Harish Rao | హైదరాబాద్ : శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మెస్ ఛార్జీలు, రైతు బీమా, వ్యవసాయ యంత్ర పరికరాలకు డబ్బులు ఇవ్వలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని భట్టి విక్రమార్కకు హరీశ్‌రావు సవాల్ విసిరారు.
రాష్ట్ర రుణాలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా శాసనసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఛాలెంజ్ వేస్తున్నా.. భట్టి విక్రమార్క మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే.. నేతి బీరకాయలో నెయ్యి ఎంతనో భట్టి మాటల్లో నీతి అంత ఉంది. ఉట్టిఉట్టిగా మాట్లాడట్లేదు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో ఇస్తాను. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మెస్ ఛార్జీలు పెంచింది. వ్యవసాయ యంత్ర పరికరాలకు రాయితీ నిధులు ఇచ్చాం. నేను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధం. ఒక వేళ ఇచ్చి ఉంటే భట్టి విక్రమార్క రాజీనామా లేఖను సీదా గవర్నర్ గారికి ఇస్తారా..? అని స్పీకర్ ద్వారా హరీశ్‌రావు సవాల్ విసిరారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంవత్సరము రూ. 1.27 లక్షల కోట్ల అప్పు చేసింది. ఈ లెక్కన అప్పులు చేస్తే ఐదేండ్లలోనే గత ప్రభుత్వ అప్పును మించిపోతారు. మేం పదేండ్లలో రూ. 7 లక్షల కోట్లు అప్పు చేస్తే.. వీళ్ల అప్పు ఐదేండ్లలోనే రూ. 7 లక్షల కోట్లు దాటిపోతోంది. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం పరంగా చూస్తే.. మేం కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రాన్నే అప్పగించాం. రూ. 2.93 లక్షల కోట్ల బడ్జెట్‌తో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు అప్పగించాం. రాష్ట్ర సొంత ఆదాయం రూ. 35 వేల కోట్ల నుంచి రూ. 1.50 లక్షల కోట్లకు పెంచాం. కరోనా వల్ల, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గడం వల్ల రాష్ట్రంపై కొంత అప్పుల భారం పడింది. కానీ కొన్ని పాత అప్పులను కూడా ఈ ప్రభుత్వం మా ఖాతాలో వేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని అప్పులను మేం చేసినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది రూ. 4.17 లక్షల కోట్ల అప్పు మాత్రమే. రూ. 4.17 లక్షల కోట్ల అప్పును రూ. 7 లక్షల కోట్ల అప్పు అని తప్పుడు ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడాది కాలంలోనే రూ. 1.27 లక్షల కోట్ల అప్పు చేసింది. ఏడాదిలో రూ. 1.27 లక్షల కోట్ల అప్పు చేస్తే.. వచ్చే ఐదేండ్లలో ఎంత చేస్తారు..? భూములు కుదువపెట్టి అప్పులు తీసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రూ. 75 కోట్లకు ఎకరం చొప్పున టీజీఐఐసీ భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
SSC Exams | తెలంగాణలో మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు
Suspension | రాగిజావ పడి విద్యార్థికి తీవ్ర గాయాలయిన ఘటనలో పాఠశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్
Sikandar | సల్మాన్ ఖాన్ అభిమానులకు విజువల్ ఫీస్ట్‌లా సికిందర్ టీజర్ కట్..!