హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): అందాల పోటీల్లో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణా జరపడం లేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీల్లో తనను ఓ వేశ్యలా చూశారని, ఏకాంతంగా గడపాలంటూ మిస్ బిహేవ్ చేశారని మిల్లా మ్యాగీ ఆరోపించిన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంగళవారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. “మిల్లా మ్యాగీ ఆరోపణలు అవాస్తవం. అలాంటిదేమీ జరగలేదు. ప్రభుత్వం విచారణకు ఎలాంటి కమిటీ వేయలేదు. అసలు ఆ చర్చే లేదు. మిల్లా మ్యాగీ వివాదాన్ని పట్టించుకోవద్దు’ అని వ్యాఖ్యానించారు.
‘ద సన్’, ‘ద గార్డియన్’ పత్రికల్లో వచ్చిన మిల్లా మ్యాగీ ఇంటర్వ్యూలను తాను చదివానని, ఆమె చెప్తున్నట్టు ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పారు. కాగా, ‘మిల్లా మ్యాగీ ఆరోపణలు అవాస్తవమైతే చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన విందు తాలుక సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టగలరా?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, సమాధానం చెప్పలేక మంత్రి జూపల్లి నీళ్లునమిలారు. సీసీటీవీ ఫుటేజీ అంశాన్ని దాటవేస్తూ ఈ పోటీలతో తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని గడించిందని చెప్పారు.
‘మిల్లా మ్యాగీ వివాదంపై కమిటీ కూడా వేశారు కదా.. ఇప్పుడు అలాంటిదేమీ లేదంటే ఏమనుకోవాలి?’ అని మీడియా ప్రతినిధులు మరో ప్రశ్న వేయగా.. ‘కమిటీ లేదు.. ఏంలేదు’ అని జూపల్లి జవాబిచ్చారు. జయేశ్‌రంజన్ కమిటీని నియమించినట్టు అనేక మీడియా సమావేశాల్లో చెప్పారు కదా? అని మళ్లీ ప్రశ్నించగా.. ‘అదేమీ లేదు.. కమిటీ వేయలేదు’ అని మంత్రి బదులిచ్చారు. మిల్లా మ్యాగీ వివాదంపై మంత్రి స్పష్టత ఇవ్వకుండా దాటవేసే సమాధానాలు, పొంతనలేని విషయాలు మాట్లాడటం అనుమానాలకు తావిస్తున్నది.
మిస్ వరల్డ్ నిర్వహణకు రూ.31 కోట్లు ఖర్చైందని మంత్రి జూపల్లి వివరించారు. అందులో స్పాన్సర్ల నుంచి రూ.21 కోట్లు వచ్చాయని, మరో రూ.పది కోట్లు రావాల్సి ఉన్నదని తెలిపారు. ఒకవేళ అవి రాకపోతే ప్రభుత్వమే ఆ ఖర్చు భరించాల్సి ఉంటుందని చెప్పారు. చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన విందు లో ఒక్కో ప్లేటుకు రూ.లక్ష ఖర్చు చేసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఒక్కో ప్లేటుకు రూ.8 వేలు మాత్రమే ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఒక్కో కంటిస్టెంట్‌కు 30 తులాల బంగారం ఇచ్చామనేది కూడా అవాస్తవేమనని చెప్పారు.