యాదాద్రి భువనగిరి : రాగిజావ ( Raagijava) పడి విద్యార్థికి తీవ్ర గాయాలయిన ఘటనలో పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్‌ను (Prinicipal Venkatesh) యాదాద్రి, భువనగిరి జిల్లా కలెక్టర్ గురువారం సస్పెన్షన్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు అతడిపై చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ (Collector) హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలోని సంస్థనారాయణపూర్ సర్వేల్ (Survel) గురుకుల పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న నల్లగొండ జిల్లా గట్టుప్పల్ గ్రామానికి చెందిన శివరాత్రి సామెల్ బుధవారం రోజు ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు తొటి విద్యార్థులకు సర్వ్ చేస్తుండగా రాగి జావ జారీపడి కాళ్ల మీద పడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మరో విద్యార్థి మదన్, వంట మనిషి బోయ ఇందిరకు గాయాలయ్యాయి.
సర్వేల్ గురుకులంలో 650 మంది చదువుతుండగా కేవలం ఆరుగురు వంట మనుషులు మాత్రమే ఉన్నారు. ఇంతమందికి సర్వ్ చేయడం ఇబ్బందిగా మారడంతో ప్రిన్సిపాల్ ప్రతి రోజూ విద్యార్థులతోనే పనిచేయిస్తున్నారు. విద్యార్థికి గాయాలైన విషయం తెలియడం తో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో పాఠశాలకు చేరుకున్నారు.
మెనూలో లేని రాగి జావను వడ్డించడం చూస్తే గురుకుల పాఠశాలలో రోజూ మెనూ పాటించడం లేదని తెలుస్తున్నది. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని, చదువులు కూడా సరిగ్గా చెప్ప డం లేదని, రోజూ ఎనిమిదో తరగతి విద్యార్థులతో డైనింగ్ హాల్లో పనులు చేయిస్తున్నారని పలువురు విద్యార్థులు ఆరోపించారు.