కుటుంబ పెద్ద చనిపోతే..ఆ ఫ్యామిలీ రోడ్డున పడవద్దని నాటి బీఆర్ఎస్ సర్కారు బీమా పథకాలకు శ్రీకారం చుట్టింది. కుటుంబంలోని భార్యాపిల్లలకు ఆసరాగా ఉండాలని భావించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబీమా, చేనేత బీమా పథకాలు అమలు చేసి చూపించింది. అలాంటి పథకాలకు కాంగ్రెస్ హయాంలో లబ్ధిదారులకు అందని ద్రాక్షలా మారాయి. రూ. 5లక్షల సాయం కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా డబ్బులు జమ కాకపోవడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
యాదాద్రి భువనగిరి, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు. అందులో రైతుబీమా ఒకటి. రైతు మరణిస్తే బాధితు కుటుంబాన్ని ఆదుకోవాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి నాంది పలికింది. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే నామినీకి రూ. 5లక్షల బీమా పరిహారం అందుతుంది. అన్నదాతకు ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. 18 ఏండ్ల నుంచి 59 సంవత్సరాల వయసున్న రైతులందరూ అర్హులే. పట్టాదారు పాస్ పుస్తకాలున్న ప్రతి రైతుకూ బీమా పథకం వర్తిస్తుంది. జిల్లాలో సుమారు 2.30లక్షల మంది రైతులు ఉన్నారు. అయితే కొంత కాలంగా బీమా డబ్బులు సకాలంలో జమ కావడంలేదు. అన్ని దరఖాస్తులు సక్రమంగానే సమర్పించినా నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి. జిల్లాలో 100కి పైగా దరఖాస్తు దారులకు సాయం అందాల్సి ఉన్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రీమియం సరిగా చెల్లించకపోవడంతో ఈ చిక్కులు వచ్చినట్లు తెలుస్తున్నది.
వ్యవసాయ రంగం తర్వాత పెద్ద పరిశ్రమ చేనేత. రైతు బీమా తరహాలోనే నేత కార్మికుల కోసం కేసీఆర్ సర్కారు సరికొత్త కార్యక్రమానికి పురుడుపోసింది. నేతన్నలకు భరోసా కల్పించాలని జాతీయ చేనేత దినోత్సవం రోజున నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించింది. నేత కార్మికుడు దురదృష్టవశాత్తు చనిపోతే ఆయన కుటుంబానికి రూ. 5లక్షల సాయం అందుతుంది. ప్రీమియం సర్కారే చెల్లిస్తుండగా, ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి తెలంగాణ నేతన్నకు భద్రత అనే కొత్త పేరును పెట్టింది. దీని కింద జిల్లాలో 10,686 మంది నమోదు చేసుకోగా, ఇందులో 9,743మంది చేనేత కార్మికులు, 943 మరమగ్గాల కార్మికులు ఉన్నారు. జిల్లాలో ప్రస్తుతం 35 బీమా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు, నేతన్నల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. సకాలంలో పెట్టుబడి సాయం అందించడంతోపాటు రైతు చనిపోతే వారం, పది రోజుల్లోనే సదరు కుటుంబానికి నామినీ డబ్బులు అందేలా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రీమియం చెల్లించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్సయ్యింది. వారం, పది రోజులు దేవుడెరుగు.. ఏడాదైనా సాయం అందక రైతు కుటుంబాలు అరిగోస పడుతున్నాయి. ఇక నేతన్నలదీ అదే పరిస్థితి దాపురింది. ఇంటి పెద్ద చనిపోతే బక్కచిక్కిన కుటుంబాలకు రూ. 5లక్షల సాయం అందితే ఎంతో సంబుర పడేవి. పిల్లల పెండ్లిళ్లు, చదువుల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవి. అసలు బీమా డబ్బులే రాకపోవడంతో కాంగ్రెస్ సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నారు.