ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:34

సఫాయి కరమ్‌చారీస్‌ కమిషన్‌ ఏర్పాటు

సఫాయి కరమ్‌చారీస్‌ కమిషన్‌ ఏర్పాటు

  • మన పీవీ.. ఘనత ఇదీ!

అట్టడుగు వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా పీవీ నరసింహారావు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. ఇందులో గణనీయమైనది సఫాయి కరంచారీ జాతీ య కమిషన్‌ (ఎన్‌సీఎస్‌కే) ఏర్పాటు. పీవీ ప్రభుత్వం 1993లో సఫాయి కరంచారీస్‌ యాక్ట్‌ను తెచ్చింది. ఈ చట్టం మేరకు 1994 ఆగస్ట్‌ 14వ తేదీన నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ సఫాయి కరంచారీస్‌ను చట్టబద్ధ సంస్థగా నెలకొల్పింది. ఈ కమిషన్‌ కాల పరిమితి 2004 నాటికి ముగిసిపోయింది. దీంతో పొడిగిస్తూ పోతున్నారు. ప్రస్తుత కమిషన్‌ కాలపరిమితి 2022తో ముగుస్తుంది. ఈలోగా సఫాయి కార్మికులకు ఆ విధుల నుంచి విముక్తి కలిగించి పునరావాసం కల్పించవలసి ఉన్నది. 

సఫాయి కరంచారీస్‌ సంక్షేమం కోసం ప్రభుత్వానికి సూచనలు చేయడం ఈ కమిషన్‌ విధి. సఫాయి కార్మికులకు సంబంధించిన పథకాల అధ్యయనం, పర్యవేక్షణ ఈ సంస్థ మరో ప్రధాన విధి. సఫాయి కార్మికుల హోదా పెంపుదలకు, అవకాశాల కల్పనకు నిర్దిష్ట కార్యక్రమాలు చేపట్టడానికి, నిర్ణీత వ్యవధిగల పథకాలు కార్యాచరణ అమలుకు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం ఈ సంస్థ లక్ష్యం. సఫాయి కార్మికుల సమస్యలు తొలగించడానికి, వారి సామాజిక ఆర్థిక పురోగతికి, వారికి సంబంధించిన చట్టాల అమలుకు చర్యలు తీసుకోవాలి. వీరి సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తుంది. వీరి స్థితిగతులకు సంబంధించిన నివేదికలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణీత వ్యవధుల్లో సమర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సూచించిన అంశాలను పరిశీలనకు చేపడుతుంది. ఒకప్పటి విధంగా మరుగుదొడ్లను మనుషుల చేత శుభ్రపరిచి మోసుకుపోయే విధానం చాలా రాష్ర్టాలలో లేదు. అయినప్పటికీ కొన్ని రాష్ర్టాలలో ఇంకా కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా ఉన్న సఫాయి కార్మికులలో సగం మంది ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నారని వెల్లడైంది.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో 34,859 మంది సఫాయి కార్మికులు ఉన్నారని అంచనా. వీరికి ఈ వృత్తి నుంచి విముక్తి కలిగించిన తరువాత పునరావాసానికి చర్యలు తీసుకోవలసి ఉన్నది. పీవీ ప్రభుత్వం 1993లో చట్టం చేసినప్పటికీ ఈ వృత్తి నిర్మూలన కాకపోవడం గమనార్హం.  పాతకాలపు సఫాయి విధానం నిషేధానికి గురైనప్పటికీ, పలు నగరాలలో పారిశుద్ధ్య కార్మికుల జీవన స్థితిగతులు కూడా దయనీయంగా ఉన్నాయి. మురికి నీటి కాలువలను శుభ్రపరిచే క్రమంలో 1993 నుంచి గత ఏడాది జూన్‌ వరకు 801 మంది పారిశుద్ధ్య కార్మికులు మరణించారని సఫాయి కరంచారీస్‌ జాతీయ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ మన్‌హర్‌ వల్జిభాయి జాలా వెల్లడించారు. మురికి నీటి కాలువలను, సెప్టిక్‌ ట్యాంక్‌లను శుభ్రపరచడానికి యంత్రాలను, భద్రతా పరికరాలను సమకూర్చాలనే ప్రతిపాదన ఉన్నది. నగరాల్లో మురికి నీటి కాలువలను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య మహారాష్ట్రలోనే యాభై వేలకు పైగా ఉంటుందని అంచనా. logo