Toxic | కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్‌తో సినిమా కంటెంట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత వచ్చిన పాటలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. ‘టాక్సిక్’ థియేట్రికల్ ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 7:01 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ యష్ పవర్ఫుల్ లుక్‌తో కూడిన ఓ ఎక్స్‌ప్లోసివ్ పోస్టర్‌ను విడుదల చేశారు.
‘టాక్సిక్’ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్లో యష్‌ను మునుపెన్నడూ చూడని స్టైలిష్, ఇంటెన్స్ అవతార్‌లో చూపించిన దర్శకురాలు గీతూ మోహన్‌దాస్.. ట్రైలర్లో ఎలాంటి ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్ సన్నివేశాలు, యష్ పాత్రలోని డార్క్ షేడ్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ట్రైలర్లో బయటపడే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో సాయంత్రం 7:01 గంటల కోసం యష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ సరసన బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉండేలా కథను డిజైన్ చేసినట్లు ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు, అప్డేట్స్ సూచిస్తున్నాయి. యష్ పాత్ర చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్టర్ ప్రపంచం, యాక్షన్, డ్రామా, కుటుంబ భావోద్వేగాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే గ్లింప్స్, టీజర్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేందుకు సిద్ధమయ్యారు. మరి యష్ ‘టాక్సిక్’లో ఎలాంటి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు? సినిమా కథలోని అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటి? అనే ప్రశ్నలకు ట్రైలర్ ఏ మేరకు సమాధానం ఇస్తుందో చూడాలి.