Crime News : నడిరోడ్డుపై కాంగ్రెస్ నేత (Congress Leader) దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్య (Murder) కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కర్ణాటక (Karnataka) లోని ఉడుపి జిల్లా (Udupi district) లో ఈ దారుణం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నేత, ప్రముఖ వ్యాపారవేత్త అయిన డేవిడ్ డిసౌజా (David D’Souza) ను గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా కాల్చిచంపారు. రోడ్డు పక్కన ఆపి ఉన్న తన కారు ఎక్కుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఆయనపై కాల్పులు జరిపాడు.
ఈ భయానక ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. డేవిడ్ డిసౌజా తన కారు డోర్ తీస్తుండగా వెనుక నుంచి నడుచుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా తుపాకి బయటకు తీశాడు. డిసౌజా తేరుకునేలోపే అతి సమీపం నుంచి ఆయనపై పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. దాంతో తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కాల్పులు జరిపిన వెంటనే మోటార్‌సైకిల్‌పై సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడివున్న డిసౌజాను స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు.
కాంగ్రెస్ నేత, కాంట్రాక్టర్‌గా పేరున్న డిసౌజా హత్యతో స్థానిక రాజకీయ, వ్యాపార వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. సమాచారం అందుకున్న సీనియర్ పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని, నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ హత్య వెనుక వ్యాపార శత్రుత్వం ఉందా..? లేక రాజకీయ కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.