హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన పోటీదారులను మనుషుల్లాగా చూడలేదని, వారిని అంగట్లో బొమ్మల్లా చూశారని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ మహిళానేతలు తుల ఉమ, రమాదేవి, సుశీలారెడ్డి, సుమిత్రా ఆనంద్, అన్నపూర్ణ మంగళవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రులు రైతుల సమస్యలను విస్మరించి, అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, కనీసం వారిని ఓదార్చకుండా, అందాల పోటీల్లో మాత్రం ఏకంగా ఏడుసార్లు పాల్గొన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నదంటూనే.. అందాల పోటీల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుతోనే మిస్ ఇంగ్లండ్ మ్యాగీ అందాల పోటీల నుంచి మధ్యలోనే వెళ్లిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు తీసిందని విమర్శించారు. మ్యాగీ ఆరోపణల వెనక బీఆర్ఎస్ ఉన్నదంటూ కాంగ్రెస్ నాయకుడు చామల కిరణ్‌రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. అందాల పోటీదారులను తమ రియల్ఎస్టేట్ కార్యాలయాలకు తీసుకెళ్లి, గంటలకొద్దీ నిలబెట్టారని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి, తన కుటుంబసభ్యులు సహా అందాల పోటీదారులకు ఏర్పాటుచేసిన డిన్నర్లో పాల్గొన్నారని, తన సోదరుడు తిరుపతిరెడ్డితో పోటీదారులకు మెమోంటోలు ఎలా ఇప్పించారని ప్రశ్నించారు. ఈ పోటీలకు, ఆయనకు ఉన్న సంబంధం ఏమిటని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పేర్లు తీయకుండా కాంగ్రెస్ సీఎం, మంత్రులకు నిద్ర పట్టడంలేదని దుయ్యబట్టారు. అందాల పోటీలతో రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని బీఆర్ఎస్ నాయకురాలు రమాదేవి ప్రశ్నించారు.