యాదగిరిగుట్ట, మార్చి 17 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం మరో ఆరు నెలల్లో డిజిటలైజ్ కాబోతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట క్షేత్రంలోని సేవలను డిజిటలైజ్ చేసేందుకు పాలకవర్గం ప్రయత్నిస్తున్నదని సమాచారం. టీటీడీకి ఆన్లైన్ అప్లికేషన్లను అందిస్తున్న టీసీఎస్‌ను దేవస్థానం సంప్రదించగా, అంగీకరించినట్టు తెలుస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం సుమారు రూ.1,300 కోట్ల ఖర్చుతో యాదగిరిగుట్ట దేవస్థానాన్ని పునర్నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సాధారణ రోజుల్లో సగటున 50వేల మంది వరకు వస్తుండగా, వారాంతపు సెలవులు, పండుగ రోజుల్లో లక్ష మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుట్టపై సేవలను ఆన్లైన్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే సంకల్పించారు. టీటీడీ తరహాలో డిజిటలైజ్ చేయాలని భావించారు. ఈ మేరకు ప్రక్రియను ప్రారంభించి, లడ్డూ, టికెట్లు, ఇతర సేవలను ఆన్లైన్ చేశారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ కార్యరూపం దాల్చనున్నది.
రద్దీ, ఆదాయం పెరుగడంతో భక్తులకు మెరుగైన సదుపాయాలు, దర్శన లైన్ల నిర్వహణతోపాటు ఆలయ పరిపాలన పాదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో డిజిటలైజ్ చేయాలని దేవస్థానం భావిస్తున్నది. శ్రీవారి దర్శనంతోపాటు ఆలయంలో ఉన్న అన్ని సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకొనిరావాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో టీసీఎస్‌ను యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు సంప్రదించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి డిజిటల్ అప్లికేషన్లను అభివృద్ధి చేసి, సేవలను అందించాలని కోరగా, టీసీఎస్ అంగీకరించిందని సమాచారం. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఆరు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన డీపీఆర్ రూపకల్పన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. సేవలు అందుబాటులోకి వస్తే.. పరిపాలనతోపాటు భక్తులకు అందించే సకల వసతులు ఆన్లైన్ ద్వారానే చేపట్టనున్నారు.
ఆడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, లీగల్, లీజులు, ప్రధానాలయం, శివాలయం, డోనర్ సెల్, శానిటేషన్, ప్రొటోకాల్, వాహన పూజలు, అన్నదానం, గోశాల, పాతగుట్ట దేవస్థానం, అనుబంధ ఉపాలయాలు, సివిల్, ఎలక్ట్రికల్ విభాగాలు, ట్రాన్స్‌పోర్టు, టోల్గేట్, భద్రతా విభాగం, కల్యాణకట్ట, అద్దె గదులు తదితర విభాగాలు పూర్తిగా ఆన్లైన్ కానున్నాయి. అంతేకాదు, కొనుగోళ్లు, టెండర్లు, బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల జీత భత్యాల వంటివన్నీ డిజిటల్ పద్ధతిలో నిర్వహించేలా యాప్‌ను రూపొందిస్తున్నారని తెలిసింది. టీటీడీ తరహాలో భక్తులకు మరింత సౌకర్యవంతంగా బ్రేక్ దర్శనాలు, అతి శ్రీఘ్ర దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ, వీవీఐపీ దర్శనాలతోపాటు అన్ని రకాల అర్జిత సేవల టికెట్లు ముందుగానే ఆన్లైన్లో పొందేలా రూపొందిస్తున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. స్వామివారి ధర్మ దర్శనానికి కూడా స్లాట్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారని సమాచారం. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ సైతం సిద్ధం చేయాలని దేవస్థానం భావిస్తున్నదని తెలిసింది.