Viral News | జీలకర్ర బెల్లం పెట్టిన కొద్ది క్షణాలకే పెళ్లి మండపంలో ఊహించని మలుపు తిరిగింది. పెళ్లి పీటలపై కూర్చున్న వధువు ఒక్కసారిగా లేచి, మండపానికి వచ్చిన ఓ యువకుడిని చూసి ఆనందంతో వచ్చావా అంటూ అతని వద్దకు వెళ్లి నిల్చుంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఆ యువకుడినే తాను ప్రేమిస్తున్నానని, అతనితోనే వెళ్లిపోతానని చెప్పి పెళ్లి కూతురు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా సన్నివేశాన్ని తలపించే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ఓ యువతి, యువకుడికి పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు. శుక్రవారం రాత్రి వరుడి స్వగ్రామంలోనే వివాహానికి భారీ ఏర్పాట్లు చేశారు. పెళ్లి వేడుక కోలాహలంగా జరుగుతున్నది. ముహూర్త సమయం కావడంతో పురోహితులు వధూవరులకు జీలకర్ర బెల్లం కూడా పెట్టించారు. అప్పటిదాకా పెళ్లిపీటల మీద సెలైంట్‌గా కూర్చున్న వధువు సడెన్‌గా పెళ్లి మండపం వద్దకు వచ్చిన ఓ యువకుడిని చూడగానే లేచి వెళ్లిపోయింది. ఇప్పటికైనా వచ్చావా అంటూ ఒక్క ఉదుటున పెళ్లి పీటల మీద నుంచి ఆ యువకుడి పక్కకు వెళ్లింది. ఈ హఠాత్పరిణామంతో మండపం దగ్గర ఉన్నవారంతా షాకయ్యారు.
కొద్దిసేపటికి తేరుకున్న తర్వాత.. ఏం చేస్తున్నావని పెళ్లికూతుర్ని నిలదీశారు. అప్పుడు ఆమె అసలు విషయం బయటపెట్టింది. ఈ అబ్బాయి మా ఊరివాడే.. మేమిద్దం చాలాకాలంగా ప్రేమించుకుంటున్నాం. నాకు ప్రియుడే కావాలని అందరి ముందే చెప్పింది. దీంతో వరుడి కుటుంబసభ్యులు నివ్వెరపోయారు. పెళ్లి ఆగిపోవడంతో కోపంలో పలువురు బంధువులు యువకుడిపై దాడికి దిగారు. పెళ్లి మండపంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కల్యాణ మండపానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.