Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ప్రముఖ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించిన ఇంటెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ‘భారత భాగ్య విధాతా’ (Bharat Bhhagya Viddhaata) డిజిటల్ స్ట్రీమింగ్ రంగానికి సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా, ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.
ముంబైని వణికించిన భయానక 26/11 ఉగ్రదాడుల (26/11 Mumbai Terror Attacks) యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ చీకటి రాత్రి ముంబైలోని కామా అసుపత్రిలో (Cama and Albless Hospital) ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, ఉగ్రవాదుల తూటాలను సైతం లెక్కచేయకుండా రోగులు, గర్భిణీలను కాపాడిన సాధారణ ఆసుపత్రి సిబ్బంది, నర్సులు, వార్డు బాయ్‌ల త్యాగనిరతిని ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ చిత్రంలో నర్సు అంజలి పాత్రలో కంగనా రనౌత్ అద్భుతమైన నటన కనబరచగా, గిరిజా ఓక్, స్మిత తంబే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మనోజ్ తపాడియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, పెన్ స్టూడియోస్ (Pen Studios) మరియు మణికర్ణిక ఫిల్మ్స్ పతాకాలపై నిర్మించారు. జూన్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు జీ5 వేదికగా ఆగస్టు 14 నుంచి అందుబాటులోకి రానుంది.