జోగులాంబ గద్వాల : జిల్లాలోని అల్లంపూర్ తాలూకా ఎర్రవల్లి మండలం ధర్మవరం ప్రభుత్వ బీసీ హాస్టల్లో విద్యార్థుల అస్వస్థత ( Students illness) పై కలెక్టర్ బి.ఎం.సంతోష్ ( Collector Santosh ) సీరియస్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, వంటశాల సిబ్బందిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జయరాములు విధుల నుంచి సస్పెండ్ (Suspension) చేశారు. ఘటనపై సమగ్ర పరిశీలన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు.
సస్పెన్షన్ కాలంలో జయరాములు జోగులాంబ గద్వాలలోనే ఉండాలని ఆదేశించారు. ముందస్తు లిఖిత అనుమతి పొందకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లకూడదని స్పష్టం చేశారు. ధర్మవరం ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహానికి తాత్కాలిక వెల్ఫేర్ ఇన్చార్జి ఆఫీసర్‌గా ఆలంపూర్ ఆఫీసర్ డి. శేఖర్‌ను నియమించినట్లు తెలిపారు.
సంబంధిత మండలాల ప్రత్యేక అధికారులు మండల పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, తహసీల్ పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాలు, ఎంపీడీవో పరిధిలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం పాఠశాలలు, పురపాలక పరిధిలోని పాఠశాలలను మున్సిపల్ కమిషనర్ ప్రతి వారం ఒకసారి సందర్శించాలని ఆదేశించారు. విద్యార్థుల భోజన నాణ్యత, విద్యా భద్రత, మౌలిక వసతులు , త్రాగునీరు, మరుగుదొడ్లు, శుభ్రత తదితర అంశాలను సమీక్షించి, తగిన నివేదికను సమర్పించాలన్నారు.
వంటశాలలో భోజనం సిద్ధం చేసే సిబ్బంది, నిర్ణయించిన మెనూను ఖచ్చితంగా పాటించి,విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన, పోషకాహార విలువలతో కూడిన భోజనాన్ని అందించాలని సూచించారు. ఎర్రవల్లి ఎస్సీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అల్పాహారం చేసిన అనంతరం స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, వారిని వెంటనే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తగిన వైద్య చికిత్స అందించామని వెల్లడించారు. అదనపు కలెక్టర్ నర్సింగ రావు సంఘటనా స్థలాన్ని సందర్శించి అల్పాహారం తనిఖీ చేశారని తెలిపారు.