e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home Top Slides Dalitha Bandhu : వాసాలమర్రిలో దళితుల దరహాసం

Dalitha Bandhu : వాసాలమర్రిలో దళితుల దరహాసం

  • వాసాలమర్రిలో దళిత బంధుకు మోగిన డప్పు
  • రూ. 7.60 కోట్ల నిధుల విడుదల
  • గ్రామంలో అంబరమంటిన సంబురాలు
  • సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం
  • రంగులు చల్లుకొని గ్రామస్తుల నృత్యాలు
  • ముఖ్యమంత్రి ఫొటోలతో ఊరేగింపు

మోడువారిన జీవితాలు కొత్త చిగుర్లు తొడుగుతున్నాయి. కనాకష్టంచేసి అరిగిన రెక్కలు నూతన జవసత్వాలు సంతరించుకొంటున్నాయి. పుట్టి బుద్ధెరిగిన తర్వాత తొలిసారి జీవితాల్లో వెలుగు నిండిన సంతోషంతో కష్టజీవులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవచించిన ‘దళిత బంధు’ అభివృద్ధి కిరణాల వెలుగులో జీవితానికి కొత్త దారులు వెదుకుతూ ఆనంద డోలికల్లో తేలుతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు గురువారం దళితబంధు నిధులు విడుదలయ్యాయి. దాంతో గ్రామంలో ఉత్సవమే జరిగింది. దళితులంతా రంగులు, గులాల్‌ చల్లుకొని డ్యాన్సులు చేశారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. డప్పు వాయిద్యాలు, బతుకమ్మ ఆటలతో సీఎం చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగారు.

- Advertisement -

హైదరాబాద్‌, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ)/యాదాద్రి భువనగిరి: రాష్ట్రంలోని దళితుల జీవితాలను సమూలంగా మార్చివేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన దళితబంధు పథకం గురువారం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం రూ.7.60 కోట్లు విడుదలచేసింది. దీంతో రాష్ర్టవ్యాప్తంగా పథకం అమలుల్లోకి వచ్చింది. నిధులను యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్‌ ఖాతాలో జమచేస్తూ ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా ఉత్తర్వులు జారీచేశారు. నిధుల జమకోసం జిల్లా కలెక్టర్‌ పేరు మీద ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచారు. జిల్లాలో జరిగే దళితబంధు లావాదేవీలన్నీ ఈ ఖాతా నుంచే నడిచేలా ఏర్పాట్లుచేశారు. గురువారం విడుదలైన నిధులు జిల్లా కలెక్టర్‌ చైర్‌పర్సన్‌గా ఉండే పద్దు కింద జమ అయ్యాయి. ఈ పథకాన్ని ముందుగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించగా, బుధవారం వాసాలమర్రిలో పర్యటన సందర్భంగా అక్కడినుంచే ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఈ నెల 16న కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో దళిత కుటుంబాలు, దళిత ప్రజాప్రతినిధులు, దళిత మేధావులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగసభ నిర్వహించి పైలట్‌ ప్రాజెక్టును చేపడతారని అధికారులు తెలిపారు.

పటిష్ఠంగా పథకం వ్యవస్థీకృతం

దళితబంధు పథకాన్ని విజయవంతంగా అమలుచేసేందుకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిదాకా నాలుగంచెల వ్యవస్థకు రూపకల్పనచేశారు. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కమిటీలు ఉంటాయి. సాంకేతిక సహకారం అందించేందుకు ప్రత్యేక విభాగం ఉంటుంది. లబ్ధిదారులు ఎంపికచేసుకొనే యూనిట్‌ ఆధారంగా వివిధశాఖల అధికారులతో ఈ సాంకేతిక సహకార కమిటీలు ఏర్పాటవుతాయి. ఇందుకోసం ఎస్సీ సంక్షేమం, పరిశ్రమలు, వ్యవసాయం, పశుసంవర్ధకం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖలు పరస్పరం సమన్వయంతోపనిచేస్తాయి.

లబ్ధిదారులకు ప్రత్యేక కార్డు

దళితబంధు పథకం లబ్ధిదారులకు చిప్‌తో కూడిన ప్రత్యేక కార్డును ప్రభుత్వం జారీ చేయనున్నది. ఈ కార్డుపై లబ్ధిదారు ఫొటోతో ఐడీ నంబర్‌ ఉంటాయి. క్యూఆర్‌ కోడ్‌తో జారీచేసే ఈ కార్డులో లబ్ధిదారుడి ఆధార్‌ కార్డు నంబర్‌, ఆహారభద్రతా కార్డు నంబర్‌, బ్యాంకు ఖాతా, చేస్తున్న వ్యాపారం.. గ్రౌండింగ్‌ చేసిన తేదీ ఉంటాయి. స్కీమ్‌ పురోగతి, అధికారులు ఇచ్చే సూచనలు తదితర వివరాలన్నీ ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ అయ్యేలా ఈ కార్డును రూపొందిస్తున్నారు. వాసాలమర్రిలో లబ్ధిదారులు నాలుగైదు రోజుల్లో సమావేశమై ఎంపిక చేసుకొనే వ్యాపార నమూనాను అనుసరించి ఈ కార్డులు జారీచేస్తారు.

అభినవ అంబేద్కర్‌ కేసీఆర్‌

దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్‌ అభినవ అంబేద్కర్‌. దళిత బంధు పథకాన్ని అమలులోకి తెచ్చినందుకు ధన్యవాదాలు. దళితుల భద్రత, సంక్షేమం, ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు అంకితభావంతో ముందుకు సాగుతున్న కేసీఆర్‌కు దళితజాతి జీవితాంతం మద్దతుగా ఉంటుంది.

కొప్పుల ఈశ్వర్‌, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ మంత్రి

గతంలో ఎవ్వరూ చేయని విధంగా సీఎం కేసీఆర్‌ సారు మా ఇంటికి వచ్చిండు. ఆత్మీయంగా పలకరించడమేకాక ఆర్థిక పరిస్థితులను ఓపికగా అడిగి తెలుసుకొన్నరు. గతంలో ఏ ముఖ్యమంత్రి దళిత కుటుంబాలను పలకరించిన పాపాన పోలేదు. సారు మంజూరు చేసిన రూ.10 లక్షలను సద్వినియోగం చేసుకొంటా.

సబిత

మా బతుకులు మార్చుతున్న దేవుడు సీఎం కేసీఆర్‌

అందరిలాగే ఎదగాలనే పట్టుదల ఉన్నా ఆర్థిక స్థోమత లేక ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. మా బతుకులను మార్చేందుకు సీఎం కేసీఆర్‌ సార్‌ దేవుడిలాగా మా ఊరికి వచ్చి దళితబంధు కింద కుటుంబానికి రూ.10 లక్షల చొప్పు మంజూరుచేశారు. సార్‌ ఇచ్చిన డబ్బులు వృథా చేయకుండా ఆటో కొనుక్కొనిఆర్థికంగా అభివృద్ధి చెందుతా.
– దుబ్బాసి శ్రీను

సీఎం సారుకు దళితులు రుణపడి ఉంటారు

గ్రామంలోని దళిత కుటుంబాలు మొత్తం సీఎం కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటాయి. దేశ చరిత్రలో దళితులను ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్‌ దళితులపై ఉన్న ప్రేమతో వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు పథకం ప్రవేశపెట్టి గ్రామంలోని ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున మంజూరుచేసి వారి అభివృద్ధికి బాటలు వేశారు.
-పోగుల ఆంజనేయులు, వాసాలమర్రి సర్పంచ్‌

మా గ్రామంలోనే దళితబంధు ప్రారంభించటం హర్షణీయం

సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం ప్రవేశపెట్టి దళిత కుటుంబాలకు మొదటిసారి నిధులను మా గ్రామస్తులకే ఇవ్వటం హర్షణీయం. ఏన్నో ఏండ్లుగా ఆర్థికంగా వెనుకబడి నైపుణ్యం ఉండి కూడా ఎన్నో కుటుంబాలు వెలుగులోకి రాలేదు. దళితబంధుతో ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్‌సారు బాటలు వేశారు.
-పలుగుల నవీన్‌కుమార్‌, వాసాలమర్రి ఎంపీటీసీ

సంపూర్ణ అభ్యున్నతికి బాటలు

దళిత బంధు దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అంబేద్కర్‌ స్ఫూర్తితో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్‌ రూపొందించారు. పథకాన్ని అమలుచేసిన సీఎం కేసీఆర్‌కు దళిత సమాజం తరఫున ధన్యవాదాలు. రాష్ట్రంలోని దళితుల సంపూర్ణ అభ్యున్నతికి బాటలు వేసిన ఆధునిక అంబేద్కర్‌ సీఎం కేసీఆర్‌. స్వతంత్య్ర భారతదేశంలో ఇప్పటివరకు దళితుల అభివృద్ధికి ఇంత పెద్దఎత్తున కార్యక్రమాలను రూపొందించి అమలు చేసిన చరిత్ర లేదు. సీఎం కేసీఆర్‌ను దళిత జాతి గుండెల్లో పెట్టుకుంటుంది.
– రసమయి బాలకిషన్‌, మానకొండూరు ఎమ్మెల్యే

దళితుల గుండెల్లో చిరస్థాయిగా కేసీఆర్‌

అంబేదర్‌ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ తెలంగాణ సాధించారు. అదే స్ఫూర్తితో దళిత బంధు తెచ్చారు. గతంలో దళితులకు పథకాలు కాగితాలపైనే ఉండేవి. కానీ దళితుల జీవితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఉద్యమ నేత సీఎం కేసీఆర్‌.. దళితుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా దళిత బంధును రూపొందించారు. నవ సమాజ స్థాపనకు నడుంబిగించారు. బంగారు తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం. ఇప్పుడు విమర్శిస్తున్నవారే రేపు జై కొడతారు.
– గాదరి కిశోర్‌, తుంగతుర్తి ఎమ్మెల్యే

ఈ పథకం.. పట్టుదలకు నిదర్శనం

కేసీఆర్‌ పట్టుదలతో కాళేశ్వరాన్ని పూర్తిచేసినట్టే దళిత బంధును జయప్రదం చేస్తారు. ఎన్ని పార్టీలు పాలించినా దళితుల పరిస్థితి ఎకడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నది. అంబేదర్‌ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని రూపొందించారు. దీంతో రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు వస్తాయి. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఎన్నికల కోసం కాదు.. ప్రజల బాగుకే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకం ఉందా? అంబేదర్‌ను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ది.
– సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే

ఆత్మగౌరవాన్ని మరింత పెంచేలా..

దళితుల భద్రత, సంక్షేమం, ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించేందుకు అంకితభావంతో ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌కు దళితజాతి అన్ని వేళలా మద్దతుగా నిలుస్తుంది. దళితుల జీవితాల్లో మార్పులు తేవడానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట తెలంగాణలోని దళిత జాతి ఉంటుంది.
– సుంకె రవికుమార్‌, చొప్పదండి ఎమ్మెల్యే

దళిత బంధుతో కొత్త వెలుగులు

దళిత బంధును ప్రారంభించి సీఎం కేసీఆర్‌ దళితజాతిలో కొత్త వెలుగులు నింపుతున్నారు. వాసాలమర్రికి చెందిన 76 దళిత కుటుంబాలకు దళిత బంధును అమలు చేస్తూ, అందుకు రూ.7.60 కోట్లు మంజూరు చేయడం హర్షణీయం. దళిత బంధు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందనడానికి వాసాలమర్రి గ్రామమే నిదర్శనం. ఆసరా పెన్షన్‌తో సీఎం కేసీఆర్‌ ఆపద్భాందవుడయ్యారు. రైతు బంధుతో రైతన్నల గుండెల్లో గూడు కట్టుకున్నారు. దళిత బంధుతో దళితజాతిలో వెలుగులు నింపుతూ దళిత ఆత్మబంధువయ్యారు.
– ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana