Karuppu | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ త్రిష కాంబినేషన్లో తెరకెక్కిన ఫాంటసీ కోర్ట్‌రూమ్ డ్రామా ‘కరుప్పు’ థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైన ఈ చిత్రం జూన్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకు ‘కరుప్పు’ రూపంలో భారీ విజయాన్ని దక్కింది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం పాజిటివ్ టాక్‌తోనే ప్రపంచవ్యాప్తంగా రూ.304 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూర్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
సాధారణంగా భారీ వసూళ్లు సాధించిన స్టార్ హీరోల సినిమాలు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు థియేటర్లలో కొనసాగిన తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే ‘కరుప్పు’ విషయంలో మాత్రం ఈ సాంప్రదాయానికి భిన్నంగా కేవలం నాలుగు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్కు తీసుకురావడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో సినిమా క్రేజ్ ఇంకా కొనసాగుతుండగానే ఓటీటీలో విడుదల చేస్తే మరింత ఎక్కువ వ్యూయర్షిప్ లభిస్తుందని సంస్థ భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్లో ఎర్లీ స్ట్రీమింగ్ ఒప్పందాలు సాధారణమవుతున్న నేపథ్యంలో ‘కరుప్పు’ కూడా అదే వ్యూహంలో భాగమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సాధారణ కోర్ట్‌రూమ్ డ్రామా కాదు. న్యాయ వ్యవస్థలోని లోపాలను తనకు అనుకూలంగా మార్చుకునే అవినీతి లాయర్ బేబీ కన్నన్‌కు ఎదురుగా, మానవ రూపంలో భూమిపైకి వచ్చిన గ్రామదేవత కరుప్పుసామి మధ్య సాగే సంఘర్షణ ఈ కథకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.పురాణ గాథలను ఆధునిక న్యాయ వ్యవస్థతో మిళితం చేస్తూ దర్శకుడు ఆర్జే బాలాజీ రూపొందించిన కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫాంటసీ, సామాజిక అంశాలు, రాజకీయ కోణాలు, కోర్ట్‌రూమ్ ఎమోషన్స్‌ను సమపాళ్లలో మేళవించడం సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ముఖ్యంగా సూర్య నటన, త్రిష పాత్ర, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.