హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ విస్తరణ పనులను చేపట్టిందని, వెంటనే జోక్యం చేసుకుని ఆ పనులను నిలువరించాలని కేంద్ర జల్‌శక్తి శాఖను తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖకు తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం లేఖ రాశారు. కృష్ణా ట్రిబ్యునల్-1 అవార్డు ప్రకారం బేసిన్‌లోని ప్రాజెక్టులకే నీటి కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తుచేశారు. అదీగాక శ్రీశైలం ప్రాజెక్టును కేవలం జల విద్యుత్తు ప్రాజెక్టుగానే పరిగణించిందని తెలిపారు.
కానీ, ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డును తుంగలో తొకిందని వివరించారు. చెన్నై తాగునీటి సరఫరా పేరిట శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీని ఏర్పాటుచేశారని, అది కూడా అంతర్రాష్ట్ర ఒప్పందంలోని సామర్థ్యాల కంటే అత్యధిక సామర్థ్యంతో కాలువలను నిర్మించిందని గుర్తుచేశారు. 2005లో పోతిరెడ్డిరెడ్డి హెడ్ రెగ్యులేటరీ, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీలను విస్తరించిందని, బేసిన్ అవతలికి కృష్ణా జలాలను తరలిస్తున్నదని వివరించారు. ప్రస్తుత సామర్థ్యాలను విస్తరించేందుకు జీవో-203ను జారీచేసిందని, ఆ పనులను కూడా చేపడుతున్నదని తెలిపారు.