హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఇంకా పూర్తిస్థాయిలో స్టడీ చేయలేదని, త్వరలోనే ఉన్నతాధికారులతో చర్చించి ఎలా ముందుకెళ్లాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ మంగళవారం పలువురు మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ దూకుడుగా ముందుకు పోతున్నదని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం విధానమేమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
దీనికి మంత్రి ఉత్తమ్ బదులిస్తూ.. ఏపీ చేపట్టిన జీబీ లింక్ ప్రాజెక్టుపై ఇంకా పూర్తిస్థాయిలో అధ్యయనం చేయలేదని బదులిచ్చారు. త్వరలోనే ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులతో సమీక్షించి ఏవిధంగా ముందుకెళ్లాలనేది నిర్ణయిస్తామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్రానికి ఫిర్యాదుచేశామని, ఆ ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని స్పష్టంచేశారు. దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.