బండ్లగూడ, మార్చి 17: ఆన్లైన్లో బుక్ చేసుకున్న వస్తువులకు బదులుగా వేరే వస్తువులను సరఫరా చేస్తూ అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు గడిస్తున్న నలుగురు ముఠా సభ్యులను రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ర్టానికి చెందిన ఎస్.విజయ్‌కుమార్ కరోనా కంటే ముందు ఆన్లైన్లో ఒక మొబైల్ ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. పోస్టల్ ద్వారా వచ్చిన పార్సెల్‌ను తెరిచి చూస్తే అందులో మొబైల్ ఫోన్‌కు బదులుగా బ్లూటూత్ స్పీకర్లు వచ్చాయి. దీంతో విజయ్‌కుమార్ సంబంధిత వ్యక్తులను సంప్రదించేందుకు ప్రయత్నించగా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అతను ఇదే విధానాన్ని ఎంచుకొని అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బులు గడుస్తున్నాడు.
ఇందు కోసం బెంగళూరులో ఓ కార్యాలయం ఏర్పాటు చేసి అప్నా జాబ్ యాప్‌ను రూపొందించి, దాని ద్వారా టెలీకాలర్లను నియమించి ఆయుర్వేద మందులను అమ్మే పేరుతో ఉద్యోగాలు ఇచ్చాడు. మరికొంతమందితో కలిసి బీదర్, హైదరాబాద్, గుడిమల్కాపూర్, హైదర్‌గూడ తదితర ప్రాంతా ల్లో వ్యాపారాన్ని విస్తరింపజేశాడు. కాగా విజయ్‌కుమార్ మంజుల అనే మహిళ నుంచి కస్టమర్ మొబైల్ డేటాను కొనుగోలు చేసేవాడు. ఇందు కోసం ఆమెకు ఒక లక్ష ఫోన్ నెంబర్లు తీసుకొస్తే రూ.పది వేలు ఇచ్చేవాడు. విజయ్‌కుమార్ ఆయా నంబర్లకు తమ టెలీ కాలర్స్ ద్వారా ఫోన్లు చేయించి రూ.3500 కు సాంసంగ్ మొబైల్ ఫోన్ ఆఫర్ ఉందని చెప్పించేవాడు. ఇందుకు ఆకర్షితులైన అమాయక ప్రజలు ఫోను కొనుగోలు చేసేందుకు రూ.3500 చెల్లించేవారు.
అనంతరం వారికి పోస్టల్ శాఖ బీఎస్పీఎల్ ఖాతా తెరిచి ఎస్ బ్యాంకును లింక్ చేసి మొబైల్ ఫోన్ స్థానంలో బ్లూటూత్ స్పీకర్లు, హెర్బల్ ఉత్పత్తులు వంటివి తక్కువ విలువైన వస్తువులను పంపించేవాడు. ఇలా 2021 నుంచి ఇప్పటి వరకు 380 మందిని మోసం చేసి డబ్బులు గడించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్‌గూడలో ఉన్న విజయ్‌కుమార్ కార్యాలయంపై దాడి చేసి విజయ్‌కుమార్, శివకుమార్, ముద్దీ న్, శశికాంత్ అనే నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి మానిటర్లు, లాప్టాప్స్, ప్రింటర్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మంజుల పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐలు నాగరాజు, ఎస్.శేషు, రవికుమార్, టాస్క్‌ఫోర్స్ అధికారి ఇక్బాల్సిద్ధిఖి తదితరులు పాల్గొన్నారు.