హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ):కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని పలువురు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. గోదావరి పుష్కరాలపై ఏర్పాటుచేసిన తొలి క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవా రం సచివాలయంలో సమావేశమైంది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీపీఆర్ సిద్ధం చేయాలి
గోదావరి ఆది పుష్కరాలను 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహిస్తామని మంత్రులు ప్రకటించారు. 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలు నిర్వహిస్తామని తెలిపారు. పుష్కరాల కోసం 96 ప్రాంతాల్లో ఘాట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పుష్కరాలకు ఎనిమిది కోట్ల మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ నెలాఖరులోగా డీపీఆర్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రద్దీ అధికంగా ఉండే తొమ్మిది ప్రాంతాలను టైర్-1 కింద ఎంపికచేశామని వెల్లడించారు.