PM Modi | ఈ ఏడాది దేశంలో గోధుమ పంట పుష్కలంగా వచ్చిందట.. కానీ కేంద్రం సేకరించటానికే దొరకటం లేదు. బియ్యం నిల్వలు లెక్కలేనన్ని ఉన్నాయట.. కానీ, బియ్యం ఎగుమతిని నిలిపివేసింది. ఈ రెండు ఆహార ధాన్యాలకు దేశంలో కొదవే లేదని కేంద్రం చెప్తున్నది. కానీ.. వినియోగదారుల ధరల సూచీలో ఫిబ్రవరిలో గోధుమల ద్రవ్యోల్బణం 25.4 శాతం, బియ్యం ద్రవ్యోల్బణం 12.5 శాతం నమోదయ్యాయి. అంటే దేశంలో బియ్యం, గోధుమల ధరలు సామాన్యుడు కొనలేని స్థాయిలో పెరిగాయని అర్థం. మరి కేంద్రం చెప్తున్నట్టు పంట దిగుబడి రికార్డు స్థాయిలో వస్తే.. అదంతా ఎక్కడికి వెళ్లింది? ధరలు పెరగకుండా ఎగుమతులను నిషేధించామని చెప్పింది. అయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? బియ్యం ఎగుమతులను భారత్ నిలిపేయటంతో ఆఫ్రికా దేశాల్లో సంక్షోభం తలెత్తిందని, ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి వచ్చిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన చెందుతున్నది. ఇదీ మన విశ్వగురువు ప్రధానమంత్రి పాలన తరీక.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: భారతీయులందరికీ ప్రధాన ఆహారమైన బియ్యం, గోధుమల విషయంలో కేంద్ర ప్రభుత్వం పిల్లిగంతులు వేస్తున్నది. మోదీ సర్కారు చెప్తున్న లెక్కలకూ వాస్తవ పరిస్థితులకు ఏ కోశానా పొంతన కుదరటం లేదు. ప్రభుత్వం వద్ద నాలుగేండ్లపాటు దేశ అవసరాలకు సరిపడినన్ని బియ్యం నిల్వలు ఉన్నాయని కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏడాది క్రితం ప్రకటించారు. తమ వద్ద ఉన్న బియ్యం సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన సమయంలో ‘తెలంగాణ ప్రజలకు నూకలు తినటం నేర్పండి’ అంటూ ఆయన స్వయంగా సెలవిచ్చిన మాటే అది. మరి ఆ నిల్వలన్నీ ఏమయ్యాయో ఏమోగానీ.. రెండు నెలల క్రితం ఉన్నటుండి బియ్యం ఎగుమతులను కేంద్రం నిషేధించింది. అదేంటని అడిగితే.. దేశీయంగా కొరత ఏర్పడకుండా అని చెప్పింది. నాలుగేండ్లకు సరిపడా నిల్వలుంటే కొరత ఎందుకు వస్తుంది? గోధుమల పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. ఈ ఏడాది గోధుమ పంట పుష్కలంగా వచ్చిందని కేంద్రమే ప్రకటించింది. తీరా ఎఫ్‌సీఐ సేకరిద్దామంటే గోధుమలు దొరకటం లేదు. అంతేకాదు.. గోధుమల ఎగుమతులను ఏడాది క్రితమే కేంద్రం నిషేధించింది. పుష్కలంగా పంట పండితే మరి ఆ గోధుమలన్నీ ఎక్కడికి పోయాయి.
పంట పుష్కలం.. ఎగుమతులు నిషేధం
గత ఏడాది దేశంలో గోధుమ పంట రికార్డు స్థాయిలో వచ్చిందని, ఈ ఏడాది కూడా దాదాపు అంతే స్థాయిలో ఉన్నదని ఇటీవల కేంద్రం ప్రకటించింది. అయితే, అంత పంట పండినా 2022 మే నుంచి గోధుమల ఎగుమతిపై నిషేధం విధించింది. 2022 ఆగస్టు నుంచి గోధుమ పిండి ఎగుమతులపై కూడా నిషేధం విధించింది. అది ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ ఏడాది జూన్‌లో మరో అడుగు ముందుకేసి మిల్లర్లు, ట్రేడర్లు, హోల్‌సేలర్లు, రిటైలర్లు 3000 టన్నుల కంటే ఎక్కువ నిల్వలు కలిగి ఉండరాదని ఆదేశాలు జారీచేసింది. చిన్న రిటైలర్లు, షాపులు 10 టన్నులకంటే అధికంగా గోధుమలు నిల్వచేసుకోరాదని నిషేధం విధించింది. ఒకవైపు పంట పుష్కలంగా పండి, మరోవైపు ఎగుమతులను ఆపేసిన తర్వాత ఎక్కడైనా మార్కెట్లో నిల్వలు కావాల్సినన్ని లభిస్తాయి. విచిత్రంగా మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు. గత వేసవికాలం సీజన్లో 34 మిలియన్ టన్నుల గోధుమలు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా, 26.1 మిలియన్ టన్నులే సేకరించగలిగింది. అంటే, కొనటానికి కూడా మార్కెట్లో గోధుమలు లేవన్నమాట. గత ఏడాది పరిస్థితి మరీ దారుణం. 43.3 మిలియన్ టన్నుల గోధుమలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 18.8 మిలియన్ టన్నులు మాత్రమే సేకరించగలిగింది. బియ్యం విషయంలో కూడా ఇలాగే జరుగుతున్నది. నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటూనే, ఎగుమతులపై నిషే ధం విధించింది. అయినా, దేశంలో కొరతతో కొన్ని రాష్ర్టాలు అల్లాడుతున్నాయి. తమకు వెంటనే బియ్యం కావాలని తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలు మొత్తుకొంటున్నాయి.
ధరలు పైపైకి..
పంటలు పుష్కలంగా పండి, నిల్వలు పుష్కలంగా ఉండి, ఎగుమతులను కూడా నిషేధించిన తర్వాత ధరలు కచ్చితంగా తగ్గాలి. కానీ, అందుకు విరుద్ధంగా దేశంలో గోధుమ, బియ్యం ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఆగస్టులో గోధుమల సీపీఐ ద్రవ్యోల్బణం 15.7 శాతం ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఏకంగా 25.4 శాతానికి పెరిగింది. బియ్యం ధరలు కూడా ఇలాగే పెరుగుతున్నాయి. అందునా ఎగుమతులను నిషేధించిన తర్వాత కూడా పెరుగుతూనే ఉన్నాయి. జూలైలో కేంద్రం నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన తర్వా ఆగస్టులో బియ్యం సీపీఐ ద్రవ్యోల్బణం 12.5 శాతంగా నమోదైంది. అంటే సామాన్యులు వీటిని కొనలేని పరిస్థితి వచ్చిందన్నమాట.
ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం
ఆహార పంటల దిగుబడి, నిల్వలపై అవగాహన లేని నిర్ణయాలతో కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నదని ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. బియ్యం, గోధుమల ఎగుమతులను నిషేధించినా దేశీయంగా వీటి ధరలు పెరగటానికి కేంద్ర ప్రభుత్వ చేతగానితనమే కారణమని అంటున్నారు. చట్టబద్ధంగా వీటి ఎగమతులను నిషేధించినా, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నెలనెలా చౌక ధరకు పంచేందుకు విడుదల చేస్తున్న బియ్యం, గోధుమల్లో సగం వరకు విదేశాలకు అక్రమంగా తరలిపోతున్నాయని అంటున్నారు. అందుకే దేశంలో కొరత ఏర్పడుతున్నదని ప్రముఖ ఆర్థికవేత్త అశోక్‌గులాటీ పేర్కొన్నారు. ‘పరిస్థితి ఇలాగే కొనసాగితే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటానికి రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతుంది. ఇప్పుడిప్పుడే పుంజుకొంటున్న ఆర్థికవ్యవస్థకు ఈ నిర్ణయం తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఆర్థికరంగానికి ఇది మరింత గండి కొడుతుంది’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
150 దేశాలకు భారత బియ్యం
ప్రపంచంలోని 150 దేశాలకు భారత్ బియ్యం ఎగమతి అవుతున్నాయి. గత జూలై 20 ఎగుమతులపై నిషేధం విధించగానే అమెరికాలోని సూపర్మార్కెట్లలో నిల్వలు తరిగిపోయి ప్రజలు బియ్యం కోసం ఉరుకులు పరుగులు పెట్టారు. అయితే, మన బియ్యం అత్యధికంగా ఆఫ్రియా, ఆసియా దేశాలకే ఎగుమతి అవుతున్నాయి. నాన్ బాస్మతి బియ్యం ఆఫ్రికాకు, బాస్మతి బియ్యం పశ్చిమాసియా దేశాలకు వెళ్తున్నాయి. బియ్యం ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో ఉండగా, ఎగుమతిలో ఇండియా మొదటిస్థానంలో ఉన్నది. ప్రపంచానికి ఎగుమతి అవుతున్న బియ్యంలో 40 శాతం భారత బియ్యమే ఉన్నాయి. 2022-23లో 54 మిలియన్ టన్నుల బియ్యాన్ని భారత్ ఎగుమతి చేసింది.
ముందే చేసుకొన్న ఒప్పందాల ప్రకారం ఈ ఏడాది 20.5 మిలియన్ టన్నులు ఎగుమతి చేయనున్నది. ఎగుమతుల్లో రెండోస్థానంలో ఉన్న థాయ్‌లాండ్ (8.5 మిలియన్ టన్నులు)తో పోల్చితే ఇది ఐదు రెట్లు అదనం. బియ్యం ఎగుమతుల్లో వియత్నాం మూడోస్థానంలో, పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి. గత జనవరి నుంచి జూలై వరకు 7 బిలియన్ డాలర్ల విలువైన 12.9 మిలియన్ టన్నుల బియ్యాన్ని భారత్ ఎగుమతి చేసింది. భారత్ ఎగుమతి చేస్తున్న బియ్యంలో 77 శాతం నాన్ బాస్మతి, 23 శాతం బాస్మతి బియ్యం ఉన్నాయి. భారత్ నుంచి నాన్ బాస్మతి ఎక్కువగా దిగుమతి చేసుకొంటున్నవాటిలో ఆఫ్రికా దేశమైన బెనిన్ మొదటిస్థానంలో ఉన్నది. ఈ ఏడాది ఈ దేశం 17 లక్షల టన్నుల బియ్యం దిగుమతి చేసుకొన్నది. తర్వాతి స్థానంలో ఉన్న సెనెగల్ 8,72,080 టన్నులు, మూడో స్థానంలో ఉన్న కెన్యా 6,85,302 టన్నులు దిగుమతి చేసుకొన్నాయి. బాస్మతి బియ్యాన్ని సౌదీ అరేబియా 6,39,150 టన్నులు, ఇరాన్ 5,45,751 టన్నులు, ఇరాక్ 3,83,687 టన్నులు దిగుమతి చేసుకొన్నాయి.
భారత్ నిషేధంతో ప్రపంచంలో సంక్షోభం
భారత్ ఉన్నట్టుండి బియ్యం ఎగుమతులను నిషేధించటంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తుతున్నదని ఐక్యరాజ్యసమతి అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ అల్వరో లారియో అన్నారు. భారత బియ్యంపైనే ఆధారపడిన ఆఫ్రికా దేశాల్లో ఒక్కసారిగా ధరలు పెరగటంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయని, ఇది రాజకీయ సంక్షోభాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఆహార భద్రత విషయంలో గోధుమలకంటే బియ్యమే ప్రధానమైనది. భారత్ బియ్యం ఎగుమతులను నిషేధించటంతో ఉన్నట్టుండి ధరలు పెరిగి పేద దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా తక్కువ ధర బియ్యాన్ని వాడే ఆఫ్రికా దేశాల్లో అధిక ధరల వల్ల ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా ఆందోళనకరం’ అని తెలిపారు.