Janhvi Kapoor | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తన కెరీర్లోనే అత్యంత భిన్నమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆయన నటన, ఎమోషనల్ సన్నివేశాలు, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే సినిమా విజయంతో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకుల నుంచి కూడా ఆమె పాత్రకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథలో ఆమె పాత్రకు సరైన ప్రాధాన్యం లేదని, పాత్ర రూపకల్పన బలహీనంగా ఉందని సోషల్ మీడియాలో అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
‘పెద్ది’ విడుదలైన తొలి రోజు నుంచే జాన్వీ కపూర్ పాత్రపై మిశ్రమ స్పందన వచ్చింది. కథ మొత్తం హీరో చుట్టూనే తిరగడంతో హీరోయిన్‌కు పెద్దగా స్కోప్ దక్కలేదని చాలామంది అభిప్రాయపడ్డారు. కొన్ని సన్నివేశాలు కథా ప్రవాహానికి పెద్దగా ఉపయోగపడలేదనే కామెంట్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో జాన్వీ పాత్ర కేవలం కమర్షియల్ అవసరాల కోసమే చేర్చినట్టుగా ఉందని కొందరు విమర్శకులు పేర్కొన్నారు. సినిమా విడుదల తర్వాత ప్రమోషనల్ కార్యక్రమాల్లో కూడా జాన్వీ పెద్దగా కనిపించకపోవడం ఈ చర్చలకు మరింత ఊతమిచ్చింది. దీంతో ఆమె సినిమాపై ఆసక్తి చూపలేదా? లేక నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ కారణంగా దూరంగా ఉందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
‘పెద్ది’ సినిమా కోసం జాన్వీ కపూర్ ఏకంగా రూ.8 కోట్ల పారితోషికం అందుకుందనే వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎన్టీఆర్ సరసన నటించిన ‘దేవర’ చిత్రానికి ఆమె రూ.5 కోట్ల వరకు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ లెక్కన చూస్తే ‘పెద్ది’ కోసం ఆమె రెమ్యునరేషన్ గణనీయంగా పెరిగినట్టే. అయితే పాత్రకు వచ్చిన స్పందనతో పోలిస్తే ఈ పారితోషికం చాలా ఎక్కువగా ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు స్టార్ క్రేజ్, మార్కెట్ విలువ ఆధారంగానే పారితోషికాలు నిర్ణయిస్తారని ఆమె అభిమానులు వాదిస్తున్నారు. ‘దేవర’, ‘పెద్ది’ వంటి భారీ తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో కొత్త తెలుగు ప్రాజెక్టులు లేవని సమాచారం. దీంతో ఆమె టాలీవుడ్ కెరీర్‌పై కూడా చర్చ మొదలైంది. వరుసగా పెద్ద సినిమాల్లో కనిపించినప్పటికీ, నటిగా తన ముద్ర వేయలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.