చింతకాని, ఆగస్టు 10: ‘నా పట్టా భూమిలో రోడ్డు వేస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండతో మండలంలో దౌర్జన్యాలకు దిగుతున్నారు. స్థానిక నాయకుల వేధింపులు ఇక తట్టుకోలేను. నాకు ఆత్మహత్యే శరణ్యం’ అంటూ ఓ రైతు సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ ఆవేదనను తట్టుకోలేక తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో సోమవారం చోటుచేసుకున్నది. నాగులవంచకు చెందిన రైతు జొన్నలగడ్డ మల్లికార్జునరావుకు అదే గ్రామంలో వ్యవసాయ భూమి ఉన్నది.
పూర్వకాలం నుంచి రైతుల పొలాల మధ్య నుంచి ఒక చిన్న డొంక దారి మాత్రమే ఉండేది. ఈ దారిని పెద్దగా మార్చేందుకు మతేపల్లి మారెట్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు అంబటి వెంకటేశ్వర్లుతోపాటు మరికొందరు కాం గ్రెస్ నాయకులు పూనుకున్నారు. బాధిత రైతు పట్టా భూమిలోకి పొక్లెయిన్ తీసుకెళ్లి బలవంతంగా దారి వెడల్పు పనులు చేసేందుకు యత్నించగా.. రైతు మల్లికార్జునరావు అడ్డుకోవడంతో పనులు నిలిపివేశారు. ‘మా వెనుక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార ఉన్నారు.. ఏం చేసుకుంటావో చేస్కో.
నీపై తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసి నిన్నే లోపల వేయిస్తాం’ అని వారు బెదిరించారని రైతు వాపోయాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు మల్లికార్జునరావు.. తన పొలం వద్దే పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకుని సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. ‘నేను ఏమీ చేయలేక, ఒంటరినైపోయి ఈ పురుగుల మందుతాగి చచ్చిపోదాం అనుకుంటున్నా..’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన రైతును కుటుంబ సభ్యులు గమనించి వెంటనే స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించారు.