మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 19:47:21

కార్మికుల భద్రతలో రాజీపడబోం : సింగరేణి సీఎండీ

కార్మికుల భద్రతలో రాజీపడబోం : సింగరేణి సీఎండీ

హైదరాబాద్ : కార్మికుల భద్రత విషయంలో ఖర్చుకు రాజీపడబోమని సింగరేణి సీఎండీ. ఎన్‌.శ్రీధర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో మంగళవారం జరిగిన 46వ రక్షణ త్రైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి పరిధిలోని పలు గనుల్లో టెక్నికల్‌ స్టాఫ్‌, సూపర్‌వైజర్లు, మెడికల్‌ సిబ్బంది, వైద్యుల పోస్టులు వెంటనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. గత ఐదేండ్లలో ప్రత్యక్ష‌, కారుణ్య, అంతర్గత నియామకాల ద్వారా 16 వేలకుపైగా ఖాళీపోస్టులను భర్తీ చేశామని, మరో 6నెలల్లో మిగిలిన అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. కొత్తగా ఉద్యోగుల్లో చేరినవారిలో ఉన్నత విద్యార్హతలున్న వారు ఉన్నారని, కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లో అంతర్గత కోటా పెంచి అర్హులకు మంచి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  కార్మికుల భద్రత పెంపునకు కార్మిక సంఘాలు డీజీఎంఎస్‌ అధికారుల సూచనలు. సలహాలు తూ.చా. తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు.  

డైరెక్టర్లు, సీనియర్‌ అధికారులతో సమావేశమై ఇందుకుకార్యాచరణ రూపొందిస్తామని  పేర్కొన్నారు. భారీ వాహనాల అపరేటర్లకు శిక్షణలో భాగంగా రెండు సిమ్యులేటర్సును, ఇతర శిక్షణ సామగ్రిని సమకూర్చుకున్నామని తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో సుమారు 60 వేల రాపిడ్‌ టెస్టు కిట్లతో పరీక్షలు జరిపామని వెల్లడించారు. పకడ్బందీగా నివారణ చర్యలు అమలు చేయడంతో కార్మికులు ఇబ్బంది పడలేదని చెప్పారు. కొవిడ్‌ నివారణ చర్యలను పర్యవేక్షించిన సంస్థ డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌, శ్రీ ఎన్‌.బలరామ్‌ను వైద్యశాఖ కృషిని ప్రశంసించారు. భవిష్యత్‌లో ప్రైవేటు బొగ్గు సంస్థలు, విదేశీ బొగ్గు సంస్థలతో గట్టిపోటీ ఉండబోతోందని తెలిపారు. ఉత్పత్తి వ్యయం తగ్గిస్తూ నైపుణ్యాలను పెంచుకుంటూ.. సమష్టి కృషితో సంస్థను వృద్దికి కృషిచేయాలన్నారు.  సింగరేణి కాలరీస్‌ యాజమాన్య ప్రతినిధులు, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, అధికారుల సంఘం ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.