సిటీబ్యూరో, మార్చ్17(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లోని ఓబుల్‌రెడ్డి స్కూల్ సమీపంలోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనిరుద్‌రెడ్డి, దీపికారెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆ ఇంట్లో నేపాల్‌కు చెందిన మహేష్ షాహీ(30), అప్సర దంపతులు 45రోజుల క్రితం పని మనుషులుగా చేరారు. ఇంటి ఆవరణలోని సర్వెంట్ క్వార్టర్స్‌లో వారు నివాసం ఉంటున్నారు. కాగా కుటుంబసభ్యులతో కలిసి అనిరుధ్‌రెడ్డి. దీపికారెడ్డి గత శుక్రవారం మధ్యాహ్నం ఊటీ వెళ్లారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కట్టర్స్, రాడ్స్‌తో మహేష్ షాహీ, అతడి భార్య అప్సర యజమాని ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్రూమ్లోని అల్మారాలను పగలగొట్టి డైమండ్ నెక్లెస్‌లు, రాడో వాచ్‌లు, బంగారు ఆభరణాలను తస్కరించారు. సుమారు 4గంటల పాటు ఇంట్లో ఉన్న నిందితులు చోరీ చేసిన అనంతరం అక్కడినుంచి ఉడాయించారు.
గత నెల 6వ తేదీన నందగిరి హిల్స్‌లో ఓ వ్యాపారి ఇంట్లో నేపాలీ గ్యాంగ్ సభ్యులు భారీ చోరీకి పాల్పడ్డారు. వాచ్‌మెన్‌కు మత్తు మందు ఇచ్చి రెండుకోట్లకు పైగా విలువైన బంగారం, వజ్రాలు, నగదు దోచుకెళ్లారు. పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి భారత్- నేపాల్ సరిహద్దులో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేపాల్‌లోనే ఉండి కోకాపేటలో ఉన్న ఏజెంట్ సహాయంతో ముఠాసభ్యుడిని ఆ ఇంట్లో పనికి కుదిర్చి అదును చూసి కొందరితో కలిసి చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు చెప్పారు. నేపాల్ నుంచే మత్తుమందు తీసుకొచ్చి పనిచేస్తున్నచోట సిబ్బందికి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌లో నేపాలీల దొంగతనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కాపలాదారులు, ఇంటి పనివాళ్లుగా చేరుతున్న నేపాలీలు యజమాని వద్ద నమ్మకం సంపాదించుకునే వరకు ఎదురుచూసి అదును చిక్కిన వెంటనే దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు. వరుసగా ఘటనలు జరుగుతున్నా పోలీసు అధికారులు మాత్రం పాఠాలు నేర్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రేటర్లో పని మనుషులకు విపరీతమైన డిమాండ్ ఉండడం, ఇంటా, బయటా సహాయకులుగా పనిచేసేందుకు స్థానికులు పెద్దమొత్తంలో వేతనం ఆశిస్తుండడంతో నగరవాసులు బయట వారికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వారైతే 24గంటలూ తమకు అందుబాటులో ఉంటారనే ఉద్దేశ్యంతో యజమానులు వారివైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా ఇళ్లల్లో చేరి తమ కుటుంబం గడిచేందుకు ఉపాధి చూపమంటూ ఇంటి యజమానిని కోరుతారు. ఇళ్లల్లో విలువైన ఆభరణాలు భద్రపరిచే ప్రాంతాలు, కుటుంబసభ్యుల రాకపోకలపై కన్నేస్తారు. ఎప్పటికప్పుడు తాము మకాం వేసిన కుటుంబాలపై కన్నేసి అనువైన సమయం కోసం వేచి చూస్తారు. ఆ కుటుంబసభ్యులు వేడుకలు, విహారయాత్రలకు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తమ పథకం అమలు చేసి ఇంట్లో దొరికినంత దోచుకుని రాత్రికి రాత్రే ఢిల్లీకి చేరుతారు. అక్కడ ముఠాలకు బంగారు అభరణాలు అందజేసి సొంతూళ్లకు వెళతారు. పనిమనుషుల ముసుగులో చేతికొచ్చిన సొమ్ముతో విలాసవంతంగా జీవిస్తున్న వీరిని గనమించిన యువకులు నేరబాట పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
హైదరాబాద్ మహానగరంలో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నా దొంగల ముఠాలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారనే అపవాదు ఉంది. నాలుగు కమిషనరేట్ల పరిధిలో పోలీసుల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంపన్నులు, వ్యాపారుల ఇళ్లల్లో పనివాళ్లుగా చేరి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్న నేపాల్ దొంగల్లో 60శాతం మందిని ఇప్పటికీ పోలీసులు గుర్తించడం లేదు. కొత్త ప్రాంతంలో నిందితులను గుర్తించేందుకు కొన్నిసార్లు అక్కడి పోలీసుల సహకారం నామమాత్రంగా ఉంటోంది. నేపాల్ దొంగల ముఠాలను పట్టుకోవడంలో విఫలమైన సిటీ పోలీసులు దొంగల ముఠాకు సంబంధించి అనుమానితుల ఫొటోలను విడుదల చేశారు. ఇండియా-నేపాల్ బోర్డర్లో లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. దొంగల ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఒక ప్రకటన విడుదల చేశారు. అయినా వారి ఆచూకీ తెలియలేదు. అంతేకాకుండా ఒక పోలీస్ బృందం నేపాల్‌కు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టి తిరిగి వచ్చారు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. పనిలో చేర్చుకునే ముందు ఆ వ్యక్తుల వ్యక్తిగత వివరాలు, నేరచరిత్రపై ఆరా తీసి, ఆధార్, ఫోన్‌నెంబర్లు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. హాక్ ఐ యాప్‌లో వివరాలు నమోదు చేస్తే వారి పుట్టుపూర్వోత్తరాలు మొత్తం రాబడతామని పోలీసులు చెప్పారు. విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో ఉంచాలని, దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందజేయాలని పేర్కొంటున్నారు.