రాత్రయితే చాలు డంపింగ్ యార్డు నుంచి వచ్చే దట్టమైన పొగ, దుర్వాసనతో మడికొండతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దగ్గు, దమ్ము, కళ్లు మంటలు, చర్మ వ్యాధులతో సతమతమవుతున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని ఏళ్లుగా పాలకులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో విసుగెత్తిన ప్రజలు ‘డంపింగ్ యార్డ్ హఠావో’ నినాదంతో పోరుబాట పట్టారు. స్థానికులంతా కలిసి అడ్‌హక్ కమిటీ ఏర్పాటు చేసుకొని డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేస్తూ మడికొండలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
– వరంగల్/మడికొండ, మార్చి 10
ఎండాకాలం రాక ముందే మడికొండ శివారులోని డం పింగ్ యార్డు మండుతున్నది. పది రోజులుగా చెత్త గుట్టలు అంటుకొని చుట్టు పక్కల గ్రామాల్లో పొగ కమ్ముకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దుర్వాసనకు తోడు పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దగ్గు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఏటా వేసవి కాలంలో మంటలతో వచ్చే పొగ, వానకాలంలో దుర్వాసన, కలుషితమవుతున్న భూగర్భ జలాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 15 ఏళ్లుగా ‘డంపింగ్ యార్డ్ హఠావో’ నినాదంతో ప్రజలు పోరాడుతున్నా పట్టించుకునే వారు లేరు.
మడికొండ, రాంపూర్, నర్సింగరావుపల్లి, ధర్మసాగర్, కుమ్మరిగూడెం గ్రామాల ప్రజలపై డంపింగ్ యార్డు ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. చీకటి పడితే చాలు డంపింగ్ యార్డు నుంచి వచ్చే పొగ, దుర్వాసన గ్రామాలను కమ్మేస్తుండగా, ప్రజలు తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్నారు. దగ్గు, దమ్ము, చర్మ వ్యాధులు, కళ్లు మంటల వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికే జబ్బుల బారిన ప్రజలు పదుల సంఖ్యలో మరణించిన ఘటనలు ఉన్నాయి.
డంపిం గ్ యార్డు నుంచి పొగ, దుర్వాసనతో వ్యాధుల బారిన పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో స్థానికులు పోరుబాట పట్టారు. ‘డంపింగ్ యార్డు హఠావో’ అనే నినాదంతో రోడ్డెక్కారు. రిలే దీక్షలు మొదలుపెట్టారు. మడికొండతోపాటు చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు ఉద్యమంలో భాగసామ్యమై పోరాడుతున్నారు. డంపింగ్ యార్డ్ ఎత్తేసే వరకూ పోరుబాట వీడేది లేదంటున్నారు. ‘డంపింగ్ యార్డు హఠావో’ నినాదం ఉద్యమ రూపం దాల్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
పేరుకుపోతున్న చెత్త గుట్టలు
డంపింగ్ యార్డులో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. సుమారు 36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ యార్డు లో 30 ఎకరాల్లో చెత్త పోగైంది. రోజూ సుమారు 450 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, శుద్ధి చేసేందుకు బల్దియా పాలకులు సరియైన ప్రణాళికలు చేయకపోవడం విస్మయాన్ని కలిగిస్తున్నది. మహానగరాల్లో చెత్త శుద్ధికి అవలంబిస్తున్న పద్ధతులను అధ్యయనం చేసే దిశలో గ్రేటర్ పా లకులు అడుగులు వేయడం లేదు. హైదరాబాద్ తరహాలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైం ది.
వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని గొప్పలు చెబుతున్న పాలకులు ముందు నగరానికి స వాల్ విసురుతున్న చెత్త సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయాలని, విఫలమైన బయో మైనింగ్ స్థానంలో చెత్త గుట్టలను కరిగించేందుకు కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టాలని పలువురు కోరుతున్నారు. ఇక చెత్తను తగించేందుకు చేపట్టిన బయో మైనింగ్ ప్రక్రియ సక్సెస్ కాలేదు. మూడేళ్లుగా సాగుతున్న బయో మైనింగ్ పక్రియ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. అప్పుడు డంపింగ్ యార్డులో ఉన్న 3.75 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ ద్వారా ఏడాదిన్నర కాలంలో శుద్ధి చేయాలని టెండర్ ఇచ్చారు. మూడేళ్లుగా ప్రక్రియ సాగుతూనే ఉంది.
బయో మైనింగ్ టెండర్ గడువు ముగిసి ఏడాది దాటినా అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు. దీనికి తోడు ప్రతి రోజూ డంపింగ్ యార్డుకు టన్నుల కొద్ది చెత్తను తరలిస్తూనే ఉన్నారు. ఇక చెత్త సమస్యను అధిగమించేందుకు చేపట్టిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ప్లాంటు ఏర్పాటు సమీక్షలకే పరిమితమైంది. హైదరాబాద్‌లో జరిగిన సమీక్ష లో పలు దపాలుగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌పై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అ ధికారులను ఆదేశించారు. సుమారు రూ.800 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు వేశారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 10 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉండాలన్న సూ చనతో గ్రేటర్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పించారు. వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్ల మధ్య 30 ఎకరాల స్థలం సేకరించి రెండు నగరాలకు కలిపి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చేసిన ప్రతిపాదనలు ముందుకు కదలడం లేదు.
కొత్తగా 6 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల చెత్త
రాంపూర్ శివారులోని బల్దియా డంపింగ్ యార్డులో బయోమైనింగ్‌కు కేటాయించిన చెత్త కాకుండా కొత్తగా సుమారు 6 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త శుద్ధికి మూడేళ్లు పడితే కొత్తగా వచ్చి చేరుతున్న చెత్త శుద్ధికి ఇంకెన్నేళ్లు పట్టాలన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. రోజురోజుకూ విస్తరిస్తూ మహా నగరంగా మారుతున్న వరంగల్ నగర ‘చెత్త’ సమస్యకు సత్వర పరిష్కారం అన్వేషించకుంటే భవిష్యత్‌లో పరిష్కరించలేని సమస్యగా మారే ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.