KTR | హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ ప్రయివేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు ఏసీబీ అధికారులు.
కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే. గవర్నర్ అనుమతితో తదుపరి చర్యలకు కాంగ్రెస్ సర్కార్ ఉపక్రమించింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్‌పై అభియోగం మోపారు. కేటీఆర్‌పై 4 సెక్షన్లు.. 13(1)A, 13(2)పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేసింది ఏసీబీ.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఫార్ములా – ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ కాసేపటి క్రితం అసెంబ్లీ లాబీలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చకు పెట్టే దమ్ము లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెడితే ఎవరు ఏంటో ప్రజలే నిర్ణయించుకుంటారు. రేవంత్ రెడ్డి లీకులిచ్చి రాజకీయ దుష్ర్పచారానికి పాల్పడుతున్నారు. ఫార్ములా ఈ రేస్, ఇతర స్కాములంటూ అసత్యాలను ప్రచారం చేసే కన్నా సభలో చర్చ పెడితే నిజాలు తెలుస్తాయి కదా..? చర్చ నాలుగు గోడల మధ్య కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. లీకు వీరుడు సీఎం ఇచ్చే లీకులే తప్ప నిజాలు అధికారికంగా చెప్పే దమ్ములేదు అని కేటీఆర్ అన్నారు.
ఈ ఫార్ములా రేస్‌లో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు. న్యాయంగా వ్యవహరించే, ప్రభుత్వ ఆరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వేంటనే కేసు కొట్టేస్తారనే నమక్మముంది. అధికారికంగా చెప్పే దమ్ములేక కేబినెట్లో నాలుగు గంటల చర్చ అంటూ వార్తలు రాపిస్తున్నారు. కేబినెట్ అంటే గాసిప్ బ్యాచ్ లెక్క తయారైంది. నిజాలు చెప్పే దమ్ము లేఖ సీఎస్‌తో నోటీసులు, అనుమతులు అంటూ లీకులిస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకున్నది. 2023లో విజయవంతంగా రేస్ జరిగి అన్నివర్గాల మన్ననలు అందుకున్నది. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల లబ్ధి చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగాల్సి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దానిని ఏకపక్షంగా రద్దు చేసింది. అప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగిందనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అని నిన్న సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.
నిజానికి ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయని ఇదివరకే నేను వివరంగా చెప్పాను. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు. రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హకు ఉన్నది. కనుక మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అన్ని విషయాలు సవివరంగా రాష్ట్ర ప్రజలకు శాసనసభ వేదికగా చెప్తాం. శాసనసభ జరుగుతున్నది కనుక మీకు అనుకూలమైన రోజే ఈ చర్చను పెట్టండి. ఫార్ములా-ఈ అంశంలో ఎలాంటి అవకతవకలు కానీ, అవినీతి కానీ జరగలేదు. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి చేసే ఈ రేసును కేవలం మీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారు. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయి’ అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
SSC Exams | తెలంగాణలో మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు
Suspension | రాగిజావ పడి విద్యార్థికి తీవ్ర గాయాలయిన ఘటనలో పాఠశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్