హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కూరగాయల కొరతను తీర్చేందుకు సాగు విస్తీర్ణం పెంచాలని, అందుకు రైతులే మార్గ దర్శకులుగా ముందుండాలని తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి కే సురేంద్రమోహన్ కోరారు. కూరగాయల సాగు విస్తీర్ణం పెంపును ఒక ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యాన వర్సిటీ, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి ఎంపిక చేసిన వలంటీర్లకు కూరగాయల సాగుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సురేంద్రమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక లక్ష ఎకరాలలో మాత్రమే కూరగాయల సాగు జరుగుతున్నదని, దీన్ని వచ్చే ఐదేండ్లలో 5 లక్షల ఎకరాలకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్టర్ ఏ భగవాన్, యూనివర్సిటీ అధికారులు లక్ష్మీనారాయణ, చీనా, సురేశ్‌కుమార్, ప్రశాంత్, ఉద్యానశాఖ అధికారులు రవికుమార్, జాయింట్ డైరెక్టర్ బాబు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాజకీయాలకు వన్నెతెచ్చిన మాజీ ఎమ్మెల్యే ఓంకార్ జీవితం చిరస్మరణీయమని మంత్రి సీతక్క కొనియాడారు. మంగళవారం రవీంద్రభారతిలో ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓంకార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతక మాట్లాడుతూ.. ఓంకార్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని, ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. నిరంతరం ప్రజల కోసం పరితపించే ఓంకార్ లేని లోటు ఎన్నటికీ తీరనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు బీవీ రాఘవులు, కూనంనేని సాంబశివరావు, మద్దికాయల అశోక్ ఓంకార్, గాదగోని, గుమ్మడి నరసయ్య, జెవీ చలపతిరావు, గుర్రం విజయ్‌కుమార్, సీహెచ్ మురారీ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధరంగంగా కుందేళ్ల పెంపకం లాభదాయకంగా ఉంటుందని వెటర్నరీ అసోసియేట్ డీన్ డాక్టర్ మాధురి పేర్కొన్నారు. మంగళవారం పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య వర్సిటీ, పశువుల జన్యువిభాగం, కుందేళ్ల పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో కుందేళ్ల పెంపకంపై ఎస్సీ మహిళా రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, యువతకు కుందేళ్ల పెంపకం మంచి ఉపాధి లభించడంతోపాటు ఆర్థికంగా లాభాలు తెచ్చిపెడుతుందని తెలిపారు.