చి కాంట్రాక్టర్లతో జేఏసీ నేత ‘అన్ని విషయాలు’ లోతుగా చర్చించి.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారట. మధ్యవర్తి తీసుకొచ్చిన ఫైల్స్ మాత్రమే క్లియర్ చేస్తున్న ముఖ్య అధికారులకు ముడుపులు ముడుతున్నట్టు సమాచారం. మొత్తం వ్యవహారంలో కీలక అధికారుల్లో ఒకరు ‘చక్ర’ం తిప్పుతున్నారని డిస్కం ఆఫీస్ మొత్తం కోడై కూస్తున్నది.
కాంట్రాక్టర్ల మధ్యవర్తితో ముచ్చట్లేంది!
కాంట్రాక్టర్లకు బిల్లుల మంజూరుకు సంబంధించి ఏయే ఫైల్స్ వచ్చాయి? ఏయే ఫైల్స్‌కు ‘ఫార్మాలిటీస్’ పూర్తయ్యాయో తెలుసుకునేందుకు ‘చక్ర’ం తిప్పుతున్న అధికారి జేఏసీ నేతతో గంటల తరబడి చర్చోపచర్చలు సాగించడం బహిరంగ రహస్యమే. తన చాంబర్లో పని చేసుకుంటూ ఉండాల్సిన కీలక అధికారి.. జేఏసీ నాయకుడి దగ్గర గంటల తరబడి ఏం ముచ్చట్లు పెడుతున్నారంటూ డిస్కమ్ ఆఫీసులో ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా కాంట్రాక్టర్లను కలవడానికి ఎప్పుడో నెలలో ఒకసారి మాత్రమే అవకాశమిచ్చే ‘ముఖ్యమైన అధికారి’ ఒకరు.. కాంట్రాక్టర్ల మధ్యవర్తితో మాత్రం ఒక్క నెలలోనే 20 సార్లు కూడా సమావేశమవుతున్నట్టు సమాచారం. పెద్దపెద్ద సార్లతో పనులు చక్కబెట్టుకోవాలని, బిల్లులు మంజూరు చేయించుకోవాలని భావిస్తున్న కాంట్రాక్టర్లు.. అవినీతి సూరీడిని కలుస్తున్నట్టు తెలిసింది.
నిర్ణయాల్లోనూ కాంట్రాక్టర్ జోక్యమా!
ఇటీవల డిస్కంలో విడుదల చేసిన కొత్త నిబంధనల నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్లు.. ఇలా ఒక్కో విభాగంలో ఒక్కో తరహాలో లోడ్‌ను ఫిక్స్ చేయడంతోపాటు ఎల్సీలు ఇచ్చే దగ్గర కూడా క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ సమయం లో కాంట్రాక్టర్లు ఏం చేయాలో తోచక ఐదారుసార్లు సీఎండీని, కమర్షియల్ సీఈని కలిశారు. నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటామని వారు చెప్పారని తెలుస్తున్నది. దీంతో వారంతా జాప్యం జరుగుతున్నదని ఆందోళన చెందినట్టు సమాచారం.
కానీ కొన్ని ఫైల్స్ మాత్రం ఎప్పటికప్పుడు కదులుతున్నాయని కాంట్రాక్టర్లు గమనించారని, మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతున్నదా అని ఆరా తీయగా.. అవినీతి జేఏసీ నాయకుడి యవ్వారం బయటపడిందని తెలిసింది. ఎస్పీడీసీఎల్లో కఠినమైన నిబంధనలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరున్న అధికారి.. తన సొంత సామాజికవర్గం కాంట్రాక్టర్‌ను తెరచాటు తతంగాలకు మధ్యవర్తిగా పెట్టుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైల్స్ క్లియర్ చేయించడం, ఎన్వోసీలు, ఎల్సీలు ఇప్పించడంలోనే సదరు జేఏసీ నేత ‘బిజీబిజీగా’ ఉన్నారని సిబ్బంది చర్చించుకుంటున్నారు.